అన్నదాత గుండెల్లో తుఫాన

ABN , First Publish Date - 2022-12-12T00:11:44+05:30 IST

ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి చెందిన మహిళా రైతు వీరనాగమ్మ నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేసింది. మిరపకాయ పండు బారడంతో పంటను కొసి కల్లంలో ఆరబోసింది.

    అన్నదాత గుండెల్లో తుఫాన
ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో కల్లంలో ఆరబోసిన మిరప తుఫానకు తడిసిపోవడంతో కాపాడుకోవడానికి రైతు

పంట చేతికొచ్చే వేళ నిలువునా ముంచిన మాండస్‌

మిరప, వరి, పత్తి రైతులకు తీరని కష్టం

పప్పు శనగ దిగుబడిపై తీవ్ర ప్రభావం

ఉమ్మడి జిల్లాల్లో రూ.వందల కోట్ల నష్టం

(కర్నూలు-ఆంధ్రజ్యోతి):

ఎమ్మిగనూరు మండలం పార్లపల్లికి చెందిన మహిళా రైతు వీరనాగమ్మ నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేసింది. మిరపకాయ పండు బారడంతో పంటను కొసి కల్లంలో ఆరబోసింది. రెండు మూడు రోజుల్లో మార్కెట్‌కు తీసుకెళ్లాలని లారీ బాడుగ కూడా మాట్లాడింది. మాండస్‌ తుఫాన ఆమె ఆశలపై నీళ్లు చల్లింది. కల్లంలో ఆరబోసిన పంటంతా తడిసి ముద్దయింది. పంట రంగుమారి కొనేవారే ఉండరని కన్నీటి పర్యంతమవుతోంది. వీరనాగమ్మ ఒక్కరుఏ కాదు.. మాండస్‌ తుఫాన ప్రభావానికి మిరప, వరి, పత్తి సాగు చేసిన రైతులు అందరిదీ ఇదే పరిస్థితి. పులుపు చిగురు కారిపోయి పప్పు శనగ దిగుబడి తీవ్రంగా నష్టపోతామని కష్టజీవులు కన్నీళ్లు పెడుతున్నారు. ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అంచనాలకు అందని రూ.వందల కోట్ల నష్టం ఇది.

ఉమ్మడి జిల్లాలో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ), కేసీ కాలువ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ కాలువ సహా వివిధ నీటి వనరులు, బోరుబావుల కింద 1.15 లక్షల హెక్టార్లలో వరి, 30 వేల హెక్టార్లలో మిరప సాగు చేశారు. వర్షాధారంగా 2.76 లక్షల హెక్టార్లలో పత్తి వేశారు. రబీ పంటగా పప్పు శనగ 1.25 లక్షల హెక్టార్లలో సాగు చేశారని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. చాలా చోట్ల ఇప్పటికే వరి, మిరప పంటలు కోత కోసి కల్లాల్లో ఆరబెట్టారు. నాలుగైదు రోజుల్లో మార్కెట్‌కు తీసుకెళ్లేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఇంతలో మాండస్‌ తుఫాన రైతులను నిలువునా ముంచింది. ఏకదాటిగా కురుస్తున్న జల్లులు, కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలకు కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మిరప తడిసిపోయాయి. ధాన్యం, మిరప అధికంగా సాగు చేసిన హాలహర్వి, హోళగుంద, కోసిగి, గోనేగండ్ల, ఎమ్మిగనూరు, ఆస్పరి, నందికొట్కూరు, నంద్యాల, బనగానపల్లె, గడివేములు, బండిఆత్మకూరు, ఆళ్లగడ్డ, రుద్రవరం, చాగలమర్రి తదితర మండలాల్లో నష్టం అధికంగా ఉందని అధికారుల అంచనా.

ఫ 405.4 మి.మీ. వర్షం:

కర్నూలు జిల్లాలో సోమవారం ఒక్క రోజే 405.4 మి.మీ. వర్షపాతం నమోదైంది. సగటున 25 మండలాల్లో 25.6 మి.మీ. వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వెల్దుర్తి మండలంలో 26.4, కృష్ణగిరిలో 25.2, కర్నూలు అర్బనలో 24.2, కోడుమూరులో 21.6, ఆలూరులో20.4, ఓర్వకల్లులో 20.2, కల్లూరులో 18.2, నందవరంలో 18.2, ఎమ్మిగనూరులో 17.4, కోసిగిలో 16.4, ఆదోనిలో 15.6, గోనెగండ్లలో 15.2, ఆస్పరిలో 15.0, పత్తికొండలో 13.4, హోళగుందలో 12.4, చిప్పగిరిలో 11.8, హాలహర్వి మండలంలో 11.0 మి.మీటర్ల వర్షపాతం నమోదైనట్టు వ్యవసాయ అధికారులు పేర్కొన్నారు. శనివారం ఉదయం 8 నుంచి ఆదివారం ఉదయం 8 గంటల మధ్యలో కురిసిన వర్షం ఇది.

