అధికారం.. అలంకారమే..

ABN , First Publish Date - 2022-09-27T06:09:29+05:30 IST

అధికారం.. అలంకారమే..

అధికారం.. అలంకారమే..

పేరుకే పదవుల్లో బీసీలు.. పెత్తనమంతా వైసీపీ ఎమ్మెల్యేలదే

రెండు జిల్లాల్లో బీసీ నాయకురాళ్లకు తీవ్ర అవమానాలు

ప్రొటోకాల్‌పరంగానూ దక్కని గౌరవం

విజయవాడ నగర మేయర్‌ను పట్టించుకోని ఎమ్మెల్యేలు

మచిలీపట్నంలో మేయర్‌ ఉన్నా లేనట్టే..

జడ్పీ చైర్‌పర్సన్‌ మాట లెక్కే లేదు


ఈనెల 12వ తేదీ : కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారికకు చేదు అనుభవం ఎదురైంది. కలెక్టరేట్‌లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్‌ భారతీ ప్రవీణ్‌ పవార్‌ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో వేదికపై ఆమెకు కుర్చీ లేకుండా చేశారు. కేంద్రమంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చేందుకు వచ్చిన ఆమె తనకు జరిగిన అవమానంతో వెనుదిరిగారు. 

24వ తేదీ : ఎన్టీఆర్‌ జిల్లా కేంద్రమైన విజయవాడలో వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి విడదల రజని పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన మేయర్‌ రాయన భాగ్యలక్ష్మిని మంత్రి సెక్యూరిటీ సిబ్బంది తోసేయడంతో ఆమె కింద పడిపోయారు. అక్కడే ఉన్న మంత్రి కానీ, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కానీ మేయర్‌కు జరిగిన అవమానంపై పెదవి విప్పలేదు. తీవ్ర మనస్తాపానికి గురైన మేయర్‌ కంటతడి పెట్టుకుని వెళ్లిపోయారు. 

పై రెండు ఘటనల్లోనూ అవమానానికి గురైంది బీసీలైన మహిళలే. ప్రొటోకాల్‌పరంగా చూసుకున్నా.. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కంటే జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, కార్పొరేషన్‌ మేయర్‌ ముందు వరుసలో ఉంటారు. కానీ, వైసీపీ ప్రభుత్వంలో బలమున్న వాడిదే రాజ్యమన్న తరహాలో స్థానిక ఎమ్మెల్యేల హవానే పైచేయిగా నిలుస్తోంది. అధికారులు సైతం ప్రొటోకాల్‌ను పక్కన పెట్టేసి స్థానిక ఎమ్మెల్యేలు చెప్పినట్టే నడుచుకుంటున్నారు. - (విజయవాడ-ఆంధ్రజ్యోతి)


మచిలీపట్నంలో ఉత్తుత్తి మేయర్‌

గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణాజిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌తో పాటు విజయవాడ, మచిలీపట్నం నగరపాలక సంస్థల చైర్మన్‌ పదవులు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి. బీసీలంటే తమ పార్టీకి ఎంతో ప్రేమ ఉందని చెప్పుకొంటూ వైసీపీ పెద్దలు ఆ మూడు స్థానాల్లోనూ బీసీ మహిళలను కూర్చోబెట్టారు. కానీ, పీఠం ఎక్కిన నాటి నుంచి వారెవ్వరూ సొంతంగా ఒక్క పని కూడా చేసుకోలేని పరిస్థితి. పేరుకే పదవి.. అధికారమంతా స్థానిక ఎమ్మెల్యేలు, వారి తనయులే వెలగబెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మచిలీపట్నం నగరపాలక సంస్థలో స్థానిక ఎమ్మెల్యే తనయుడు అంతా తానై నడిపిస్తుంటారు. నగర ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వరని సొంత పార్టీ నాయకులే చెప్పుకొంటున్నారు. 

విజయవాడలో విలువలేని మేయర్‌

విజయవాడ నగరపాలక సంస్థలో మేయర్‌ మాట కంటే, ఇద్దరు ఎమ్మెల్యేలు, మరో నియోజకవర్గ ఇన్‌చార్జి మాటకే అధికారులు ఎక్కువ విలువ ఇస్తుంటారు. డిప్యూటీ మేయర్లు కూడా మేయర్‌ కంటే బలవంతులే. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమే ఈనెల 24న అయోధ్యనగర్‌ వైఎస్సార్‌ పట్టణ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవంలో జరిగిన ఘటన. వీఎంసీ డిప్యూటీ మేయర్లు ఇద్దరిలో ఒకరు రెడ్డి సామాజికవర్గం, మరొకరు కాపు సామాజికవర్గం. అటు వైసీపీ నాయకులు కానీ, ఇటు అధికారులు కానీ వీరికి ఇస్తున్న ప్రాధాన్యం మేయర్‌కు ఇవ్వడం లేదు. పశ్చిమ, సెంట్రల్‌లో ఏ పని కావాలన్నా ఎమ్మెల్యేలు చెబితేనే జరుగుతుంది. తూర్పులో వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి మాటే చెల్లుబాటు అవుతుంది. ఈ పరిస్థితిలో మేయర్‌ పదవి పేరుకే పదవిగా మిగిలిందని అనుచరవర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, సెంట్రల్‌ ఎమ్మెల్యే మల్లాది విష్ణు రెండు రోజుల క్రితం నగరానికి చెందిన ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ మనవరాలి వేడుకలో పాల్గొన్నారు. ఇద్దరూ ఎదురుపడినా కనీసం పలకరించుకోలేదు. 

చైర్‌పర్సన్‌ మాటే వినరు

జిల్లా పరిషత్‌లో చైర్‌పర్సన్‌ మాట వినే నాథుడే లేడు. చైర్‌పర్సన్‌ కుటుంబీకులు ఇటీవల కృష్ణాజిల్లా కేంద్రంలో ఓ బార్‌ను వేలంపాటలో దక్కించుకున్నారు. ఆ బార్‌ను ప్రారంభించుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కల్పించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ కంటే తన అనుచరులకే ఆయన ప్రాధాన్యమిచ్చి నగర పరిధిలో వారి బార్‌లే ఉండాలని, కావాలంటే నగర శివార్లలో చైర్‌పర్సన్‌ కుటుంబీకులు బార్‌ పెట్టుకోవచ్చని హుకుం జారీ చేశారు. టెండర్ల విషయంలోనూ జిల్లా మంత్రి, మాజీ మంత్రి అయిన ఎమ్మెల్యే మాటే చెల్లుబాటు అవుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. 

Read more