శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన

ABN , First Publish Date - 2022-02-23T05:36:27+05:30 IST

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొలిరోజైన మంగళవారం శివస్వాములు ఆందోళన చేపట్టారు.

శ్రీశైలంలో శివస్వాముల ఆందోళన
ఆందోళన చేస్తున్న శివస్వాములు

శ్రీశైలం, ఫిబ్రవరి 22: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల తొలిరోజైన మంగళవారం శివస్వాములు ఆందోళన చేపట్టారు. ఆలయ ప్రధాన ద్వారానికి ముందుభాగంలో ఇరువైపుల ఉన్న సాల మంటపాల్లో క్షేత్రానికి వచ్చే శివస్వాములు విశ్రాంతి పొంది అక్కడే భజన కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే   ప్రముఖుల సందర్శనలకు ఇబ్బందులు తలెత్తుతాయన్న ఉద్దేశంతో సాల మంటపాల్లో శివస్వాములు నిద్రించేందుకు, విశ్రాంతి తీసుకునేందుకు దేవస్థానం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మంగళవారం రాత్రి 9గంటల సమయంలో శివస్వాములు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న దేవస్థానం అధికారులు, సీఐ బీవీ. రమణ అక్కడికి చేరుకుని శివస్వాములను సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఎన్నోఏళ్ల నుంచి  ఇక్కడే విశ్రాంతి తీసుకొని, భజనలు చేసేవారమని, అయితే ఈ ఏడాది కొత్త నిబంధనలు ఏమిటని శివస్వాములు దేవస్థానం అధికారులను నిలదీశారు. తాము స్వామి సన్నిధిలోనే సేద తీరుతామని పట్టుపట్టారు. దీంతో శివస్వాములు అక్కడ విశ్రాంతి తీసుకునేందుకు ఆలయ అధికారులు అనుమతించారు. అయితే వీఐపీల రాక, ఉత్సవాల నిర్వహణలో సహకరించాలని సూచించడంతో ఇందుకు శివస్వాములు అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది. 


Read more