బ్రహ్మోత్సవాలకు రారండి

ABN , First Publish Date - 2022-02-23T06:18:01+05:30 IST

‘సకల దేవతలారా రారండి. మల్లన్న బ్రహ్మోత్సవాలకు విచ్చేయండి’

బ్రహ్మోత్సవాలకు రారండి

 దేవతలను ఆహ్వానిస్తూ ధ్వజ పతాకావిష్కరణ
 శ్రీశైలంలో మహాశివరాత్రి ఉత్సవాలు ప్రారంభం
శ్రీకాళహస్తి తరపున పట్టువస్త్రాల సమర్పణ


శ్రీశైలం, ఫిబ్రవరి 22: ‘సకల దేవతలారా రారండి. మల్లన్న బ్రహ్మోత్సవాలకు విచ్చేయండి’ అంటూ శ్రీశైలం వేదపండితులు, అర్చకులు, అధికారులు ఆహ్వానం పలికారు. మంగళవారం సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఆవిష్కరించారు. ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నవాహ్నిక దీక్షతో 11 రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎస్‌. లవన్న, వేదపండితులు, అర్చకులు స్వామివారి యాగశాల ప్రవేశం చేశారు. దేశం శాంతి సౌభాగ్యాలతో విరిసిల్లాలని కాంక్షిస్తూ బ్రహ్మోత్సవ సంకల్పాన్ని పఠించారు. దీన్నే శివసంకల్పం అంటారు. అనంతరం ఉత్సవాలు నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. తరువాత చండీశ్వరపూజ నిర్వహించారు. బ్రహ్మదేవుని ఆధ్వర్యంలో, క్షేత్రపాలకుడైన వీరభద్రస్వామి పర్యవేక్షణలో శివపరివార దేవతలలో ఒకరైన చండీశ్వరుని నాయకత్వంలో ఈ ఉత్సవాలు జరుగుతాయని వేదపండితులు చెబుతున్నారు. కంకణాలకు పూజలు చేసి అర్చకులు, అధికారులు ధరించారు. కార్యక్రమంలో దేవదాయశాఖ అదనపు కమిషనర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ అజాద్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు భృంగివాహన సేవ
బ్రహ్మోత్సవాల రెండో రోజు నుంచి వాహనసేవలు మొదలౌతాయి. బుధవారం ఉత్సవమూర్తులకు విశేష పూజలు నిర్వహించి భృంగివాహన సేవ జరుపుతారు.

స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాల సమర్పణ
మంగళవారం సాయంత్రం శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం తరపున కార్యనిర్వహణాధికారి ఇ.పెద్దిరాజు భ్రమరాంబ, మల్లికార్జుస్వామికి పట్టువస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఏఈవో ఐఎన్‌వీ మోహన్‌, వేదపండితులు ఎ.ప్రసాదశర్మ, సంగమేశ్వరశాస్త్రి, అర్చకులు రాజేష్‌శర్మ, సిబ్బంది పాల్గొన్నారు. కార్యనిర్వహణాధికారి ఇ.పెద్దిరాజు మాట్లాడుతూ శ్రీకాళహస్తీశ్వరస్వామివార్ల దేవస్థానం తరపున మొట్టమొదటిసారిగా పట్టువస్త్రాలను సమర్పించామన్నారు.

