జగనన్నకు సమస్యల తోరణం

ABN , First Publish Date - 2022-07-05T06:43:54+05:30 IST

జగనన్న విద్యా కానుక పంపిణీ కోసం ఆదోనికి వస్తున్న సీఎంకు ఆదోని పట్టణ ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారు.

జగనన్నకు సమస్యల తోరణం

అభివృద్ధికి నోచుకోని ఆదోని మున్సిపాలిటీ
ట్రాఫిక్‌ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలు
మాస్టర్‌ ప్లాన్‌ లేనట్లేనా?

ఆదోని, జూలై 4: జగనన్న విద్యా కానుక పంపిణీ కోసం ఆదోనికి వస్తున్న సీఎంకు ఆదోని పట్టణ ప్రజలు తమ సమస్యలను విన్నవిస్తున్నారు. ఆదోని మున్సిపాలిటీకి 160 ఏళ్ల సంవత్సరాలు ఉన్నా అభివృద్ధి చెందలేదనే విమర్శలు ఉన్నాయి.  రెండో ముంబాయిగా పేరు గాంచిన ఆదోనిలో ఉన్న మిల్లులన్నీ మూతపడిపో యాయి. వాటిలో పని చేస్తున్న 13 వేల మంది మార్కెట్‌ యార్డులో నిరసన కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు.   పట్టణంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులు 20 ఏళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం చేస్తున్న డిమాండ్‌ ఇంత వరకు ఆచరణకు నోచుకోలేదు.  పట్టణ పొలిమేరలోని కర్నూలు రోడ్డు నుంచి ఆస్పరి రోడ్డు మీదుగా ఆలూరు రోడ్డును కలుపుతూ మంజూరైన బైపాస్‌ రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిపోవడంతో బైపాస్‌ గుండా వెళ్లాల్సిన భారీ వాహనాలు పట్టణం నుంచి వెళ్లాల్సి వస్తుం ది. ఈ కారణంగా అనేక ట్రాఫిక్‌ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి.  ఆదోని డివిజన్‌ కేంద్రంలో ఉన్న స్త్రీల చిన్నపిల్లల ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చి 24 గంటల పాటు వైద్య సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలి.  1985లో పట్టణ అభివృద్ధి కోసం రూపొందించిన మాస్టర్‌ ప్లాన్‌ కాలపరిమితి 2015తో ముగిసిపోయినా మాస్టర్‌ ప్లాన్‌ మాత్రం అమలుకు నోచుకోలేదు. తిరిగి కొత్త మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించాల్సి ఉండగా కనీసం ప్రతిపాదనలకు కూడా ఇంత వరకు పంపలేదు. ఆదోని డివిజన్‌తో పాటు అనేక గ్రామాల్లో జింకల బెడద తీవ్రంగా ఉంది.  నిధులు లేక ఆపరేషన్‌ బ్లాక్‌బక్‌  కార్యక్రమాన్ని చేపట్టడం లేదు. ఎల్లెల్సీ ద్వారా ఆయకట్టు రైతులతో పాటు నానాయకట్టు వేల ఎకరాలు సాగు చేస్తుండడంతో ఆంధ్రకు రావాల్సిన నీటివాటా రావడం లేదు. కర్ణాటకకు చెం దిన రైతులు ఎగువన అక్రమ నానాయకట్టు సాగు చేస్తుండడం కారణంగా దిగువన ఉన్న రైతులకు నీళ్లు లేక ఆయకట్టు భూములు బీడు భూములుగా మారుతున్నాయి. ఈ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Read more