డీఆర్‌డీఏ-ఐకేపీకి నాడు-నాడు బాధ్యతలు

ABN , First Publish Date - 2022-10-13T04:59:53+05:30 IST

ఉన్న బాధ్యతలతోనే సతమతమవుతుంటే తిరిగి కొత్త శాఖలు అప్పగించడంపై డీఆర్‌డీఏ-ఐకేపీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు.

డీఆర్‌డీఏ-ఐకేపీకి నాడు-నాడు బాధ్యతలు

  1. అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన కూడా..
  2. భారం మోపడంపై ఐకేపీ సిబ్బంది ఆందోళన
  3. అదనపు అలవెన్స ఇవ్వాలని డిమాండ్‌

కర్నూలు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉన్న బాధ్యతలతోనే సతమతమవుతుంటే తిరిగి కొత్త శాఖలు అప్పగించడంపై డీఆర్‌డీఏ-ఐకేపీ సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. అదనపు పనికి అదనపు అలవెన్స ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. డీఆర్‌డీఏ-ఐకేపీ అసిస్టెంట్‌ ప్రాజెక్టు మేనేజర్‌ (ఏపీఎం)లకు అప్పగిస్తూ పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఐకేపీ ఏపీఎంలు మాతృ సంస్థ నిర్వహించే పింఛన్లు, ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, జగనన్న చేదోడు, బ్యాంకు లింకేజీ రుణాలు, పొదుపు సహా వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు.. వంటి పథకాల నిర్వహణతోపాటు ఇప్పటి వరకు పాఠశాల విద్యా శాఖ చూసే నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, అమ్మఒడి, జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం), టీఎంఎఫ్‌, ఎస్‌ఎంఎఫ్‌.. వంటి ప్రభుత్వ కార్యక్రమాలను కూడా పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యాశాఖ అధికారులు విద్యాభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ బాధ్యతలను ఐకేపీ ఏపీఎంలకు అప్పగిస్తున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంటే.. ఇక నుంచి పాఠశాలల్లో మరో విభాగం అధికారుల అజమాయిషీ పెరగనుంది. అయితే అదనపు బాధ్యతలకు అదనపు అలవెన్స ఇవ్వాలని డీఆర్‌డీఏ-ఐకేపీ ఏపీఎంలు డిమాండ్‌ చేస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాల పరిధిలో 54 మండలాల్లో 54 మంది ఏపీఎంలు పని చేస్తున్నారు. 


Read more