గజగజ..?

ABN , First Publish Date - 2022-11-25T00:36:24+05:30 IST

‘కార్పొరేట్‌ పాఠశాలల వసతి గృహాల్లా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను నిర్వహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి’

గజగజ..?

చలిలో సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల ఇబ్బందులు

దుప్పట్లు లేక వణికిపోతున్నా పట్టించుకోని అధికారులు

రెండేళ్లుగా టార్పెట్ల ఊసే లేదు

నంద్యాల, ఆంధ్రజ్యోతి:

‘కార్పొరేట్‌ పాఠశాలల వసతి గృహాల్లా ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లను నిర్వహించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి’ మూడు నెలల క్రితం మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమావేశంలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఈ మాట అన్నారు. అయితే క్షేత్రస్థాయిలో సంక్షేమ వసతి గృహాల పరిస్థితి దారుణంగా ఉంది. సీఎం మాటలు అమలులోకి రాలేదని స్పష్టమవుతోంది. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు చలికి గజగజ వణికిపోతున్నారు. చలికాలం వచ్చినా ఇంత వరకు విద్యార్థులకు దుప్పట్లు ఆందలేదు. అధ్వానంగా ఉన్న వసతి భవనాల్లోని విద్యార్థులు ఈ చలికాలం మరింత ఇబ్బందిపడుతున్నారు. అధికారులు సంక్షేమ హాస్టళ్ల పట్ల దృష్టి సారిస్తే తప్ప విద్యార్థుల అవస్థలు తీరవు.

వసతి గృహాల్లోని విద్యార్థులకు విద్యా సంవత్సరం ఆరంభం కాగానే దుప్పట్లు, టార్పెట్లు అందించాలి. ఒక్కో విద్యార్థికి కప్పుకోడానికి, పరుచుకోడానికి రెండేసి దుప్పట్లు ఇవ్వాలి. అయితే వైసీపీ ప్రభుత్వం అవి ఇవ్వ లేదు. సంక్షేమ వసతి గృహాల రూపురేఖలు మారుస్తామనే వాగ్దానాలేగాని పని ఏమీ జరగడం లేదు. శీతాకాలం రావడంతో విద్యార్థులు దుప్పట్లు లేక రాత్రిళ్లు చలికి గజగజ వణికిపోతున్నారు. కొంత మంది ఇంటి నుంచి తెచ్చుకున్న దుప్పట్లతో సరిపెట్టుకుంటున్నారు. అవి కూడా లేని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుప్పట్లు ఉన్న విద్యార్థులు తమ తోటి వారితో పంచుకుంటున్నారు. అఽధికారులకు ఈ కష్టాలు పట్టకపోవడంతో సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు.

పట్టించుకునే నాథుడేడి..

జిల్లా వ్యాప్తంగా ప్రీ మెట్రిక్‌ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాలు 59 ఉండగా, వాటిల్లో 8,235 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. అదే విధంగా పోస్ట్‌ మెట్రిక్‌ సంక్షేమ వసతి గృహాలు 27 ఉండగా, 1,661 మంది విద్యార్థులు వెరసి 9,896 మంది ఉన్నారు. వీరిలో ఏ ఒక్కరికి కూడా ఈ సంవత్సరం దుప్పట్లను గానీ, కార్పెట్లను గానీ అందించలేదు.

వారి పరిస్థితి ఏమిటో..

విద్యార్థి సంఘాల నాయకులు, పాత్రికేయులు వసతి గృహాల్లోకి వెళ్లకుండా, అక్కడి పరిస్థితి బైటి ప్రపంచానికి తెలియజేయకుండా అధికారులు అడ్డుకుంటున్నారు. విద్యార్థి సంఘాల వాళ్లు బాలికల వసతి గృహాల గురించి ఆరా తీయాలని ప్రయత్నిస్తే మహిళా వార్డెన్లు, నిర్వాహక అధికారులు దురుసుగా మాట్లాడుతున్నారు. కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. వారికి సహకరిస్తే విద్యార్థినిలను ఇబ్బందిపెడుతున్నారని సమాచారం. ఉన్నతాధికారులు, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి బాలికల వసతి గృహాల్లోని సమస్యలు తెలుసుకోవాలి. వాటిని పరిష్కరించాలి.

అంతటా ఇదే పరిస్థితి..

కొవిడ్‌ తర్వాత సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎవరికీ దుప్పట్లు ఇవ్వలేదు. మన జిల్లా అనే కాదు, రాష్ట్ర మంతటా ఇదే పరిస్థితి. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. ప్రభుత్వం నుంచి దుప్పట్లు రాగానే విద్యార్థులకు అందజేస్తాం.

- లక్ష్మీదేవి, డీడీ, బీసీ సంక్షేమ శాఖ, నంద్యాల

త్వరలో వస్తాయి

సంక్షేమ వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు దుప్పట్లు త్వరలోనే రానున్నాయి. ఇదివరకే జిల్లాలో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ప్రతిపాదనలు పంపించాం.

