పోండి.. కట్టుకోండి!

ABN , First Publish Date - 2022-02-16T06:17:00+05:30 IST

ఎమ్మిగనూరు నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన స్థలం అది.

పోండి.. కట్టుకోండి!

ఆట స్థలంలో దుకాణాలకు వైసీపీ నేత అభయం
మాచాని సోమప్ప ఆశయానికి తూట్లు
స్థలం మాదంటున్న చేనేత సంఘం, మున్సిపాలిటీ
నోటీసులకే పరిమితమైన మున్సిపల్‌ అధికారులు
ఆందోళనకు సిద్ధ్దమవుతున్న క్రీడాకారులు, విద్యార్థులు


ఎమ్మిగనూరు: ఎమ్మిగనూరు నడిబొడ్డున ఉన్న రూ.కోట్ల విలువైన స్థలం అది. మాచాని సోమప్ప వీవర్స్‌ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు ఆట స్థలం కోసం కేటాయించిన స్థలం అది. అక్కడ ఓ వైసీపీ నేత ‘దుకాణాలు కట్టుకోపోండి’ అని అభయ హస్తం ఇచ్చారు. అది మున్సిపాలిటీ స్థలమని అధికారులు చెప్పినా వినుకోలేదు. నాకు తెలుసుపోండని కొట్టి పారేశారు. మున్సిపల్‌ అధికారులు అభ్యంతరం చెబుతున్నా.. నోటీసులు ఇచ్చినా పట్టించుకోకుండా దుకాణాలు నిర్మించేశారు. దీంతో చేనేతపిత మాచాని సోమప్ప ఆశయాలకు గండికొట్టారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ క్రీడామైదానం తమదని చేనేత సహకార సంఘం, ఈ స్థలం మున్సిపాలిటీకి చెందుతుందని ఆశాఖ అధికారులు అంటున్నారు.  

75 ఏళ్ల క్రితం: ఎమ్మిగనూరు పట్టణంలో పద్మశ్రీ మాచాని సోమప్ప 1947లో వీవర్స్‌ కాలనీని ఏర్పాటు చేశారు. ఇందులో గుడి, బడి, పార్కు, క్రీడా మైదానం మొదలైనవాటికి స్థలాలు కేటాయించారు. సర్వేనంబర్‌ 431లో 6.98 ఎకరాలు ఆటస్థలంగా కేటాయించారు.

ఏం జరిగిందంటే..: కొవిడ్‌ సమయంలో అక్కడ కూరగాయల దుకాణాలకు అధికారులు అనుమతి ఇచ్చారు. అయితే వ్యర్థాలు అక్కడే పడేస్తుండడంతో దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో వారిని ఖాళీ చేయిం చాలని స్థానికులు చేనేత సంఘం కమిటీకి ఫిర్యాదు చేశారు. చివరకు ఈ పంచాయితీ ఓ వైసీపీ నేత వద్దకు వెళ్లినట్లు సమాచారం. ఆయన వెనకాముందు ఆలోచించకుండా ఆ స్థలంలో దుకాణాలు కట్టుకోపోండని చెప్పినట్లు తెలిసింది. ఇందుకు సొసైటీ అధికారులు కూడా సహకరించా రన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో ఒక స్థానిక నాయకుడు కూడా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. పట్టణ ప్రజల అవసరాల కోసం వదిలిన ఈ స్థలంలో 75 ఏళ్ల తరువాత 10 వ్యాపార దుకాణాలను నిర్మించారు. ఇది వివాదానికి తెరలేపింది. రూ. కోట్లు విలువ చేసే క్రీడా మైదానంలో దుకాణాలు నిర్మించడాన్ని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. అయితే ఈ వ్యవహారం వెనుక భారీ స్కెచ్‌ ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. కొందరు కీలక వ్యక్తులు రూ.కోట్ల విలువైన ఈ స్థలంపై కన్నేయడం వల్లే వైసీపీ నేత ద్వారా అనధికార అనుమతి ఇప్పించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

మాదంటే మాది..

