రూ.కోటిన్నరకు టోకరా

ABN , First Publish Date - 2022-03-16T06:21:26+05:30 IST

మాటలతోనే కాదు.. చేతలతోనూ నమ్మకం కలిగిస్తూ, చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది ఓ మహిళ.

రూ.కోటిన్నరకు టోకరా

చిట్టీల పేరుతో మహిళ మోసం

హామీలుగా ఏటీఎం కార్డులు, ఖాళీ చెక్కులు

ఇప్పటికి బాధితుల సంఖ్య 80

ఈ సంఖ్య ఇంకా పెరుగుతుందని అంచనా


విజయవాడ/చిట్టినగర్‌, మార్చి 15 (ఆంరఽధజ్యోతి) : మాటలతోనే కాదు.. చేతలతోనూ నమ్మకం కలిగిస్తూ, చిట్టీల వ్యాపారం మొదలుపెట్టింది ఓ మహిళ. ఖాతాదారుల చేతిలో ఏటీఎం కార్డులను సైతం పెట్టింది. కొందరు నమ్మి చిట్టీలు వేయడం మొదలెట్టారు. వారిని చూసి ఇంకొందరు ముందుకొచ్చారు. ఖాతాదారులు పెరిగారు. కోట్లలో డబ్బు చేతికందింది. గుట్టుచప్పుడు కాకుండా సుమారు రూ.1.50 కోట్లతో జెండా ఎత్తేసింది. మోసపోయినట్టు గుర్తించిన బాధితులు మంగళవారం పోలీసులను ఆశ్రయించారు.  


ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వన్‌టౌన్‌లోని తెలుగు బాప్టిస్ట్‌ చర్చి ప్రాంతానికి చెందిన వస్త్రవ్యాపారి పూర్ణ భార్య దామినేని సిజిలి కొన్నాళ్ల క్రితం చిట్టీలను మొదలు పెట్టింది. ఖాతాదారులు నెలకు రూ.1000 చొప్పున 12 నెలలు చెల్లిస్తే ఆ మొత్తానికి మరో రూ.3వేలు కలిపి రూ.15 వేలు ఇచ్చేది. దీనితో చిట్టినగర్‌ ప్రాంత కూలీలు, వ్యాపారులు ఆమె వద్ద చిట్టీలు వేశారు. ముందుగా దసరా చిట్టీలను, ఆ తరువాత రూ.1, 2, 3 లక్షల చిట్టీలను ప్రారంభించింది. తాను ఖాతాదారులకు ఇవ్వాల్సిన డబ్బులకు హామీగా కొంతమందికి ఖాళీ చెక్కులను, ఒకరిద్దరికి ఏటీఎం కార్డులను సైతం ఇచ్చి నమ్మించింది. చిట్టీలను ప్రారంభించిన ఆరు నెలలపాటు చెల్లింపులను సక్రమంగానే చేసింది. ఏడాది కాలంగా చెల్లింపులను వాయిదా వేస్తోంది. కొద్దికాలంగా తమకు రావాల్సిన డబ్బు కోసం ఖాతాదారులు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రెండు వారాల నుంచి సిజిలి కనిపించడం లేదు. తాము మోసపోయామని గుర్తించిన బాధితులందరూ ఒక్కటై, మంగళవారం రోడ్డెక్కారు. తాము నిలువునా మోసపోయామని గగ్గోలు పెడుతూ కొత్తపేట పోలీసులను ఆశ్రయించారు. బాధితుల సంఖ్య ప్రస్తుతం 80 వరకు తేలింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఖాతాదారుల డబ్బులతో సిజిలి జెండా ఎత్తేయగా, ఆమె భర్త పూర్ణ తన భార్య సిజిలి కనిపించడం లేదని నాలుగు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేయడం ద్వారా ఖాతాదారులకు మరో ట్విస్ట్‌ ఇచ్చాడు. చిట్టీలు నిర్వహించడమే కాకుండా, కొంతమంది నుంచి రూపాయి, రెండు రూపాయలకు వడ్డీకి డబ్బులు తీసుకుని, కాల్‌మనీలో పెట్టినట్టు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Updated Date - 2022-03-16T06:21:26+05:30 IST