కమిషనరేట్‌ యాథాతథం

ABN , First Publish Date - 2022-02-23T06:33:24+05:30 IST

ఉగాది నాటికి జిల్లా విభజన జరిగినా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ రూపురేఖలు మారబోవని అధికారులు చెబుతున్నారు.

కమిషనరేట్‌ యాథాతథం

పశ్చిమ కృష్ణాలోని ప్రాంతాలు కమిషనరేట్‌లోకే!


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ఉగాది నాటికి జిల్లా విభజన జరిగినా విజయవాడ పోలీస్‌ కమిషనరేట్‌ రూపురేఖలు మారబోవని అధికారులు చెబుతున్నారు. దీంతో కమిషనరేట్‌ యథాతథంగా కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనికి తోడు అదనంగా మరికొంత ప్రాంతాన్ని కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశాలూ ఉన్నాయని తెలుస్తోంది. కమిషనరేట్‌ పరిధిలో రెండు మండలాలు, ఐదు జోన్లు ఉన్నాయి. ఇందులో తూర్పు జోన్‌లో ఉన్న గన్నవరం, ఆత్కూరు, కంకిపాడు, ఉంగుటూరు, ఉయ్యూరు టౌన్‌, ఉయ్యూరు రూరల్‌, పమిడిముక్కల, తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్లతోపాటు మధ్య మండలంలో ఉన్న పెనమలూరు పోలీస్‌స్టేషన్‌ మచిలీపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. విభజన జరిగితే ఈ స్టేషన్లను జిల్లా ఎస్పీకి అప్పగించాల్సి వస్తుందని భావించారు. ఉగాది నాటికి కొత్త జిల్లా ఏర్పాటైనా కమిషనరేట్‌ రూపురేఖలు ఏమాత్రం మారబోవని అధికారులు చెబుతున్నారు.  


సైబరాబాద్‌, రాచకొండలా...

హైదరాబాద్‌లో మూడు కమిషనరేట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నగరం మొత్తం హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉంటుంది. గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లాలు ఉన్నాయి. తర్వాత కొత్తగా ఏర్పడిన రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో మేడ్చల్‌ - మల్కాజ్‌గిరి జిల్లాలోని కొంతభాగం, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాలు వస్తాయి. ఇదే ఫార్ములాను విజయవాడ పోలీసు కమిషనరేట్‌ విషయంలో అమలు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అర్బన్‌ పోలీసింగ్‌ విధానంలో జిల్లాలతో సంబంధం ఉండదని ఓ అధికారి తెలిపారు. దీని ప్రకారం తూర్పు జోన్‌లో ఉన్న పోలీస్‌స్టేషన్లు మచిలీపట్నం జిల్లాలో ఉన్నా, పోలీసు కమిషనరేట్‌కు అత్యంత సమీపంగా ఉన్న కారణంగా కమిషనరేట్‌ పరిధిలోనే ఉంచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. 


జోన్ల పరిధిలో మార్పులు!

విజయవాడ కేంద్రంగా ఏర్పాటయ్యే కొత్త జిల్లా జగ్గయ్యపేట వరకు ఉంటుంది. ప్రస్తుతం కమిషనరేట్‌లో ఉన్న పశ్చిమ జోన్‌ ఇబ్రహీంపట్నం వరకు ఉన్నది. ఆపైన ఉన్న ప్రాంతాలు జిల్లా ఎస్పీ పరిధిలో ఉన్నాయి. జిల్లా విభజన జరిగితే మచిలీపట్నంలో ఉన్న జిల్లా ఎస్పీ కార్యాలయం ఆ జిల్లాకే ఉంటుంది. కొత్తగా ఏర్పడే విజయవాడ జిల్లాలోని పశ్చిమ భాగంలో ఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే పరిధి తక్కువగా ఉన్నందున అలా ఏర్పాటు చేయడం కష్టమని, ఆ పోలీస్‌స్టేషన్లనూ కమిషనరేట్‌ పరిధిలోకి తీసుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇదే జరిగితే మండలాలు, జోన్ల పరిధిలోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. 

Read more