-
-
Home » Andhra Pradesh » Kurnool » Amma in Kalaratri decoration-MRGS-AndhraPradesh
-
కాళరాత్రి అలంకారంలో అమ్మవారు
ABN , First Publish Date - 2022-10-03T05:06:25+05:30 IST
శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి.

గజ వాహనంపై విహరించిన శివపార్వతులు
శ్రీశైలం, అక్టోబరు 2: శ్రీశైలం క్షేత్రంలో దసరా మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆది వారం అమ్మవారికి ప్రాతఃకాల పూజలు, విశేష కుంకుమార్చనలు, నవావరణార్చనలు, జపానుష్ఠానాలు, పారాయణం, చండీహోమం, పంచాక్షరీ, భ్రామరీ, బాలాజపానుష్ఠానాలు, చండీ పారాయణం, చతుర్వేద పారాయణాలు, కుమారి పూజలు నిర్వహించారు. స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, రుద్రయాగాంగ జపాలు, రుద్రపారాయణాలు చేశారు. ఉత్సవాల్లో భాగంగా కుమారి పూజలు జరిపించారు. ఈ కుమారి పూజలలో భాగంగా రెండు సంత్సరాల నుంచి పది సంవత్సరాలలోపు బాలికకు పూలు, పండ్లు, నూతన వస్త్రాలు సమర్పించారు.
గజవాహనంపై శివపార్వతులు
దసరా ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఆదివారం అమ్మవారికి నవదుర్గ అలంకరణలలో ఒకటైన కాళరాత్రిగా భక్తులకు దర్శన మిచ్చారు. గజవాహనంపై స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆశీనులనుజేసి పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు జరిపారు. అనంతరం గ్రామోత్సవం నిర్వహించారు. అశేష భక్తజనం ఈ కార్యక్రమాన్ని కనులారా వీక్షించి స్వామి, అమ్మవార్ల ఆశీసులను పొందారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో ఎస్. లవన్న, ఆలయ అధికారులు, ఉభయ దేవాలయాల ప్రధాన అర్చకులు పాల్గొన్నారు.
నేడు అమ్మవారికి మహాగౌరీ అలంకారం
దసరా మహోత్సవాల్లో ఎనిమిదో రోజు సోమవారం భ్రమరాంబికా అమ్మవారు మహాగౌరీ అలంకారంలో దర్శనమివ్వనున్నారు. స్వామి, అమ్మవార్లకు నంది వాహన సేవ నిర్వహించనున్నారు.