ఏడాదిలో రూ.41.26 కోట్లతో 469 పనులు : హారిక

ABN , First Publish Date - 2022-09-26T07:07:01+05:30 IST

పాలకవర్గం ఏర్పడిన ఏడాది కాలంలో రూ.41.26 కోట్లతో 469 పనులు మంజూరు కాగా, పురగతిలో ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పేర్కొన్నారు

ఏడాదిలో రూ.41.26 కోట్లతో 469 పనులు : హారిక

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 25 : పాలకవర్గం ఏర్పడిన ఏడాది కాలంలో రూ.41.26 కోట్లతో 469 పనులు మంజూరు కాగా,  పురగతిలో ఉన్నాయని జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక పేర్కొన్నారు.   జిల్లా పరిషత్‌ పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తి చేసిన సందర్భంగా జిల్లాలో చేపట్టిన వివిధ కార్యక్రమాలపై జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో ఆదివారం ఆమె మాట్లాడారు. సీఎం జగన్‌మోహనరెడ్డి పెడన వచ్చినప్పుడు జిల్లా పరిషత్‌ హాలు సమస్య చెప్పగా రూ. 9 కోట్లు మంజూరు చేశారన్నారు.   ఎన్టీఆర్‌ జిల్లాలో జడ్పీ సమావేశ మందిరం నిర్మించేందుకు నిధులు విడుదల చేస్తున్నారన్నారు. జడ్పీ ఆదాయ వనరుల నుంచి గతంలో రూ. 89.5 లక్షల ఆదాయం రాగా, పాలకవర్గం ఏర్పడిన తరువాత ఆదాయాన్ని రూ. కోటి 40 లక్షలకు పెంచామన్నారు. మహిళా సాధికారికతకు జడ్పీ ఆవరణలో రూ.కోటి 50 లక్షలతో మహిళలకు వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. అవనిగడ్డ, ఉయ్యూరులలో రూ.కోటి 5 లక్షలతో స్ర్తీ శిశు సంక్షేమ వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నామన్నారు. అనంతరం జరిగిన స్టాండింగ్‌ కమిటీ సమావేశాల్లో పలువురు జడ్పీటీసీ సభ్యులు  తాగునీటి సమస్యలను ప్రస్తావించారు.  వెంటనే నిధులు మంజూరు చేసి ఫిల్టర్‌బెడ్‌లను పరిశుభ్రం చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్‌ ఆమె అధికారులను ఆదేశించారు. గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం పనులకు చెందిన 1, 2, 4, 7 స్థాయి సంఘ సమావేశాలకు జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధ్యక్షత వహించారు. వ్యవసాయ రంగంపై జరిగిన మూడో స్థాయి సంఘ సమావేశానికి జడ్పీ ఉపాధ్యక్షురాలు గరికపాటి శ్రీదేవి అధ్యక్షత వహించారు. మహిళా శిశు సంక్షేమంపై నిర్వహించిన 5వ స్థాయి సంఘ సమావేశానికి జడ్పీటీసీ సభ్యురాలు గుత్తా సీతారామలక్ష్మి అధ్యక్షత వహించారు. సాంఘిక సంక్షేమ అంశంపై నిర్వహించిన 6వ స్థాయి సంఘ సమావేశానికి గుదిమెళ్ళ కృష్ణంరాజు అధ్యక్షత వహించారు. గన్నవరం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను  బాలికల జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేయలేదని  కో ఆప్షన్‌ సభ్యుడు గౌస్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో బాలికల హాస్టల్‌లో తక్షణం వార్డెన్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. సీతనపల్లిలో సీపీడబ్ల్యు స్కీమ్‌ సరిగా లేదని, నీరు కలుషితంగా వస్తోందన్నారు. సంగమూడి, లక్ష్మీపురం ఉన్నత పాఠశాలలకు నాబార్డు నిధులు ఇచ్చిన ప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. ఈ చర్చల్లో కంచికచర్ల జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, నందిగామ జడ్పీటీసీ జి. వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జడ్పీ సీఈవో శ్రీనివాసరావు, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ, సర్వశిక్షా అభియాన్‌ ఏపీసీ డాక్టర్‌ ఏ. శేఖర్‌, డీఈవో తాహెరా సుల్తానా తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా వార్షికోత్సవం

  జిల్లా పరిషత్‌ పాలకవర్గం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జడ్పీ సమావేశపు హాలులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికను వైస్‌చైర్మన్లు గుదిమెళ్ళ కృష్ణంరాజు, గరికపాటి శ్రీదేవిలతో పాటు పలువురు జడ్పీటీసీ సభ్యులు, ఇన్‌ఛార్జి సీఈవో శ్రీనివాసరావు ఘనంగా సత్కరించారు. అనంతరం జడ్పీటీసీ సభ్యులను జడ్పీ చైర్మన్‌ శాలువాలు, జ్ఞాపికలు, పూలదండలతో సత్కరించారు.  జడ్పీ ఉద్యోగులు వి. రాంబాబు, నూతలపాటి శ్రీనివాస్‌, సునీత  పాల్గొన్నారు.

జేఏసీ సత్కారం

   జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక హయాంలో పలువురికి పదోన్నతులు లభించాయని గుడ్లవల్లేరు ఎంపీడీవో, తూర్పు కృష్ణా ఉద్యోగుల జేఏసీ కన్వీనర్‌ దారపు శ్రీనివాస్‌ అన్నారు. జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక ఏడాది పాటు పదవీ కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా హారికకు దారపు శ్రీనివాస్‌ జ్ఞాపికను ఇచ్చి సత్కరించారు. 50 మంది ఉద్యోగులకు పదోన్నతు కల్పించారన్నారు. 26 మందికి కారుణ్య నియామకాలు జరిపారన్నారు.  వీరులపాడు జడ్పీటీసీ అమళ్ళపూడి కీర్తితో పాటు ఆమె భర్త, సమగ్ర శిక్ష అడిషనల్‌ ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఏ. శేఖర్‌ను కూడా  జడ్పీ చైర్‌పర్సన్‌ సత్కరించారు. పాఠశాలలను అభివృద్ధి చేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ కోరారు.  

Read more