కాత్యాయనీదేవిగా భ్రమరాంబ

ABN , First Publish Date - 2022-10-02T05:44:33+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు కొనసాగుతున్నాయి.

కాత్యాయనీదేవిగా భ్రమరాంబ

 పుష్ప పల్లకిలో అమ్మవారు
 గ్రామోత్సవంలో కనిపించని హంసవాహన సేవ


శ్రీశైలం, అక్టోబరు 1: శ్రీశైల క్షేత్రంలో దసరా మహోత్సవాలు కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణాలు చేశారు. చండీహోమం, పంచాక్షరీ, భ్రామరీ, బాలాజపానుష్ఠానాలు, చండీపారాయణ, చతుర్వేద పారాయణాలు, కుమారి పూజలు నిర్వహించారు. స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్రపారాయణాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు. ఈ కుమారి పూజలలో భాగంగా రెండేళ్ల నుంచి పదేళ్లలోపు బాలికలకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు.

పుష్ప పల్లకిలో అమ్మవారు మాత్రమే..

వాహన సేవలలో భాగంగా ఆరో రోజు స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఆశీనులనుజేసి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. అయితే హంస వాహనంపై ఆశీనులైన స్వామి, అమ్మవార్లు కలసి గ్రామోత్సవంలో భక్తులకు దర్శనమివ్వకపోవడంతో చర్చనీయాంశమైంది. కేవలం కాత్యాయని స్వరూపంలో అమ్మవారు పుష్ప పల్లకీలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిదంపతుల దర్శనం భక్తులకు కలగకపోవడంతో నిరుత్సాహం చెందారు. దేవస్థానం వైదిక కమిటీ సూచనల మేరకు అమ్మవారికి మాత్రమే పుష్పపల్లకి, గ్రామోత్సవం నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

కాత్యాయనిగా దర్శనమిచ్చిన భ్రమరాంబికాదేవి

దసరా ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అమ్మవారు నవదుర్గ అలంకరణలలో ఒకటైన కాత్యాయనిగా భక్తులకు దర్శనమిచ్చారు. ముందుగా కాత్యాయని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పుష్ప పల్లకిలో గ్రామోత్సవం నిర్వహించారు. ఆరో రూపమైన ఈ దేవి చతుర్భుజాలను కలిగి... కుడివైపున అభయహస్తాన్ని, వరదముద్రను, ఎడమవైపు పద్మాన్ని, ఖడ్గాన్ని ధరించి ఉంటుంది. నవదుర్గలలో ఆరో రూపమైన కాత్యాయనీదేవిని ఆరాధించడం వల్ల రోగ, శోక, భయాలను తొలగించుకోవచ్చని... జన్మజన్మల పాపాలన్నీ కూడా హరించబడతాయని భక్తుల విశ్వాసం. కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్‌. లవన్న, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
 
నేడు అమ్మవారికి కాళరాత్రి అలంకారం

దసరా మహోత్సవాల్లో ఆదివారం భ్రమరాంబికా అమ్మవారు కాళరాత్రి అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు గజవాహన సేవ నిర్వహించనున్నారు.

Read more