ఫ నీటి పాలైన మిరప

ఆగస్టు, సెప్టెంబరు మొదట్లో నాటిన మిరప పంట దిగుబడులు ఇప్పుడే వస్తున్నాయి. తొలి పంట కోత ఎకరాకు 10-15 క్వింటాళ్లు వస్తుందని రైతులు తెలిపారు. కర్ణాటక బ్యాడిగి మార్కెట్‌లో క్వింటా రూ.25 వేలకు పైగా విక్రయించారు. రెండు వారాల క్రితం రూ.30 వేలకు అమ్ముడుబోయింది. ధర ఆశాజనకంగా ఉంది. అప్పుల కష్టాలు తీరుతాయని... ఎండ బాగుంటే 10-15 రోజులు ఎండబెడితే మంచి ధర వస్తుందని రైతులు కల్లాల్లోనే ఉంచారు. కొందరు రెండు మూడు రోజులు, ఇంకొందరు ఐదారు రోజుల్లో మర్కెట్‌కు పంటను తీసుకెళ్లేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఇంతలో మాండస్‌ తుఫాన రైతు గుండెల్లో పిడుగులా పడింది. కల్లాల్లోని పంట తడిసిపోయింది. పంటను కాపాడుకోవడానికి టార్పాలిన్లు కప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. తడిసి రంగుమారిన మిరప క్వింటా రూ.5 వేల నుంచి 10 వేలకు కూడా కొనేవారు ఉండరని.. క్వింటాకు సగటున రూ.10 వేల వంతున ఎకరాకు రూ.లక్ష నుంచి రూ.1.50 లక్షలు నష్టపోవాల్సి వచ్చిందని గోనెగండ్ల మండలం హెచ.కైరవాడికి చెందిన మిరప రైతు నరసిహులు కన్నీరు పెట్టారు. అంటే.. ఉమ్మడి జిల్లాల్లో రూ.750 కోట్లు నష్టం వాటిల్లి ఉంటుందని రైతుల అంచనా. ధాన్యం రైతుల పరిస్థితి కూడా ఇదే. ఎల్లెల్సీ, కేసీ, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బీసీ కాలువల కింద సాగు చేసిన రైతులు పంట కోత, నూర్పిడి చేసి కల్లాలు, రోడ్లకు ఇరువైపులా ఆరబోశారు. తుఫానకు తడిసిపోవడంతో కోలుకోని నష్టం చవిచూశారు. తాజాగా ధాన్యం క్వింటా రూ.2,10 నుంచి రూ.2,200 పలుకుతుందని ఎమ్మిగనూరు మండలం కోటేకల్లు గ్రామానికి చెందిన ధాన్యం రైతు తెలిపారు. తడిసిన ధాన్యం క్వింటా రూ.1,000 నుంచి రూ.1,200కు కూడా కొనుగోలు చేయరని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.26 వేలు నష్టపోవాల్సి వస్తుందని ఏకరువు పెడుతున్నారు.

ఫ పప్పు శనగ దిగుబడులపై తీవ్ర ప్రభావం:

ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ, డోన, కోడుమూరు, పాణ్యం, నందికొట్కూరు, బనగానపల్లె, ఆళ్లగడ,్డ శ్రీశైలం తదితర నియోజకవర్గాల్లో నల్లరేగడి నేలల్లో రబీ పంటగా 1.25 లక్షల హెక్టార్లలో పప్పు శనగ సాగు చేశారు. చలి ఎక్కువ ఉంటే దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. తుఫాన చినుకులకు పప్పు శనగపై ఉండే పులుపు వంటి చిగురు కారిపోతుంది. పులుపు కారిపోతే పంట దిగుబడులు రావని కోడుమూరు మండలం ప్యాలకుర్తి గ్రామ రైతు వెంట్రామయ్య వివరించారు. ఎకరాకు సగటున 5 క్వింటాళ్ల వరకు నష్టపోక తప్పదని అంటున్నారు. అంటే.. దాదాపుగా 15 లక్షల క్వింటాళ్ల దిగుబడి కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది కంటికి కనిపించకుండా జరిగే నష్టం అంటున్నారు. పంట పచ్చగా కనిపిస్తున్నా దిగుబడి రాదని చెబుతున్నారు.

ఫ నీటి పాలైన పెట్టుబడి - బోయ మునిస్వామి, గోనెగండ్ల:

ఎల్లెల్సీ కాలువ కింద నాలుగు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు రూ.45-50 వేలు మట్టిలో పోశాను. అధిక వర్షాలకు పంట దెబ్బతిని దిగుబడి భారీగా తగ్గింది. 150 బస్తాలు దిగుబడి వస్తుందనుకుంటే 20 బస్తాలే వచ్చింది. తిండి గింజలైనా మిగిలాయని పంట కోసి కల్లంలో ఆరబోశాం. తుఫానకు తడిసిముద్దయింది.

ఫ చేతికొచ్చిన పంట నీటిపాలైంది - వీరనాగమ్మ, పార్లపల్లి గ్రామం, ఎమ్మిగనూరు మండలం:

గత ఏడాది ఉల్లి, పత్తి సాగు చేస్తే తీవ్రంగా నష్టపోయాం. అప్పులే మిగిలాయి. కష్టాలు తీరుతాయని ఈసారి నాలుగు ఎకరాల్లో మిరప సాగు చేశాను. ఎకరాకు రూ.లక్షకు పైగా పెట్టుబడి మట్టిలో పోశాను. బ్యాడిగిలో క్వింటా రూ.25 వేలకు పైగా ధర ఉందని తెలిసి ఆర్థిక కష్టాలు తీరుతాయని ఆశించాను. పంట కోసి కల్లంలో ఆరబోశాను. ఐదారు రోజుల్లో మార్కెట్‌కు తీసుకెళ్లాల్సి ఉంది. ఇంతలో తుఫాన నిలువునా ముంచేసింది. పంట కల్లంలోనే తడిసి ముద్దయింది. పంట రంగుబారి క్వింటా రూ.5 వేల నుంచి రూ.10 వేలకు కూడా కొంటారో లేదు తెలియదు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం.

Updated Date - 2022-12-12T00:11:46+05:30 IST