దాడులు.. దందాలు..

ABN , First Publish Date - 2022-06-07T06:34:09+05:30 IST

దాడులు.. దందాలు..

దాడులు.. దందాలు..

నగరంలో అధికార పార్టీ కార్పొరేటర్ల ఆగడాలు

మంత్రి మెప్పు కోసం రెచ్చిపోయిన వైసీపీ కార్పొరేటర్‌ భర్త 

పున్నమి రిసార్ట్స్‌లో కర్రలు, రాడ్లతో బీభత్సం

మంత్రి జోగి రమేశ్‌ ఫొటోగ్రాఫర్‌కు అండగా వీరంగం

ఫొటోషూట్‌ వద్దన్న రిసార్ట్‌ సిబ్బందిపై దాడి

ఇరిగేషన్‌ స్థలాన్ని రాత్రికి రాత్రి కబ్జా చేసిన మరో కార్పొరేటర్‌


దర్జాగా కబ్జాలు.. ప్రశ్నిస్తే దౌర్జన్యాలు.. కర్రలు, రాడ్లతో దాడులు.. బడా నాయకులే కాదు.. తాము కూడా ఏమాత్రం తీసిపోమంటూ వీరంగం సృష్టిస్తున్నారు అధికార పార్టీ కార్పొరేటర్లు. అన్నింట్లోనూ అక్రమాలు.. అడ్డొచ్చిన వారిపై విచక్షణారహితంగా దాడులు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారు. అధికార పార్టీ పెద్దల సహకారం, మంత్రిగారి వత్తాసు, పోలీసుల అత్యుత్సాహం వెరసి కార్పొరేటర్లే రౌడీషీటర్ల మాదిరిగా జనంపై ఎగబడుతున్నారు. ఇందుకు రెండు రోజుల్లో నగరంలో జరిగిన రెండు ఘటనలే నిదర్శనం.

- విజయవాడ-ఆంధ్రజ్యోతి/విద్యాధరపురం


బెర్మ్‌పార్క్‌లో రణరంగం

చిట్టినగర్‌కు చెందిన ఫొటోగ్రాఫర్‌ సుబానీ మంత్రి జోగి రమేశ్‌ వద్ద పనిచేస్తుంటాడు. తన స్నేహితుడు ప్రదీప్‌రెడ్డితో కలిసి సోమవారం ఉదయం 5.30 గంటల సమయంలో భవానీపురంలోని బెర్మ్‌పార్క్‌లో ప్రీ వెడ్‌ షూట్‌ చేయడం ప్రారంభించాడు. దీనికి అక్కడి సిబ్బంది అడ్డుచెప్పారు. ఫొటోషూట్‌కు రూ.3,360 చెల్లించాలని సూచించారు. దీంతో ఆగ్రహించిన సుబానీ తాను మంత్రి జోగి రమేశ్‌ తాలుకా అని, తననే డబ్బు అడుగుతావా.. అంటూ సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. వెంటనే సిబ్బంది ప్రసాద్‌, శ్రావణ్‌, సాయి విషయాన్ని మేనేజర్‌ శ్రీనివాస్‌కు ఫోన్‌ ద్వారా తెలిపారు. మేనేజర్‌ రిసార్ట్స్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఆరా తీశారు. అనుమతి తీసుకోకపోవడంతో పాటు ఉద్యోగిపై చేయిచేసుకున్న సుబానీని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో 42వ డివిజన్‌ కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి భర్త ప్రసాదరెడ్డికి ఫోన్‌ చేసి పిలిపించారు. ప్రసాద్‌రెడ్డి వెంటనే మూడు కార్లలో సుమారు 25 మంది అనుచరులతో వచ్చి మేనేజర్‌తో గొడవకు దిగారు. మేనేజర్‌ చెబుతున్నది వినిపించుకోకుండా దౌర్జన్యానికి దిగి చేయి చేసుకున్నారు. ప్రసాద్‌రెడ్డి అనుచరులు, ఫొటోగ్రాఫర్‌ సుబానీ రిసార్ట్స్‌ ప్రాంగణంలో కర్రలు, రెయిలింగ్‌ను విరగ్గొట్టి రాడ్లను తీసుకుని సుమారు గంటపాటు వీరంగం సృష్టించి సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. దాడిలో ప్రసాద్‌, శ్రావణ్‌, సాయి, మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా, కార్పొరేటర్‌ భర్త ప్రసాద్‌రెడ్డి ఒత్తిడితో పోలీసులు కేసును నీరుగార్చేందుకు చూస్తున్నట్లు బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీ కెమెరా రికార్డులను తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. తమను సాయంత్రం వరకు స్టేషన్‌లో ఉంచిన పోలీసులు నిందితులైన సుబానీ, ప్రసాద్‌రెడ్డిని పంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి.. పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌చేసి తమ వారిపై కేసు లేకుండా చూడాలని కోరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో పోలీసులు పెట్టీ కేసుగా నమోదు చేశారు. 

