బైపాస్‌కు లైన్‌క్లియర్‌

ABN , First Publish Date - 2022-11-03T00:31:57+05:30 IST

విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా మారిన గొల్లపూడి భూ సేకరణ సమస్యకు లైన్‌క్లియర్‌ అయ్యింది. ప్యాకేజీ-3 (చిన అవుటపల్లి-గొల్లపూడి), ప్యాకేజీ-4 (గొల్లపూడి-కృష్ణానది బ్రిడ్జి-కాజా ఆరు వరుసల రోడ్డు) అనుసంధానమయ్యే ప్రాంతంలో పనులకు తలెత్తిన అవాంతరాన్ని హైకోర్టు తొలగించింది.

బైపాస్‌కు లైన్‌క్లియర్‌

పరిహారంపై తర్వాత నిర్ణయం

(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ బైపాస్‌ రోడ్డు నిర్మాణానికి అవరోధంగా మారిన గొల్లపూడి భూ సేకరణ సమస్యకు లైన్‌క్లియర్‌ అయ్యింది. ప్యాకేజీ-3 (చిన అవుటపల్లి-గొల్లపూడి), ప్యాకేజీ-4 (గొల్లపూడి-కృష్ణానది బ్రిడ్జి-కాజా ఆరు వరుసల రోడ్డు) అనుసంధానమయ్యే ప్రాంతంలో పనులకు తలెత్తిన అవాంతరాన్ని హైకోర్టు తొలగించింది. పనులు చేసుకోవచ్చని ఆదేశాలిచ్చి, పరిహారానికి సంబంధించి తీర్పు తర్వాత వెల్లడిస్తానంది. దీంతో ఏడాదిన్నరగా జాతీయ రహదారుల సంస్థకు ఇబ్బందిగా మారిన భూ సేకరణ అంశం కొలిక్కి వచ్చింది.

హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి సమీపం వరకు మెగా సంస్థ చేపట్టిన ఆరు వరసల బైపాస్‌ పనులు పురోగతిలో ఉన్నాయి. రోడ్డు పోర్షన్‌ పనులు 75 శాతం మేర పూర్తయ్యాయి. మూడు ఫ్లై ఓవర్‌ పనులు, చిన్న, పెద్దవి కలిపి 13 వరకు ఆర్‌వోబీలు పురోగతిలో ఉన్నాయి. దాదాపు చిన అవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు 28 కిలోమీటర్ల స్ర్టెంచ్‌లో నిరంతరాయంగా పనులు జరుగుతున్నాయి. గొల్లపూడి సమీపంలో రెండు కిలోమీటర్ల వరకే పనులు జరగలేదు. మొత్తం 30 మంది రైతులు పరిహారం విషయంలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆర్బిట్రేషన్‌లో కూడా సమస్య తేలలేదు. కొందరు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో రైతులతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించుకోవాల్సిందిగా కోర్టు సూచించింది. ఎన్‌హెచ్‌ అధికారులు, రెవెన్యూ సహకారంతో రైతులతో చర్చలు జరిపారు. దాదాపు 10 మందికి పైగా రైతులు అంగీకరించారు. మిగిలిన వారి నుంచి అభ్యంతరాలు కొనసాగాయి. భూములు తమకు జీవనాధారం కావటం, తమ పరిస్థితులను బట్టి ఎన్‌హెచ్‌ ఇస్తామన్న పరిహారానికి ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. ఈ క్రమంలో మళ్లీ ఈ అంశం కోర్టుకు వెళ్లింది. ఎన్‌హెచ్‌ యాక్టుకు భిన్నంగా బాధితులు, అధికారుల వాదనలు విన్న హైకోర్టు వివాదంగా మారిన రెండు కిలోమీటర్ల నిడివిలో పనులు చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. పరిహారం విషయంలో ఇచ్చే తుది తీర్పును బట్టి ఎన్‌హెచ్‌ అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎన్‌హెచ్‌ అధికారులు నిర్దేశించిన పరిహారాన్ని ప్రత్యేక ఖాతాలో వేసి ఉంచాలని పేర్కొంది.

Updated Date - 2022-11-03T00:31:57+05:30 IST
Read more