ముగిసిన దసరా వేడుకలు

ABN , First Publish Date - 2022-10-07T06:02:23+05:30 IST

కర్నూలు నగరంలో దసరా మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.

ముగిసిన దసరా వేడుకలు
నిమజ్జనానికి తరలివెళ్తున్న దుర్గాదేవి విగ్రహాలు

కన్నుల పండువగా దుర్గామాత విగ్రహాల నిమజ్జనం

కర్నూలు(కల్చరల్‌), అక్టోబరు 6: కర్నూలు నగరంలో దసరా మహోత్సవాలు బుధవారం ఘనంగా ముగిశాయి.  నగరంలోని ఆలయాల్లో  అమ్మవారికి రాజరాజేశ్వరి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం జమ్మిచెట్టు వద్దకు వెళ్లి, శమీ పూజ లు నిర్వహించారు. జమ్మి ఆకులను   పంచుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.

 ప్రజల్లో భక్తిభావం పెంచిన ఉత్సవాలు: టీజీ వెంకటేశ్‌

ప్రజల్లో భక్తిభావం పెంచేలా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తు న్నామని మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ అన్నారు. ఈ ఏడాది  దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన సుమారు 30 దుర్గామాత విగ్రహాలను తుంగభద్ర నది ఒడ్డున గల సంకల్‌బాగ్‌ దుర్గాఘాట్‌లో నిమజ్జనం చేశారు. గురువారం సాయంత్రం ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌ మాట్లాడుతూ గత 35 ఏళ్లుగా కర్నూలు నగరంలో దుర్గామాత విగ్రహాల ఏర్పాటు, నిమజ్జనం నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, విద్యావేత్త డాక్టర్‌ కేవీ సుబ్బారెడ్డి, వ్యాపారవేత్త టీజీ శివరాజప్ప, అడిషనల్‌ ఎస్పీ డి. ప్రసాదరావు, కర్నూలు డీఎస్పీ కేవీ మహేశ్‌ పాల్గొన్నారు.

కర్నూలు(న్యూసిటీ): నగరంలోని పురాతన నగరేశ్వరస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు బుధవారం ఘనంగా నిర్వహిం చారు. శాస్త్రోక్తంగా రుత్వి కుల వేద మంత్రోచ్చరణ నడుమ రథాన్ని నగర మేయర్‌ బీవై.రామయ్య ప్రారంభించారు. ఆదిదంపతులు అభయహస్తంతో నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. నగర పాలక సంస్థ కార్యాలయంలో విజయదశమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీకాంత్‌ వేదమంత్రాలతో అమ్మవారికి పూజలు నిర్వహించారు. తొమ్మిదిరోజులపాటు పూజలందుకున్న అమ్మవారికి కార్యాలయంలోని అందరూ అయురా రోగ్యాలు, సుఖసంతోషాలతో ఉండాలని  మేనేజర్‌ చిన్నరాముడు అమ్మవారిని వేడుకున్నారు.

ఓర్వకల్లు: మండలంలోని హుశేనాపురం, ఓర్వకల్లు, నన్నూరు, లొద్దిపల్లె, పూడిచెర్ల, ఉయ్యాలవాడ, సోమయాజులపల్లె, శకునాల తదితర గ్రామాల్లో విజయ దశమి పర్వదినాన్ని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఉదయాన్నే కొత్తదుస్తులు ధరించి ప్రధాన ఆల యాల్లో పూజలు నిర్వహించారు. ఉత్సవ విగ్రహాలను గ్రామోత్సవం నిర్వహించారు. జమ్మి చెట్టుకు వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. హుశేనాపుర గ్రామంలో జడ్పీ మాజీ చైర్మన్‌ రాజశేఖర్‌ జమ్మిచెట్టుకు పూజలు చేసి గ్రామోత్సవం నిర్వహించారు. అమ్మవారికి కాయక ర్పూరాలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ మల్లి కార్జున ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించారు.

కోడుమూరు(రూరల్‌): మండలంలోని గ్రామాల్లో బుధవారం దసరా వేడుకలను ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయానే స్నానమా చరించి, నూతన దుస్తులు ధరించి ఆలయాల్లో, జమ్మి చెట్టుకు పూజలు చేశారు. శమీపత్రం తీసుకుని పెద్దలకు అందించారు. ఆశీస్సులు తీసుకున్నారు. వర్కూరు లక్ష్మీమాధవస్వామి ఆలయంలో కొలువుంచిన దుర్గాదేవిని గురువారం నిమజ్జనం చేశారు.

గూడూరు: విజయ దశమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. బుధవారం గూడూరు పట్టణంలో ప్రజలు ఊరేగింపుగా వెళ్లి జమ్మి చెట్టు వద్ద పూజలు నిర్వహించారు. అలాగే స్థానిక అంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. అలాగే పెంచికలపాడు గ్రామంలో నవరాత్రు లను పురస్కరించుకొని రాముల వారిని పల్లకిలో ఊరేగించారు.


Read more