ప్రజా సమస్యలపై గర్జించిన సీపీఎం

ABN , First Publish Date - 2022-07-05T06:26:29+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న అధిక ధరల భారం తగ్గించాలని, జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సీపీఎం నగరంలో భారీ ర్యాలీని నిర్వహించింది.

ప్రజా సమస్యలపై గర్జించిన సీపీఎం

నగరంలో భారీ ర్యాలీ

సమస్యలు పరిష్కరించాలని నేతల డిమాండ్‌ 


కర్నూలు(కలెక్టరేట్‌), జూలై 4: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై మోపుతున్న అధిక ధరల భారం తగ్గించాలని, జిల్లాలో ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం సీపీఎం నగరంలో భారీ ర్యాలీని నిర్వహించింది. ఉదయం 11 గంటలకు స్థానిక సుందరయ్య జంక్షన్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో వివిధ మండలాల నుంచి వచ్చిన వేలాది మంది ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ కార్యాలయం ముందు భారీ ధర్నాను నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి గౌస్‌దేశాయ్‌ మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద, మద్య తరగతి ప్రజలపై భారాలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుండా మోసం చేసిన ప్రధాని మోదీ ఏ మొహం పెట్టుకుని తెలుగు గడ్డపైన అడుగు పెట్టారని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వి.వెంకటేశ్వర్లు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడితే తనను ఎక్కడ జైల్లో పెడుతారోననే భయంతో జగన్‌ తేలు కుట్టిన దొంగలా ఉంటున్నారనీ ఆరోపించారు. నవరత్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కె.ప్రభాకర్‌ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో రోడ్లుపై గుంతలు ఏర్పడినా.. మురికివాడల్లా మారిన మున్సిపాలిటీలు కనపడుతున్నాయని విమర్శించారు. వేదవతి,  గుండ్రేవుల, ఆర్‌డీఎస్‌ కుడి కాలువ నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.రామాంజినేయులు, పీఎస్‌ రాధాకృస్ణ, కె.వెంకటేశ్వర్లు, జి.రామకృష్ణ, కేవీ నారాయణ, నగర కార్యదర్శిలు ఎం.రాజశేఖర్‌, టి.రాముడు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-05T06:26:29+05:30 IST