గంజహళ్లి చెరువు ఆక్రమణ

ABN , First Publish Date - 2022-12-10T00:00:34+05:30 IST

గంజహళ్లి గ్రామంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. స్థానికులు కొంతమంది బోర్లు వేసుకొని యథేచ్ఛగా పంటలు సాగు చేసుకుంటున్నారు.

గంజహళ్లి చెరువు ఆక్రమణ
అక్రమణకు గురైన గంజహళ్లి చెరువు

బోరు, విద్యుత మోటార్ల ఏర్పాటు

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు

గోనెగండ్ల, డిసెంబరు 9: గంజహళ్లి గ్రామంలోని చెరువు ఆక్రమణకు గురవుతోంది. స్థానికులు కొంతమంది బోర్లు వేసుకొని యథేచ్ఛగా పంటలు సాగు చేసుకుంటున్నారు. గంజహళ్లి గ్రామంలో 366/1బీ, 366/2, 367/1, 368/1, 368/2, 369/1, 369/2 సర్వే నెంబర్లలో దాదాపు 82 ఎకరాల్లో చెరువు ఉంది. వర్షాకాలంలో ఈ చెరువుకు నీరు చేరితే దాదాపు 200 ఎకరాల్లో పంటలు సాగు చేసుకోవచ్చు. కొన్నేళ్లుగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో చెరువులోకి సక్రమంగా నీరు చేరడం లేదు. ఇదే అదునుగా గ్రామానికి చెందిన కొందరు రాజకీయ పార్టీ నాయకులు చెరువులో దాదాపు 45 నుంచి 50 ఎకరాల వరకు ఆక్రమించారు. అందులో బోర్లు వేసి అక్రమంగా విద్యుత కనెక్ష న్లు కూడా ఏర్పాటు చేసుకొని వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, శనగ పంటలు పండించుకుంటున్నారు. గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా చర్యలు శూన్యం.

చెరువును కాపాడండి

గంజహళ్లి చెరువు ఆక్రమణకు గురైన మాట వాస్తవమే. పంటలు సాగు చేసుకుంటున్నారు. బోర్లు కూడా వేశారు. అక్రమంగా విద్యుత కనెక్షన్లు కూడా ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలి.

- లింగమ్మ, సర్పంచ గంజహళ్లి

అధికారులకు ఫిర్యాదు చేశా

చెరువు ఆక్రమణకు గురైనట్లు తెలుసుకొని గత ఏడాది నుంచి పలుమార్లు రెవెన్యూ, మైనర్‌ ఇరిగేషన అధికారులకు ఫిర్యాదు చేశాను. అయినప్పటికీ అధికారులు స్పందించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆక్రమణదారుల నుంచి చెరువును కాపాడాలి.

- తోలురాముడు, గంజహళ్లి

Updated Date - 2022-12-10T00:00:35+05:30 IST