ఏటిపాయ..ఎండిపాయ

ABN , First Publish Date - 2022-09-22T04:57:56+05:30 IST

పాతికేళ్ల కింద ఏటిపాయ వంక మీది చెక్‌ డ్యాం వరదల్లో దెబ్బతినిపోయింది. అప్పటి నుంచి దాన్ని పునర్నిర్మించలేదు.

ఏటిపాయ..ఎండిపాయ
చక్‌డ్యాం నిర్మించాల్సిన ఏటిపాయ వంక

  1. ఆయకట్టు లేదని తిరస్కరించారు
  2. ఫ 26 ఏళ్లుగా మరమ్మతుకు నోచుకోని  చెక్‌డ్యాం
  3. ఫ 3వేల ఎకరాల మెట్ట భూములకు అందని సాగునీరు
  4. ఫ వేసవిలో తాగు, సాగునీటికి కటకట
  5. ఫ తమ్మరాజుపల్లెకు ఆయకట్టు శాపం

 

 పాణ్యం, సెప్టెంబరు 21 :  పాతికేళ్ల కింద ఏటిపాయ వంక మీది చెక్‌ డ్యాం వరదల్లో దెబ్బతినిపోయింది. అప్పటి నుంచి దాన్ని పునర్నిర్మించలేదు. చెక్‌ డ్యాంకు ఆయకట్లు లేదని అధికారులు అంటున్నారు. అంతక ముందు నిర్మించినప్పుడు ఉన్న ఆయకట్టు ఇప్పుడు ఎలా పోయింది? అని వర్షాధార తమ్మరాజుపల్లె గ్రామస్థులు అంటున్నారు. ఈ చెక్‌ డ్యాం లేకపోవడంతో చుట్టుపక్కల భూగర్భ జలాలు ఇంకి పోయాయి. తాగునీటికి కూడా ఇబ్బందిపడుతున్నారు.  దాదాపు మూడు వేల ఎకరాల్లో సాగు సమస్యాత్మకం అయింది.   రెండు వేల జనాభా ఇబ్బందులకు గురవుతున్నారు.  

  మండలంలోని తమ్మరాజుపల్లెలోని ఏటిపాయ పర్క్యులేషన ట్యాంక్‌ నిర్మాణానికి ప్రతి యేటా ప్రతిపాదనలు పంపుతున్నారు. కానీ అధికారులు ఆమోదించడం లేదు. ఇదేమని చిన్ననీటి పారుదల శాఖ అధికారులను ప్రశ్నిస్తే ఏటిపాయకు ఆయకట్టు లేదని సమాధానం వచ్చింది.  ట్యాంకు నిర్మిస్తే ఒక గ్రామం బాగుపడుతుందనుకోకుండా    ఆయకట్టు లేదనే సాకు వెతుక్కొని నిధులు మంజూరు చేయడం లేదని  రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  చెక్‌ డ్యాం మీదే ఆధారపడిన భూములను సస్యస్యామలం చేసే ఏటిపాయ చెక్‌డ్యాం నిర్మాణం పాలకులకు పట్టడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ డ్యాంను 1992లో  మొదట నిర్మించారు. అప్పటి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి వి. రాంభూపాల్‌ చౌదరి దీన్ని ప్రారంభించారు. 1996 వరదల్లో  డ్యాం పూర్తిగా దెబ్బతినింది. ఆ తర్వాత పునర్నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం ప్రతియేటా ప్రతిపాదనలు పంపడమే తప్ప పని జరగడం లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు నాయకులు డ్యాం నిర్మాణాన్ని చేపడతామని హామీలివ్వడమే తప్ప  చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


3 వేల ఎకరాలకు సాగునీరు : ఏటిపాయ చెక్‌డ్యాం  ద్వారా దాదాపు 3 వేల ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగు నీరందేది. ఇది కొట్టుకపోయాక గొట్టం బావులపైనే ఆధారపడిన ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు ఎండిపోయి  రైతులు తీవ్ర నష్టాలకు గురవుతున్నారు. డ్యాం నిర్మిస్తే అన్ని రకాలుగా రైతులకు మేలు జరుగుతుంది.  


రైతులతో చెలగాటం  :తమ్మరాజుపల్లె ప్రజలకు ప్రధాన జీవనాధారం వ్యవసాయం. ఇసుక నేలలు కావడంతో అధికంగా పత్తి, వేరుశనగ, పొద్దుతిరుగుడు, కంది, వరి, కూరగాయలు సాగుచేస్తారు.  ఇలాంటి చోట చెక్‌డ్యాం పునర్నిర్మాణానికి   2002లో రూ. 20 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు.  2016లో రూ. 80 లక్షలతో,  2018 లో రూ. 1.10 కోట్లతో పంపిన  ప్రతిపాదనలు చెత్తబుట్టదాఖలయ్యాయి.  


తాగునీటి కొరత :  గ్రామంలో ప్రతి యేటా తాగునీటి సమస్య తలెత్తుతోంది.  కొండప్రాంతాలకు వెళ్లే పశువులు తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నాయి. నీరు లేక పోవడంతో పశుగ్రాసం కొరత ఏర్పడుతోంది. దీంతో  పశువులను అమ్ముకోవలసి వస్తోందని రైతులు అంటున్నారు. డ్యాం నిర్మిస్తే ఈ సమస్యలు తొలగిపోతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


ఆయకట్టు లేకపోవడమే కారణం: అర్జునసింగ్‌, ఎంఐ ఏఈ: యేటిపాయ పర్క్యులేషన ట్యాంకు కింద  ఆయకట్టు లేకపోవడంతో యేటా ప్రభుత్వానికి పంపిస్తున్న ప్రతిపాదనలు తిరస్కారానికి గురవుతున్నాయి.  గత ఆరేళ్లుగా ఇదే పరిస్థితి.  2022 -  23 సంవత్సరానికి నిర్మాణానికి రూ. 3. 10 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. ప్రతిపాదనలు పంపడం వరకే మా బాఽధ్యత. 


రైతుల ఇబ్బందులు తొలగిపోతాయి

  ఏటిపాయ చెక్‌డ్యాం నిర్మిస్తే రైతులకు ఇబ్బందులు తొలగిపోతాయి. నష్టాల నుంచి బయట పడతాము. పశుపోషణ, తాగునీటి సమస్యలు తలెత్తవు.  

- వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ, తమ్మరాజుపల్లె  

ఆయకట్టు లేదనడం కొత్తపాట 

యేటిపాయ ట్యాంకు నిర్మాణానికి ఆయకట్టు లేదని ప్రభుత్వం కొత్తపాట అందుకుంది.  ఇన్నేళ్లుగా ఆయకట్టు గురించి ఎందుకు మాట్లాడలేదు. కేవలం ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడమే కారణంగా కనిపిస్తోంది. 

- దుబాయ్‌ శీను, టీడీపీ నాయకుడు  

 

Updated Date - 2022-09-22T04:57:56+05:30 IST