రేపు కృష్ణంరాజు సంస్మరణ సభ

ABN , First Publish Date - 2022-09-28T08:29:36+05:30 IST

కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌స్టార్‌ యూవీ కృష్ణంరాజు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించనున్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా..

రేపు కృష్ణంరాజు సంస్మరణ సభ

మొగల్తూరులో భారీగా ఏర్పాట్లు

హాజరుకానున్న నటుడు ప్రభాస్‌


మొగల్తూరు, సెప్టెంబరు 27: కేంద్ర మాజీ మంత్రి, రెబల్‌స్టార్‌ యూవీ కృష్ణంరాజు సంస్మరణ సభను ఘనంగా నిర్వహించనున్నారు. గురువారం పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగే ఈ కార్యక్రమంలో సుమారు 50వేల మందికి భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు, హీరో ప్రభాస్‌ కూడా కార్యక్రమానికి హాజరుకానున్నారు. సంస్మరణ సభ, సమారాధన కార్యక్రమాలకు రావాలంటూ మొగల్తూరు మండలంలోని ప్రతి ఇంటికీ సమాచారం పంపారు. కృష్ణంరాజు ఈ నెల 11న హైదరాబాద్‌లో కన్నుమూశారు.  22, 23 తేదీలలో అక్కడే దశ దిన కార్యక్రమాలను నిర్వహించారు.


అయితే, కృష్ణంరాజు సొంతూరు మొగల్తూరులోనూ సంస్మరణ సభ నిర్వహించాలని నిర్ణయించారు. గ్రామంలో ఇబ్బందులు తలెత్తకుండా భారీగా బారికేడ్లతో పోలీస్‌ భద్రత కల్పిస్తున్నారు.ప్రభుత్వపరంగా పూర్తి సహకారం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు తెలిపారు. ఎస్పీ రవి ప్రకాశ్‌, కలెక్టర్‌ పి.ప్రశాంతి, సబ్‌కలెక్టర్‌ విష్ణుచరణ్‌ తదితరులు మంగళవారం ఆయా ప్రాంతాలను పరిశీలించారు. పాతకాలువ సెంటర్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నివసించిన గృహన్నీ కలెక్టర్‌ సందర్శించారు.

Read more