చి‘వరి’కిలా..!

ABN , First Publish Date - 2022-09-20T05:04:15+05:30 IST

వరి సాగంటే భయపడే పరిస్థితి వచ్చింది.

చి‘వరి’కిలా..!

తగ్గిన వరి సాగు విస్తీర్ణం
ప్రత్యామ్నాయ పంటలపై ఆసక్తి చూపుతున్న రైతులు
ముందుకు రాని కౌలు రైతులు


చాగలమర్రి, బనగానపల్లె, సెప్టెంబరు 19:

వరి సాగంటే భయపడే పరిస్థితి వచ్చింది. అకాల వర్షాలు, గిట్టుబాటు ధర లేకపోవడంతో చాగలమర్రి మండలంలోను... బనగానపల్లె నియోజకవర్గంలో వరి సాగు విస్తీర్ణం బాగా తగ్గింది. ఇతర  పంటలు సాగు చేసుకుంటే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఒకప్పుడు ఈ రెండు ప్రాంతాల్లో వరి సాగు బాగా ఉండేది. కానీ ఎరువులు, పురుగు మందుల ధరలు పెరగడంతో సాగు విస్తీర్ణం తగ్గించి మొక్కజొన్న, కంది పంటలపై దృష్టి సారించారు.

గత ఏడాది సెప్టెంబరు నెలకల్లా చాగలమర్రి మండలంలో దాదాపు ఎనిమిది వేల ఎకరాలకు పైగా వరి సాగైంది. ప్రస్తుతం 19 గ్రామ పంచాయతీల్లో 1,500 ఎకరాలు మాత్రమే వరి సాగు చేశారు. ఈ మండలంలో కేసీ ఆయకట్టు ఉంది. మొదటి నుంచీ వరి సాగు చేయడం ఇక్కడ రైతులకు అలవాటు. కానీ పరిస్థితి మారిపోయింది. వరి సాగు చేస్తే పదే పదే పంట దెబ్బతింటోంది. గిట్టుబాటు ధర పలకడం లేదు. కేసీ కింద 1,000 ఎకరాలు ఉండగా పది ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారు. గత ఏడాది వరిపైరు బాగా పండినా... చేతికొచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు రైతును పూర్తిగా కుంగదీశాయి. ముత్యాలపాడు, ఓజీ తండా, ఎం. తండా, కేపీ తండా, శెట్టివీడు, చాగలమర్రి, చింతలచెరువు, చిన్నవంగలి, పెద ్దవంగలి తదితర గ్రామాల్లో వరి పైరు చేతికందే సమయంలో భారీ వర్షాలు కురిసి పంట పూర్తిగా దెబ్బతింది. పెట్టుబడి కూడా చేతికి రాలేదు. కోత ఖర్చు అదనంగా దేనికని కొందరు రైతులు పొలాల్లోనే వదిలేశారు. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయారు. ఈ ఏడాది వరి సాగుపై ఆసక్తి చూపలేదు. కేసీ, టీజీపీ కాలువల్లో నీరు ప్రవహిస్తున్నా వరి సాగు చేసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి తోడు ఎరువులు, కూలీ రేట్లు విపరీతంగా పెరిగిపోయి పెట్టుబడులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అయినా లాభం ఉంటుందని సాగు చేస్తే ఆశించిన మేర దిగుబడి రాకపోవడం, దిగుబడి వచ్చినా గిట్టుబాటు ధర లేకపోవడంతో వరి సాగు అంటేనే హడలెత్తిపోతున్నారు. పత్తి, మొక్కజొన్న, మినుము, జొన్న, కొర్ర పంటలు సాగు చేస్తున్నారు. కౌలు రైతులు ముందుకు రాకపోవడంతో కొంతమంది భూ యజమానులు తమ పొలాలు బీళ్లుగానే ఉంచుతున్నారు. ఆశ చావని కొందరు అన్నదాతలు మాత్రం ఈసారైనా గట్టెక్కకపోతామా అని వరి నారుమళ్లు సాగు చేస్తున్నారు.

