పరిశ్రమలకు సహకారం

ABN , First Publish Date - 2022-09-29T05:47:03+05:30 IST

రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని.. పనులు ప్రారంభించిన 30 నెలల్లోనే రామ్‌కో సిమెంటు పరిశ్రమ పూర్తి కావడమే దానికి నిదర్శనమని సీఎం జగన్‌ అన్నారు.

పరిశ్రమలకు సహకారం
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్‌

రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ప్రారంభోత్సవంలో సీఎం జగన్‌

నంద్యాల, ఆంధ్రజ్యోతి/బనగానపల్లె/ కొలిమిగుండ్ల: రాష్ట్రం ప్రగతి పథంలో నడుస్తోందని.. పనులు ప్రారంభించిన 30 నెలల్లోనే రామ్‌కో సిమెంటు పరిశ్రమ పూర్తి కావడమే దానికి నిదర్శనమని సీఎం జగన్‌ అన్నారు. కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో నిర్మించిన రామ్‌ కో సిమెంటు పరిశ్రమను సీఎం బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలకు అన్ని విధాలుగా సహకరిస్తున్నామని, పారిశ్రామిక అభివృద్ధికి చేయూత ఇస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలు రాష్ట్రానికి రాబోతున్నాయని అన్నారు. తమ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు తీసుకుంటున్న చర్యల కారణంగానే రాష్ట్రం వరుసగా మూడో సారి ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌’లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రభుత్వం ‘ఇండస్ట్రీ ఫ్రెండ్లీ’ ప్రభుత్వమని అన్నారు. 2021-22 సంవత్సరానికి గాను అభివృద్ధిపరంగా దేశంలోకెల్లా రాష్ట్రమే ముందంజలో ఉందని, ఇది వైసీపీ ప్రభుత్వ ఘనత అని తెలిపారు. నంద్యాల జిల్లాలో గ్రీన్‌ ఎనర్జీ విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు ముందుకు వస్తే ప్రభుత్వం లీజుకు తీసుకుంటుందని సంసిద్ధత వ్యక్తం చేశారు. అందుకు గాను  ఎకరాకు రూ.30 వేలు చెల్లిస్తామని తెలిపారు. మూడేళ్లకు ఓ సారి 5 శాతం లీజు పెంచుతామన్నారు. కనీసం 500 మెగా వాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉండేలా భూ సేకరణ జరిగితే బాగుంటుందన్నారు. ప్రాజెక్టులు పెడతామని ముందుకు వచ్చే వారికి స్థానిక ఎమ్మెల్యేలు సహకరించాలని సీఎం సూచించారు. అంతకుముందు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉండటానికి సీఎం పరిపాలనా విధానాలే కారణమన్నారు. కార్యక్రమంలో రామ్‌ కో సిమెంటు ఎండీ పీఆర్‌. వెంకట్రామరాజు, జిల్లా ఇన్‌చార్జి, మైనారిటీ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, అటవీ, విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ప్రభుత్వ విప్‌ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి, కలెక్టర్‌ మన్‌జిర్‌ జిలానీ సమూన్‌, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2022-09-29T05:47:03+05:30 IST