కబ్జా కోరల్లో పాణ్యం

ABN , First Publish Date - 2022-09-13T05:47:40+05:30 IST

వైసీపీ నాయకుల కబ్జా కోరల్లో పాణ్యం ఇరుక్కుపోయిందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు.

కబ్జా కోరల్లో పాణ్యం
పాణ్యం ఇందిరానగర్‌లోని పాఠశాలను పరిశీలిస్తున్న గౌరు చరిత

పాణ్యం, సెప్టెంబరు 12: వైసీపీ నాయకుల కబ్జా కోరల్లో పాణ్యం ఇరుక్కుపోయిందని పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత ఆరోపించారు. పాణ్యం ఇందిరానగర్‌లోని ఇల్లుగా మారిన పాఠశాలను ఆమె  సోమవారం పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ రెండు నెలలుగా పాఠశాలను ఇంటిగా మార్చుకొని పనులు నిర్వహిస్తున్నా అధికారులు గాని, ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోకపోవడం దారుణమన్నారు. చందాలు వేసుకొని శిక్షణా కేంద్రంగా మార్చుకుంటున్నామని వైసీపీ నాయకులు  చెప్పడం అమానుషమన్నారు. చందాలు వేసుకొని శిక్షణా కేంద్రం తయారు చేసుకొనే స్థితిలో ఐటీడీఏ ఉందా? అని ప్రశ్నించారు. చందాలు ఎంతిచ్చారు, ఎవరికిచ్చారని ప్రశ్నించడంతో తమకేమీ తెలియదని మహిళలు చెప్పారు. వైసీపీ నాయకులు పాఠశాలను ఆక్రమించి వంటగది, పడక గది, హాలు, మెట్లు, బాత్‌ రూంలు ఏర్పాటు చేసుకున్నారన్నారు. చెంచులకు ఐటీడీఏ కేటాయించిన నాలుగు ఎకరాల శ్మశాన స్థలాన్ని కబ్జా చేసి తమలపాకు తోటను ఎకరాకు రూ.30 వేలకు కౌలుకిచ్చాడని కాలనీ చెంచులు తమ దృష్టికి తీసుకువచ్చారన్నారు. అలాగే ప్రభుత్వ భవనాలను ఆక్రమించా రన్నారు. వైసీపీ నాయకులు పాణ్యంలో 60 ఎకరాల మేర కబ్జా  చేశారని ఆరోపించారు. ఐటీడీఏ పొదుపు మహిళల కోసం నిర్మించిన కమ్యూనిటీ హాలు ఇంత వరకు నిరుపయోగంగా ఉందన్నారు. కమ్యూనిటీ హాలును శిక్షణా కేంద్రంగా ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించారు. చెంచు కాలనీలో జరుగుతున్న అక్రమాలను కలెక్టరు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. పాణ్యం నియోజకవర్గంలో  ఒక నయీం ఉన్నాడని, మరో నయీం చెంచు కాలనీలో తయారయ్యాడని అన్నారు.  


‘చెంచు కాలనీ లే అవుట్‌ను ఇవ్వండి’ 


  చెంచు కాలనీ లేఅవుట్‌ను ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత డిప్యూటీ తహసీల్దారును కోరారు. వైసీపీ నాయకుల అక్రమాలపై తహసీల్దారు కార్యాలయంలో ఆమె ఫిర్యాదు చేశారు వైసీపి తొత్తులుగా మారారా అంటూ డిప్యూటీ తహసీల్దారు మల్లికార్జునరెడ్డి, ఎంపీడీవో దస్తగిరి, ఎంఈవో కోటయ్యను ఆమె నిలదీశారు.. పాఠశాల, శ్మశానం, కమ్యూనిటీ హాలును కబ్జా చేసినా ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. ఇందిరానగర్‌ లేఅవుట్‌ ను ఇవ్వాలని కోరడంతో రెండు రోజుల్లో అందజేస్తామని డీటీ మల్లికార్జునరెడ్డి బదులిచ్చారు. ప్రభుత్వ భవ నాల వివరాలను వెంటనే అందించాలన్నారు. వైసీపీకి వంత పాడితే నష్టపోయేది అధికారులేనన్నారు. చెంచుకాలనీ అక్రమాలపై టీడీపి అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్తామన్నారు.  


Updated Date - 2022-09-13T05:47:40+05:30 IST