మధ్యాహ్న భోజనం చేయలేకపోతున్నాం!

ABN , First Publish Date - 2022-09-24T06:43:41+05:30 IST

మధ్యాహ్న భోజనం చేయలేకపోతున్నాం!

మధ్యాహ్న భోజనం చేయలేకపోతున్నాం!
విద్యార్థులతో మాట్లాడుతున్న సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఎం.జగదీష్‌

 సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఎదుట చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌ విద్యార్థుల గగ్గోలు.. హాజరైన విద్యార్థులు 685.. భోజనం చేసింది 132 మంది

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 23: మధ్యాహ్న భోజనం చేయలేకపోతున్నామని, వంట ఏజెన్సీ నిర్వాహకులు సరిగా పెట్టడం లేదని, కోడిగుడ్లు సరిగా ఇవ్వడం లేదని, అన్నం కడుపునిండా పెట్టడం లేదని సోషల్‌ ఆడిట్‌ డైరెక్టర్‌ ఎం.జగదీష్‌ ఎదుట మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని చిలకలపూడి మునిసిపల్‌ హైస్కూల్‌ విద్యార్థులు వాపోయారు. హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనాలను శుక్రవారం జగదీష్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. హైస్కూల్‌ లో 816 మంది విద్యార్థులు చదువుతుండగా శుక్రవారం 685 మంది హాజర య్యారు. వీరిలో 132 మందే భోజనం చేయడాన్ని ఆయన గుర్తించారు. విద్యార్థులతో రెండు గంటల సేపు చర్చించారు. వారు చెప్పిన ఫిర్యాదులన్నీ రాసుకున్నారు. ఎస్పీఎల్‌తో పాటు లీడర్స్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత గతంలో ఈ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేసిన పుడు విద్యార్థులు సమస్యను జేసీకి వివరించారు. లోపాలు సరిచేసుకుంటామని చెప్పాకే జేసీ ఏజెన్సీని కొనసాగించారు. ప్రధానోపాధ్యాయురాలు కనకదుర్గ, డీవైఈవో యు.వి.సుబ్బారావు, ఎంఈవో దుర్గాప్రసాద్‌తో డైరెక్టర్‌ సమీక్షించారు. వంట ఏజెన్సీ తన మాట వినడం లేదని హెచ్‌ఎం కనకదుర్గ చెప్పారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక పంపుతామని డైరెక్టర్‌ జగదీష్‌ తెలిపారు.


Read more