క్రీడా మైదానం మాదంటే మాదని చేనేత సహకార సంఘానికి, మున్సిపాలిటీకి మధ్య వివాదం నడుస్తోంది. వీవర్స్‌ కాలనీ లే అవుట్‌ ఎల్పీ నెం. 105-1947 వేసిన సమయంలో ఈ ఆటస్థలం ఉందని, అందులో ఇతర కట్టడాలు చేయకూడదని జీవో 72లో ఉందని పలువురు అంటున్నారు. 1947లో వీవర్స్‌ కాలనీకి, ఇతర అవసరాలకు, ప్లేగ్రౌండ్‌గా చేనేత సహకార సంఘం అధికారులు గుర్తించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రౌండ్‌ నిర్వహణను చేనేత సంఘం చూస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఆటస్థలంలో దుకాణాల నిర్మాణం మొదలు పెట్టారు.

నోటీసులకే పరిమితమైన మున్సిపాలిటీ

వీవర్స్‌ కాలనీలోని క్రీడా మైదానం మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుందని పేర్కొంటున్న అధికారులు ఈనెల 3వతేదీ, 11వతేదీ చేనేత సంఘానికి నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ చేనేత సంఘం పట్టించుకోకుండా ఏకంగా 10 దుకాణాల నిర్మాణం పూర్తిచేశారు. ఇంతకుమించి  మున్సిపల్‌ అధికారులు దేనికి ముందుకు వెళ్లలేకపోతున్నారనే అనుమానాలు ఉన్నాయి. వారిపై అధికారపార్టీ నేతల ఒత్తిళ్లు ఉన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.

ఆందోళనకు సిద్ధమవుతున్న క్రీడాకారులు, విద్యార్థులు

వీవర్స్‌ కాలనీ క్రీడా మైదానంలో దుకాణాలు నిర్మించటం పట్ల క్రీడాకారులు, యువకులు, విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాలు ప్రారంభించిన మరుసటిరోజే ధర్నా నిర్వహించారు. అలాగే మాజీ కౌన్సిలర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దుకాణాల నిర్మాణంపై త్వరలో వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు కలిసి ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

మున్సిపాలిటీకే చెందుతుంది

వీవర్స్‌ కాలనీ మైదానానికి 1947లో (105/1947)లే అవుట్‌ ఇచ్చారు. ఇది ప్లేగ్రౌండ్‌గా మారింది. దీంతో అది మున్సిపాలిటీ కిందికి వచ్చింది. ఇప్పుడు అది ఎలా ఉందో అలాగే ఉంచాలి. దీనిపై ఎవరికీ అధికారం ఉండదు. టౌన్‌ ప్లానింగ్‌ జీవో 72 ప్రకారం లే అవుట్‌లో అభివృద్ధి చేసిన స్థలాలు మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. క్రీడామైదానంలో నిర్మించిన దుకాణాలను తొలగించాలని రెండుసార్లు చేనేత సహకార సంఘానికి నోటీసులు ఇచ్చాం.

 -కృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌

చేనేత సంఘం పరిధిలోనే ప్లేగ్రౌండుగా గుర్తించారు

1947లో మాచాని సోమప్ప వీవర్స్‌ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు కేటాయించిన ఈ మైదానాన్ని రిజర్వు ఫర్‌ ప్లే గ్రౌండ్‌ అని గుర్తించారు. అది కూడా సంఘం పరిధిలోని ప్లే గ్రౌండ్‌గానే గుర్తించారు. 1947 నుంచి ఇప్పటి వరకు సంఘం పేరు పైనే రిజిస్టర్‌ ఉంది. ఎవరి పేరు మీద ట్రాన్స్‌ఫర్‌ చేయలేదు. అమ్మలేదు. ఈ మైదానంలో ఏ కార్యక్రమం చేసిన మా అనుమతి తీసుకుంటారు. ఇటీవల కొంతమంది కూరగాయల వ్యాపారులు మైదానం సరిహద్దులను అక్రమించుకోవటానికి యత్నించారు. దీంతో రక్షించడానికి దుకాణాలు నిర్మించి వారికే ఇచ్చాం.

-వెంకటేశ్వర్లు, కార్యదర్శి, చేనేత సహకార సంఘం, ఎమ్మిగనూరు  

క్రీడా మైదానంగానే ఉంటుంది

క్రీడా మైదానం అక్రమణలకు గురి కాకుండా ఉండేందుకే దుకాణాలు నిర్మించాం. క్రీడామైదానం అలాగే ఉంటుంది. అందులో ఎలాంటి మార్పు రాదు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

-నాగరాజు, చైర్మన్‌, చేనేత సహకార సంఘం 

Read more