సెటిల్‌మెంట్‌ కింగ్‌ ప్రసాద్‌రెడ్డి

42వ డివిజన్‌ కార్పొరేటర్‌ చైతన్యరెడ్డి భర్త ప్రసాద్‌రెడ్డి పశ్చిమ నియోజకవర్గంలో సెటిల్‌మెంట్లు చేస్తుంటారు. సుమారు 4 నెలల క్రితం ఓ అమ్మాయి విషయంలో భవానీపురానికి చెందిన రెండు వర్గాలు తన్నుకున్నాయి. ఆ విషయంలో పంచాయతీ చేసిన ప్రసాద్‌రెడ్డి భారీగానే ఇరువర్గాల నుంచి డబ్బు వసూలు చేశారన్న ప్రచారం జరిగింది. ప్రసాద్‌రెడ్డి తండ్రి సుబ్బారెడ్డి షామియానా వ్యాపారంలో ఉన్నారు. నగరంలో వీరికి మూడు షామియానా షాపులున్నాయి. సుబ్బారెడ్డికి వెంకటేశ్వరరెడ్డి, నాగేశ్వరరెడ్డి అనే భాగస్వాములు ఉన్నారు.  కొద్దిరోజుల క్రితం సుబ్బారెడ్డి, ఆయన కొడుకు ప్రసాద్‌రెడ్డి కలిసి వెంకటేశ్వరరెడ్డిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. తనకు రావాల్సిన వాటా ఇచ్చేస్తే తాను వేరేగా వెళ్లిపోతానన్నందుకే వెంకటేశ్వరరెడ్డిపై దాడికి దిగారు.








రాత్రికి రాత్రి ఇరిగేషన్‌ స్థలం స్వాహా

కోట్ల రూపాయల విలువచేసే ఇరిగేషన్‌ స్థలాన్ని రాత్రికి రాత్రే సొంతం చేసుకునేందుకు ఓ వైసీపీ కార్పొరేటర్‌ చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్నారు. 14వ డివిజన్‌లోని చిట్టిబొమ్మ రామస్వామినగర్‌లో రజకుల కల్యాణ మండపం పక్కనే ఇరిగేషన్‌ శాఖకు సంబంధించిన 14 సెంట్లు ఉంది. ఇది చాలారోజుల నుంచి ఖాళీగా ఉండటంతో స్థానికుల అభ్యర్థనతో గతంలో ఇక్కడ బీసీ కల్యాణ మండపం నిర్మించడానికి శంకుస్థాపన జరిగింది. కానీ, ఆ నిర్మాణం కార్యరూపం దాల్చలేదు. కోట్ల రూపాయల విలువచేసే ఈ స్థలంపై స్థానిక వైసీపీ కార్పొరేటర్‌ కన్ను పడింది. సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయన స్థానికంగా మరో వైసీపీ నేతను పురమాయించి శనివారం రాత్రి పెద్దసంఖ్యలో తన అనుచరగణంతో కలిసి ఎక్స్‌కవేటర్‌ తెచ్చి స్థలాన్ని చదును చేశారు. ఈ హడావుడి చూసి కంగుతిన్న స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేత వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. కోట్ల రూపాయల విలువచేసే స్థలాన్ని వైసీపీ నేత ఆక్రమించుకుంటున్నా ఇరిగేషన్‌ అధికారులు పట్టనట్టు ఎందుకు వ్యవహరిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్థలం అన్యాక్రాంతం కాకుండా ఇరిగేషన్‌ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

Updated Date - 2022-06-07T06:34:09+05:30 IST