కారు కొనిస్తారా.. ఖాళీ చేస్తారా?

ABN , First Publish Date - 2022-11-25T01:03:39+05:30 IST

భవానీపురంలోని సర్వే నెంబరు 10లో 40 ఎకరాల వక్ఫ్‌ భూమి ఉంది. ఇందులో కొంత విస్తీర్ణంలో మార్బుల్‌ దుకాణాల వారు స్థలాన్ని లీజుకు తీసుకుని కొన్నేళ్లుగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. కనకదుర్గ ఫ్లై ఓవర్‌ నిర్మాణ సమయంలో వీరిలో కొందరిని ఖాళీ చేయించి ఆ స్థలాన్ని సోమా కంపెనీకి అప్పగించారు. ఫ్లై ఓవర్‌ నిర్మాణం పూర్తికావడంతో కంపెనీ ఆ స్థలాన్ని వెనక్కి ఇచ్చేసింది. మార్బుల్‌ దుకాణాల వారు యథావిధిగా అక్కడ తమ వ్యాపారాలు చేసుకుంటున్నారు. వీరి లీజు గడువు ముగియడంతో రెన్యువల్‌కు ఇటీవల వక్ఫ్‌ అధికారులకు విన్నవించుకున్నారు. వక్ఫ్‌బోర్డులో కీలక స్థానంలో ఉన్న వ్యక్తి తనకు సుమారు రూ.50 లక్షల విలువైన కారును బహుమానంగా ఇవ్వాలని తేల్చిచెప్పారు.

కారు కొనిస్తారా.. ఖాళీ చేస్తారా?

ఎస్‌కేసీవీ ట్రస్టు భూమిపైనా కన్ను

వక్ఫ్‌ బోర్డులో కీలక పదవిలో ఉన్న నేత దందా

(విజయవాడ-ఆంధ్రజ్యోతి/వన్‌టౌన్‌) : వక్ఫ్‌ బోర్డులో కీలక పదవిలో ఉన్న ఆ వ్యక్తి తెల్లారి లేస్తే తనంత నిజాయితీపరుడు ఉండడని ఊదరగొడుతుంటారు. వక్ఫ్‌ భూముల పరిరక్షణకు పూర్తిస్థాయిలో పనిచేస్తున్నామని, వక్ఫ్‌ ఆస్తుల జోలికొస్తే సహించబోమని హడావుడి చేస్తుంటారు. విలేకరుల సమావేశంలో ఎన్నెన్నో నీతి వ్యాఖ్యాలు చెప్పే సదరు వ్యక్తి అసలు స్వరూపం వేరే ఉందని వక్ఫ్‌ బోర్డు డైరెక్టర్లే బట్టబయలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు అండ తనకు ఉన్నట్లు ప్రచారం చేసుకుంటూ ఆయన చేస్తున్న అవినీతికి అంతే లేకుండా పోయిందని వారు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం అతని వ్యవహారశైలిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం.

అంతా తానే.. అన్నీ తానే..

తాజాగా బోర్డులోని సిబ్బందికి, ముతావరులు, తదితరులకు ఆయన కొన్ని సూచనలు చేస్తూ తనకు తెలియకుండా ఏ ఫైల్‌పై చిన్న గీత కూడా పడకూడదని, తాను చెప్పినట్లు వింటేనే పనులు సాగుతాయని హకుం జారీ చేసినట్లు చెబుతున్నారు. వక్ఫ్‌ బోర్డు భూములకు సంబంధించి భవానీపురంలోని సర్వే నెంబరు 10లో రెండెకరాలు రాయలసీమకు చెందిన ఎమ్మెల్యే, బోర్డు డైరెక్టర్‌ కూడా అయిన వ్యక్తికి కేటాయించాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరో 10 ఎకరాలను ఓ ప్రైవేట్‌ సంస్థకు కేటాయించేందుకు పావులు కదుపుతున్నారు. గొల్లపూడిలో సుమారు 30 ఏళ్లుగా నడుస్తున్న ఎస్‌కేసీవీ ట్రస్ట్‌ భూములపైనా ఈయన కన్ను పడింది. అక్కడ ట్రస్టు నిర్మాణాలను తొలగించి ఆ ప్రదేశంలో వక్ఫ్‌బోర్డు అతిథి గృహాన్ని నిర్మించాలని ఈయన ప్లాన్‌ వేశారు. అయితే, వీటన్నింటికీ బోర్డు ఆమోదం తెలిపినట్లుగా తీర్మానం చేస్తూ సంతకాలు చేయాలని డైరెక్టర్లపై ఒత్తిడి తెస్తున్నట్లు చెబుతున్నారు. వీటికి ఆమోదం తెలిపితేనే చెప్పిన పనులు చేసి పెడతానని 9 మంది డైరెక్టర్లకు చెబుతున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2022-11-25T01:03:39+05:30 IST

Read more