వెయ్యి రోజుల పాలనలో అన్నీ దౌర్జన్యాలే: మాజీ మంత్రి

ABN , First Publish Date - 2022-03-17T05:21:29+05:30 IST

సీఎం జగన వెయ్యి రోజుల పాలనలో అక్రమాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, కక్షసాధింపు చర్యలు తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు.

వెయ్యి రోజుల పాలనలో  అన్నీ దౌర్జన్యాలే: మాజీ మంత్రి
మాట్లాడుతున్న మాజీ మంత్రి అఖిలప్రియ

ఆళ్లగడ్డ, మార్చి 16: సీఎం జగన వెయ్యి రోజుల పాలనలో అక్రమాలు, దౌర్జన్యాలు, తప్పుడు కేసులు, పార్టీ కార్యాలయాలపై దాడులు, కక్షసాధింపు చర్యలు తప్ప ఇంకేమీ లేదని మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపించారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సీఎం జగనపాలనపై ఎంత చెప్పినా తక్కువేనన్నారు. వైఎస్‌ జగన అఽదికారంలోకి రాగానే ప్రజావేదిక కూల్చివేతతో మొదలుపెట్టి ప్రతిపక్షపార్టీ నాయకులపై దాడులు, తప్పుడు కేసులు నమోదు, బెదిరింపులకు పాల్ప డ్డారని అన్నారు. ఎమ్మెల్యేలకు పైసా సీఎం ఇవ్వకుండా మూడేండ్లు పాలన సాగించి ఇపుడు ఎమ్మెల్యేలను, మంత్రులను, ఎమ్మెల్సీలను ప్రజల్లోకి వెళ్లండంటూ ఆదేశాలు జారీ చేశారని అన్నారు. ఎమ్మెల్యేలు ఏం అభివృద్ధి చేశారని ప్రజలకు ముఖాలు చూపిస్తారని ఆమె ప్రశ్నించారు. మూడేండ్ల పాలనలో ప్రజల రేషన కార్డుల తొలగింపు, ఫించన్లు కట్‌, ఇళ్లు మంజూరు నిల్‌... ఇలా చెప్పుకుంటే పోతే ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తూ పోయిందని అన్నారు. ప్రభుత్వ ఇసుక విధానం వల్ల కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింన్నారు. మద్య నిషేధం అంటూనే మహిళల ప్రాణాలు తోడేసేలా మద్యం షాపుల ఏర్పాటు చేశారని అన్నారు. అమ్మవడి పేరుతో ఇచ్చిన డబ్బులకు అదనంగా పన్నుల రూపంలో రూ. 75వేలు వసూలు చేశారని ఆరోపించారు. మూడు రాజధానుల పేరుతో రాయలసీమ లో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి మోసం చేశారన్నారు. గత టీడీపీ ప్రభుత్వం సబ్సిడీతో రైతులకు ట్రాక్టర్లు పంపిణీ చేసేదని, కార్పొరేషన్ల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. కేసీ, తెలుగుగంగ కాలువలకు నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. ఓటీఎ్‌సపై ప్రభుత్వానికే స్పష్టత లేదని, ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఆళ్లగడ్డలో డిగ్రీ ప్రభుత్వ కళాశాల, 50 పడకల వైద్యశాల టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందని, కానీ తామే మంజూరు చేయించామని అధికార పార్టీ వాళ్ల గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. పట్టణంలో పార్కుకు స్థలం కేటాయించి, రూ. 16 లక్షలు మంజూరు చేయించి, ప్రహారీ  నిర్మించామని అఖిలప్రియ అన్నారు. వనిపెంట వంతెనను నిర్మించడంలో పాలకులు విఫలం అయ్యారన్నారు. పట్టణంలో రోడ్ల వెడల్పు పేరుతో ఎమ్మెల్యే అవినీతికి పాల్పడ్డారని, విచారణలో ఇది తప్పు అని తెలితే ఆయన పదవికి రాజీనామా చేయాలని, రుజువు కాకపోతే తానే రాజకీయాలకు శాశ్వతంగా దూరమౌతానని సవాల్‌ విసిరానని గుర్తు చేశారు. దీనిపై ఎమ్మెల్యే నుంచి సమాధానం రాలేదన్నారు. మున్సిపాల్టీలో చైర్మన, వైస్‌ చైర్మనలు ఏం అభివృద్ధి చేశారని ప్రజల్లోకి వెళ్తారని ప్రశ్నించారు. సీఎం జగన పాలనతో రాష్ట్రం 20 ఏండ్లు వెనక్కి పోయిందన్నారు. ఈ సమావేశంలో నాగిరెడ్డిపల్లె శేఖరరెడ్డి పాల్గొన్నారు.


Read more