- హుసేనయ్య, ఇన్‌చార్జి డీటీడబ్ల్యూవో, నంద్యాల

చలికి వణుకుతున్న విద్యార్థులు

ఆళ్లగడ్డ: పట్టణంలోని బీసీ వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులు చలికి వణుకుతున్నారు. వీరికి ప్రభుత్వం సరఫరా చేయాల్సిన దుప్పట్లు గత రెండేళ్ల నుంచి చేయక పోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వసతి గృహంలో 150 మంది విద్యార్థులున్నారు. వీరందరికి ప్రభభుత్వం దుప్పట్లు సరఫరా చేయక పోవడంతో వారి స్వంత ఇళ్ల నుంచి తెచ్చుకొని చలికి కప్పుకొని నిద్రిస్తున్నారు. వసతి గృహానికి ఉన్న కిటికిలకు తలుపులు లేక పోవడంతో చలి గాలి వీస్తుండటంతో విద్యార్థులు నిద్రలేని రాత్రులను గడుపుతున్నారు. ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని గొప్పటు చెప్పుకోవటానికే కాలం సరిపోతున్నది. ప్రభుత్వం దుప్పట్లు సరఫరా చేయక పోవడంతో పంపిణీ చేయలేదని వార్డన్‌ సురేష్‌ చెప్పారు.

వసతులు లేని కస్తూర్బా

బేతంచెర్ల: బేతంచెర్ల కస్తూర్బా బాలికల హాస్టల్‌లో వసతులు కరువయ్యాయని విద్యార్థులు తెలిపారు. కిటికీలు, తలుపులు అన్నీ బాగున్నాయని, పాత దుప్పట్లతోనే ఇబ్బందిపడుతున్నామని విద్యార్థినులు అంటున్నారు. జూనియర్‌ కళాశాల బిల్డింగు నిర్మాణం పిల్లర్స్‌ దగ్గరే ఆగిపోయిందని, ఆ నిర్మాణం పూర్తయితే ఇబ్బందులు ఉండవని విద్యార్థినులు తెలిపారు.

దుప్పట్ల కోసం ఎదురు చూపులు

నందికొట్కూరు: దుప్పట్లు, కార్పెట్లు కోసం నందికొట్కూరులోని బీసీ బాలుర వసతి గృహం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. చలికాలం కావడంతో ఈ ఏడాది హాస్టల్‌ల్లో చేరిన విద్యార్థులు చలికి వనికిపోతున్నారు. గత ఏడాది ఇచ్చిన దుప్పట్లతోనే విద్యార్థులు సర్దుకుంటున్నారు. ఈ ఏడాది కొత్తగా 20 శాతం అడ్మిషన్లు పెరిగాయి. వీరు దుప్పట్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

రెండేళ్లుగా దుప్పట్లు ఇవ్వలేదు

ప్యాపిలి: ప్యాపిలి బీసీ బాలుర సంక్షేమ హాస్టల్‌లో రెండేళ్లుగా దుప్పట్లు పంపిణీ చేయలేదని విద్యార్థులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే హాస్టల్‌ భవనం కిటికీలకు తలుపులు కూడ లేవు. దీంతో విద్యార్థులు చలికి వణుకుతున్నారు. హాస్టల్లో మరుగుదొడ్లు లేకపోడం వలన విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు.

అవుకు హాస్టల్‌లో..

అవుకు: అవుకు పట్టణంలోని సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు ప్రభుత్వం ఈ ఏడాది దుప్పట్లు ఇవ్వలేదు. దీంతో రాత్రిళ్లు చలికి వణికి పోతున్నారు. ఈ సమీకృత వసతి గృహంలో 78మంది విద్యార్థులు ఉన్నారు. వసతి గృహం కిటికీలకు తలుపులు లేవు. మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ గత రెండేళ్ల క్రితం మరమ్మతులకు గురైంది. తాగునీటి కొళాయిల వద్ద పారిశుధ్యం లోపించింది.

చాగలమర్రిలో చలి బాధ

చాగలమర్రి: చిన్నవంగలి గ్రామంలోని ఎస్సీ హాస్టల్‌లో 3 నుంచి 10వ తరగతి వరకు 120 మంది విద్యార్థులు చదువుతున్నారు. దుప్పట్లు, టార్పెట్లు పంపిణీ చేయకపోవడంతో విద్యార్థులు గదుల్లో చలికి వణికిపోతున్నారు. కొందరు విద్యార్థులు దుప్పట్లు లేక ఇంటి నుంచి తెచ్చుకుంటున్నారు. హాస్టళ్లు ప్రారంభించి 5 నెలలు గడుస్తున్నా దుప్పట్లు పంపిణీ చేయలేదు. దోమతెరలు పంపిణీ చేయకపోవడంతో దోమల వల్ల విద్యార్థులు అనారోగ్యానికి గురౌతున్నారు. మంచాలు లేకపోవడంతో చలిలో నేలపై నిద్రించాల్సి వస్తోంది.

చలికి ఇబ్బంది పడుతున్నాం

దుప్పట్లు లేకపోవడంతో చలికి ఇబ్బంది పడుతున్నాం. నేలపైనే పడుకోవాల్సి వస్తోంది. హాస్టల్‌లో వసతులు సక్రమంగా లేక ఇబ్బందిగా ఉంది.

విష్ణువర్ధన్‌రెడ్డి, విద్యార్థి, 9వ తరగతి, చిన్నవంగలి గ్రామం

హాస్టల్‌ సమస్యలు ఉన్నతాధికారుల దృష్టికి

హాస్టల్‌ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. దుప్పట్లు పంపిణీ జరగలేదు. గతంలో ఇచ్చిన పాత దుప్పట్లను సర్దుకుంటున్నాం.

- ఖాసీం సాహెబ్‌, హాస్టల్‌ వార్డెన్‌, చిన్నవంగలి

Updated Date - 2022-11-25T00:36:24+05:30 IST

Read more