బనగానపల్లె నియోజకవర్గంలో..: 18 వేల హెక్టార్లలో బోర్ల కింద, ఎస్సార్బీసీ కింద వరి సాగు చేసేవారు. రసాయనిక ఎరువుల ధరలు, పురుగు మందుల ధరలు పెరగడంతో పాటు  సేద్యపు ఖర్చులు బాగా పెరిగిపోయాయి. దీంతో నియోజకవర్గ రైతులు వరిపంట విస్తీర్ణాన్ని బాగా తగ్గించారు. దాదాపుగా నాలుగు వేల హెక్టార్లలో వరిపంట విస్తీర్ణం తగ్గిపోయింది. అధిక కౌలుకు తోడు ధరలు కూడా పెరడంతో గిట్టుబాటు కావడం లేదని రైతులు అంటున్నారు. వరిపట్ల ఆసక్తి తగ్గి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించారు. బనగానపల్లె మండలంలో ఈ ఖరీ్‌పలో 9,682 హెక్టార్లలో వివిధ పంటలను సాగు చేశారు. గత ఖరీఫ్‌లో 3,846 హెక్టార్లలో వరి సాగు చేశారు. ఈ సంవత్సరం ఈ ఖరీఫ్‌లో 2,800 హెక్టార్లలో సాగు చేశారు. అంటే వెయ్యి హెక్టార్లలో వరి సాగు తగ్గించారు. గత సంవత్సరం ఎకరాకు 30 బస్తాలు కూడా రాలేదు. అధిక వర్షాలకు, వివిధ తెగుళ్ల వల్ల పంట బాగా దెబ్బతినింది.  బస్తా కనీసం రూ.1200 నుంచి రూ.1500 కూడా పలకలేదు. ఇక ఎండ కారు వరి పంటకు రూ.1000 కూడా ధర రాలేదు. దీంతో గత ఏడాది వరి వేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. కౌలు రైతుల పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. ఎకరాకు  రూ.10,000 వంతున పొలం యజమానికి కౌలు చెల్లించాలి. దీనికి తోడు వ్యవసాయ కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో చాలా మంది ఈ ఏడాది కౌలు తీసుకొని సాగు చేయడానికి ముందుకు రాలేదు. చాలా చోట్ల యజమానులే తమ పొలాలను వేసుకుంటున్నారు. మొక్కజొన్న పంట ఈ ఏడాది 2,516 హెక్టార్లలో, కంది 1,892 హెక్టార్లలో సాగు చేశారు. గత సంవత్సరం కంటే ఈ ఏడాది మొక్కజొన్న, కంది పంటల సాగు బాగా పెరిగింది. సుమారు వెయ్యి హెక్టార్లలో ఈ రెండు పంటల సాగు పెరిగింది.  ప్రత్తి 855 హెక్టార్లు, కొర్ర పంట 127 హెక్టార్లలో సాగు చేశారు. ఆ తరువాత సన్‌ఫ్లవర్‌, వేరుశనగ, మిరప, ఉల్లి, తదితర పంటలపై దృష్టి పెట్టారు.

భారంగా మారిన వ్యవసాయం

వైసీపీ ప్రభుత్వం డీజిల్‌ ధరలు బాగా పెంచడంతో రైతులకు వ్యవ సాయం భారంగా మారింది. గతం లో ఎకరా వరి సాగుకు రూ.15 వేలు ఖర్చయ్యేది. ఈ ఏడాది రూ.20 వేలకు పైగానే ఖర్చు అవుతోంది.

ఖర్చులు తగ్గించుకోవాలి
 
ఈ ఏడాది ఖరీఫ్‌లో బనగానపల్లె మండలంలో సుమారు వెయ్యి హెక్టార్లలో వరి సాగు తగ్గింది. రైతులు ప్రత్యామ్నాయ పంటలైన మొక్కజొన్న, కంది పంటలు అధికంగా వేశారు. ఎరువులు, పురుగు మందుల వాడకం తగ్గించుకోవాలి. సేంద్రియ ఎరువులను వాడి ఖర్చులు తగ్గించుకోవాలి. ప్రతి రైతు తప్పనిసరిగా వ్యవసాయాధికారుల సూచనల మేరకు ఎరువులు, పురుగు మందులు వాడాలి. మోతాదుకు మించి  వాడకూడదు.

-సుబ్బారెడ్డి, బనగానపల్లె మండల వ్యవసాయాధికారి

వర్షాలతో నష్టపోయాం

గత ఏడాది రెండెకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు 40 బస్తాల దిగుబడి వస్తుందని ఆశించాను. పంట చేతికొచ్చే సమయంలో భారీ వర్షాలు కురిసి పంటంతా నేలవాలి తీవ్రంగా దెబ్బతింది. రూ.లక్ష దాక నష్టపోయా. దీంతో ఈ ఏడాది వేరే పంట వేసుకునేందుకు పొలం సిద్ధం చేసుకుంటున్నా.

-గుర్రప్ప, రైతు, చాగలమర్రి

ప్రత్యామ్నాయ పంటే శరణ్యం

వరి పంట సాగు చేసి తీవ్రంగా నష్టపోయా. నాలుగు ఎకరాల్లో ప్రత్యామ్నాయ పంటగా మొక్కజొన్న సాగు చేశా. గతంలో వరి సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు మొక్కజొన్న పంట సాగు చేశా.

-మాబాషా, రైతు, చాగలమర్రి

Read more