శ్రీశైలం.. భూమండల నాభిస్థానం

దక్షిణ కాశీగా ప్రసిద్ధికెక్కిన క్షేత్రం

కర్నూలు(కల్చరల్‌), ఫిబ్రవరి 22: శ్రీశైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. భూమండలానికి శ్రీశైలం నాభిస్థానంలో ఉందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పూజాది కార్యక్రమాలలో ‘శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే.. శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే...’ అంటూ శ్రీశైలానికి తాము ఏ దిక్కున ఉన్నది సంకల్పం చెబుతుంటారు. శ్రీశైలానికి తూర్పు ద్వారంగా త్రిపురాంతకం(ప్రకాశం జిల్లా), పశ్చిమ ద్వారంగా అలంపూర్‌(జోగులాంబ గద్వాల జిల్లా), ఉత్తర ద్వారంగా ఉమామహేశ్వరం, దక్షిణ ద్వారంగా సిద్ధవటం (కడప జిల్లా) అని పేర్కొంటారు. ‘శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ న విద్యతే’ అనేది ఆర్యోక్తి. బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే పర్వత పంక్తుల్ని తాకుతూ ఇక్కడ కృష్ణానది ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడి పాతాళగంగలో స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని పండితులు చెబుతారు.

 శ్రీశైల క్షేత్రం శతాబ్దాలుగా ఆధ్యాత్మిక వైభవాన్ని కలిగి ఉందనే దానికి అనేక నిదర్శనాలు ఉన్నాయి. క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుంచే విశ్వేశ్వరుడి విన్యాసాలకు కేంద్రంగా, ప్రకృతి రమణీయతకు నెలవుగా పరిఢవిల్లుతోందని చెబుతారు. ఈ క్షేత్ర పరిసరాలకు ముగ్ధుడైన ఆదిశంకరాచార్యులు కొంతకాలం ఇక్కడే ఉండి ‘శివానందలహరి’ రచించినట్లు పండితులు చెబుతారు.

బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

 రేపటి నుంచి రాకపోకలు

కర్నూలు(రూరల్‌), ఫిబ్రవరి 22: శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు సన్నద్ధమైంది. వెంకటాపురం నుంచి కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈనెల 24 నుంచి కర్నూలు-వెంకటాపురం మధ్య ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. శ్రీశైలానికి జిల్లాలోని 12 డిపోల నుంచి ఈనెల 27నుంచి మార్చి 3వరకు ప్రత్యేక సర్వీసులు నడుపుతారు. ఈసారి పండుగకు 473 బస్సులను తిప్పేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని కర్నూలు రీజినల్‌ మేనేజర్‌ టి.వెంకటరామం తెలిపారు. శ్రీశైలంతో పాటు మిగతా శైవక్షేత్రాలకు రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామన్నారు. ప్రధానంగా నల్లమల ఘాట్‌ను దృష్టిలో పెట్టుకుని కండిషన్‌లో ఉన్న బస్సులను మాత్రమే పంపిస్తామన్నారు.

రూట్‌ పరిశీలనకు మొబైల్‌ టీమ్‌లు

శ్రీశైలం భక్తులకు అసౌకర్యం కలగకుండా రూట్‌ పరిశీలనకు ప్రత్యేక మొబైల్‌ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఆదోని-శ్రీశైలం 52, పత్తికొండ-శ్రీశైలం 4, ఆళ్లగడ్డ-శ్రీశైలం 10, ఆత్మకూరు-శ్రీశైలం 31, బనగానపల్లె-శ్రీశైలం 11, డోన్‌-శ్రీశైలం 18, కోవెలకుంట్ల-శ్రీశైలం 11, కర్నూలు-శ్రీశైలం 130, నందికొట్కూరు-శ్రీశైలం 27, నంద్యాల-శ్రీశైలం 44, ఎమ్మిగనూరు-శ్రీశైలం 52 బస్సులను తిప్పనున్నట్లు ఆర్‌ఎం తెలిపారు. జిల్లాలోని ఇతర శైవ క్షేత్రాలకు 83 బస్సులు ఏర్పాటు చేశామన్నారు.

 ఎంతోమంది దాతలు శ్రీశైలానికి కాలినడకన వెళ్లే భక్తుల ఆకలి తీరుస్తున్నారు. మార్గమధ్యంలో అన్నదాన, వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. అస్వస్థతకు గురైన వారికి వైద్య చికిత్స అందిస్తున్నారు.

Updated Date - 2022-02-23T06:18:01+05:30 IST