లెక్క తేలేనా?

ABN , First Publish Date - 2022-11-30T00:22:12+05:30 IST

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టులో ఎర్రమట్టి మాఫియా సాగిస్తున్న గరుసు తవ్వకాల లోతెంతో తేల్చేందుకు గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు.

లెక్క తేలేనా?

జగన్నాథగట్టులో తవ్వకాలపై కొనసాగుతున్న తనిఖీలు

సర్వే చేస్తున్న మైనింగ్‌ అధికారులు

గట్టు సంరక్షణ, ఆక్రమణల నిరోధానికి అధికారుల చర్యలు

నిరంతర తనిఖీలకు ప్రత్యేక బృందాలు

కర్నూలు-ఆంధ్రజ్యోతి

కర్నూలు నగర శివారులోని జగన్నాథగట్టులో ఎర్రమట్టి మాఫియా సాగిస్తున్న గరుసు తవ్వకాల లోతెంతో తేల్చేందుకు గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారులు మంగళవారం కూడా తనిఖీలు చేపట్టారు. అదే క్రమంలో జగన్నాథగట్టు ప్రాంతంలో ఎలాంటి తవ్వకాలు, ఆక్రమణలు చేయకుండా నిరంతర తనిఖీలు చేసేలా ప్రత్యేక రెవెన్యూ బృందాలు ఏర్పాటు చేశారు. జగన్నాథగట్టులో కొన్నాళ్లుగా ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎర్రమట్టి మాఫియా పెట్రేగిపోతూ జగన్నాథగట్టును ఇష్టారాజ్యంగా తవ్వకాలు సాగిస్తున్న తీరును ‘కొండలను కొల్లగొడుతున్నారు’, ‘మరో కె.జి.యఫ్‌..’ శీర్షికలతో ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన మైనింగ్‌ డీడీ, ఏడీ, విజిలెన్స్‌ ఏడీలు అక్రమ తవ్వకాల గుట్టు తేల్చేందుకు తనిఖీలు, సర్వేలకు శ్రీకారం చుట్టారు. రెండు రోజులుగా తవ్వకాల ప్రాంతాల్లో కొలతలు తీస్తున్నారు. సీమ ముఖద్వారం కర్నూలు నగరంలో భవిష్యత్తు అవసరాలకు ప్రభుత్వ భూములు ఎంతో కీలకం. గత ప్రభుత్వాలు, ఆనాటి ప్రజాప్రతినిధులు జగన్నాథగట్టును కాపాడడం వల్లనే అక్కడ 10 వేల మంది పట్టణ పేదలకు టిడ్కో ఆధ్వర్యంలో జీ+3 ఇళ్లు, ట్రిపుల్‌ ఐటీ కళాశాల, ప్రభుత్వ క్లస్టర్‌ విశ్వవిద్యాలయం నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఆనాటి పాలకులే జగన్నాథగట్టును ఇష్టారాజ్యంగా తవ్వేసి ఉంటే ఈ అభివృద్ధి జరిగేదా..? అని సీమ మేధావులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, మట్టి మాఫియా రెచ్చిపోవడం వెరసి అక్రమ తవ్వకాలతో గట్టు చిక్కి శల్యమైంది. ‘ఆంధ్రజ్యోతి’ కథనాలతో స్పందించిన మైనింగ్‌, రెవెన్యూ అధికారులు అక్రమ తవ్వకాల లెక్క తేల్చే పనిలో నిమగ్నమయ్యారు. వైసీపీ కీలక ప్రజాప్రతినిధుల నుంచి మైనింగ్‌ అధికారులపై ఒత్తిళ్లు వస్తున్నట్టు సమాచారం. దీంతో ఎర్రమట్టి అక్రమ తవ్వకాల లెక్క పక్కాగా తేలుతుందా..? అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సమగ్ర సర్వే చేస్తున్నాం.. ఏ స్థాయిలో అక్రమ తవ్వకాలు చేశారో పూర్తి వివరాలతో గనులు, భూగర్భ వనరుల శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ వీజీ వెంకటరెడ్డికి పంపుతామని మైనింగ్‌ అధికారులు పేర్కొనడం కొసమెరుపు.

గట్టు రక్షణకు చర్యలు

కర్నూలు నగర శివారున కల్లూరు మండలం లక్ష్మీపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నంబరు 793-1లో 590 ఎకరాల విస్తీర్ణంలో జగన్నాథగట్టు ఉంది. ఇది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భవిష్యత్తు అవసరాల (ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు మొదలైన) కోసం ల్యాండ్‌ బ్యాంక్‌లో ఉంచారు. కర్నూలుకు హైకోర్టు వస్తే ఇక్కడే నిర్మించాలనే ప్రతిపాదన ఉంది. అంతేకాదు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు వస్తే నిర్మాణాలకు ఉన్న ఏకైక ప్రభుత్వ భూమి ఇదే. లేదంటే ఓర్వకల్లుకు వెళ్లాల్సి వస్తుంది. ఇక్కడ ఎకరం రూ.2.5 కోట్ల నుంచి రూ.5 కోట్లకు పైగా పలుకుతోంది. ప్రస్తుతం ఎర్రమట్టి అక్రమ తవ్వకాలు చేస్తున్న ప్రాంతంలో 165 ఎకరాలు విలువ ఎంత కాదన్నా రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్లు ఉంటుందని స్థిరాస్తి వ్యాపారి ఒకరు పేర్కొనడం కొసమెరుపు. ఈ నేపథ్యంలో ‘ఆంఽధ్రజ్యోతి ’కథనాలతో రెవెన్యూ అధికారులు ఎట్టకేలకు స్పందించారు. గట్టు సంరక్షణకు కల్లూరు తహసీల్దారు ఆధ్వర్యంలో నిరంతర తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమిస్తున్నారు. ఈ మేరకు కలెక్టరు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది.

ప్రత్యేక బృందాలు నియమించాం

జగన్నాథ గట్టు మొత్తం ప్రభుత్వ భూమే. అక్కడ ఎలాంటి అక్రమ తవ్వకాలు, ఆక్రమణలు జరగకుండా కల్లూరు తహసీల్దారు ఆధ్వర్యంలో ప్రత్యేక రెవెన్యూ బృందాలను నియమించాం. పగలే కాదు.. రాత్రి పూట కూడా ఈ బృందాలు నిరంతరం తనిఖీలు చేస్తూ జగన్నాథ గట్టు సంరక్షణకు చర్యలు తీసుకుంటాయి.

-రాంసుందరరెడ్డి, జేసీ, కర్నూలు

Updated Date - 2022-11-30T00:22:12+05:30 IST

Read more