విజయ దరహాసం

ABN , First Publish Date - 2022-09-10T06:11:17+05:30 IST

గత రెండేళ్లలో సంక్షోభ సమయంలో వేసవిలో అవసరమైన ముడి పదార్థాలైన పాలపొడి, వెన్నరేట్లు గత 50 ఏళ్లలో లేనంత గరిష్ట ధరకు చేరుకున్నాయి.

విజయ దరహాసం

 3 ఏళ్లలో 41 శాతం టర్నోవర్‌ వృద్ధి 

 2021-22లోరూ.1012 కోట్ల టర్నోవర్‌

పాడిరైతుకు లబ్ధి చేకూర్చేలా దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధర

 4 నెలలకోసారి ధర వ్యత్యాసం రూపంలో అదనపు లబ్ధి

ఒకరికొకరి సహకారం.. వారందరినీ నడిపే సమర్థ నాయకత్వం.. కలిస్తే ‘విజయ’దరహాసం. ఇదే కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ప్రస్థానం. లక్షా యాభై వేల పాడి రైతు కుటుంబాల్లో వెలుగులు పూయిస్తూ ఐదున్నర దశాబ్దాలుగా ఈ యూనియన్‌ ‘విజయ’ పరంపర కొనసాగుతోంది.  ఉమ్మడి కృష్ణా జిల్లా పాడి రైతుల సంక్షేమమే లక్ష్యంగా 1965లో మూడంచెల విధానంతో వ్యవస్థీకృత పాడిపరిశ్రమగా కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఆవిర్భవించింది. నాటి నుంచి పాడి రైతు కుటుంబాల సర్వతోముఖాభివృద్ధికి అంకుఠిత కార్యాచరణ ప్రణాళికతో అడుగులు వేస్తూ ముందుకు సాగుతోంది. 

-విజయవాడ , ఆంధ్రజ్యోతి

రైతు మెచ్చిన.. జనం నచ్చిన ‘విజయ’ 

నాణ్యతలో ఏ మాత్రం రాజీ లేకుండా పాలు, పాల పదార్థాలను అందిస్తూ ఎప్పటికప్పుడు అధునాతన విధానాలను మెరుగుపర్చుకుంటూ కృష్ణా మిల్క్‌ యూనియన్‌ రాష్ట్రంలోని పాడి సహకార సంస్థలన్నింటిలోనూ అగ్రగామిగా కొనసాగుతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా పాల సేకరణ ధరను పాడి రైతులకు ఇవ్వడమే కాక ప్రతి నాలుగు నెలలకు ఓసారి ధర వ్యత్యాసం కింద అదనంగా సుమారు రూ.7లు వరకు ప్రతి లీటరుకు చెల్లించారు. కరోనా రెండో దశ విజృంభించిన తరుణంలోనూ పాలసేకరణ ధరను మరోసారి పెంచి లీటరుకు రూ.4 రైతుకి లబ్ధి చేకూర్చింది. ప్రస్తుతం పాడి రైతులకు అత్యధిక పాలసేకరణ ధరను ఇవ్వడమే కాకుండా ప్రతి 4 నెలలకు ఓసారి ధర వ్యత్యాసాన్ని చెల్లిస్తున్నది ఒక్క కృష్ణా మిల్క్‌ యూనియన్‌ మాత్రమే. గత రెండేళ్ల కాలంలో సుమారు రూ.100 కోట్లను ధర వ్యత్యాసం రూపంలో రైతులకు చెల్లించారు. 

యూనియన్‌ దశ మార్చిన చలసాని

గత రెండేళ్లలో సంక్షోభ సమయంలో వేసవిలో అవసరమైన ముడి పదార్థాలైన పాలపొడి, వెన్నరేట్లు గత 50 ఏళ్లలో లేనంత గరిష్ట ధరకు చేరుకున్నాయి. కృష్ణా మిల్క్‌ యూనియన్‌ ఈ విపత్తును సునాయాసంగా అధిగమించింది. దీనికి యూనియన్‌ చైర్మన్‌ చలసాని ఆంజనేయులు ముందుచూపే కారణం. ఆయన ‘పల్లెకు పోదాం.. పాడిని చూద్దాం’ అనే కార్యక్రమాన్ని రూపొందించారు. మేలు జాతి పశువులను దిగుమతి చేసుకుని రైతులకు అందించడంతోపాటు పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా దేశంలో సరాసరి పాల సేకరణ 14 శాతం తక్కువగా ఉన్నప్పటికీ కృష్ణా జిల్లాలో 12 శాతం పాల సేకరణ వృద్ధి రేటును సాధించడం కృష్ణా మిల్క్‌ యూనియన్‌ సమర్థ నాయకత్వానికి నిదర్శనం. యూనియన్‌ టర్నోవర్‌ రూ.500 కోట్లు దాటేందుకు ఐదు దశాబ్దాలు పట్టింది. ఆ తర్వాత కేవలం ఆరేళ్లలోనే వెయ్యి కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది. ముఖ్యంగా గత మూడేళ్ల కాలంలో యూనియన్‌ 41 శాతం టర్నోవర్‌ వృద్ధిని నమోదు చేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1200 కోట్ల టర్నోవర్‌ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తోంది. 

ఫ్యాక్టరీకి వచ్చిన పాలను 54 రకాల నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తారు. అన్ని విధాలుగా నాణ్యతను నిర్ధారించిన తర్వాతే పాలు, పాల ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. ప్రస్తుతం కృష్ణా జిల్లా వీరవల్లిలో 4 లక్షల లీటర్ల సామర్థ్యంతో నూతన డెయిరీ శరవేగంగా రూపొందుతోంది. 2023 అక్టోబరు నాటికి నూతన డెయిరీని ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.  

పాడి రైతు సంక్షేమానికి పెద్దపీట

 . క్షీరబంధు, కల్యాణమస్తు పథకాల ద్వారా ప్రతి పాడి రైతూకు ప్రయోజనం కల్పిస్తున్నారు. ప్రతిభ పథకం ద్వారా ప్రతిభ కలిగిన పాడి రైతు కుటుబంలోని యువతకు ఉన్నత విద్యను అభ్యసించేందుకు నగదు ప్రోత్సాహం అందిస్తోంది. మిల్క్‌ యూనియన్‌ సభ్యులకు దురదృష్టవశాత్తు ప్రాణహాని సంభవిస్తే లక్ష రూపాయలు పాడి రైతు కుటుంబానికి అందజేస్తున్నారు. పశువులకు అత్యవసర వైద్యం అందించేందుకు 8 సంచార పశువైద్య వాహనాలు, 20 మంది పశువైద్యులు, 20 మంది సహాయక సిబ్బంది ద్వారా అన్ని గ్రామాలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. 

అందరి సమష్టి కృషి ఫలితమే 

కృష్ణా మిల్క్‌ యూనియన్‌ నేడు ఈ స్థితిలో ఉందంటే దానికి ప్రధాన కారణం పాడి రైతులే. వారితోపాటు పాలకవర్గంలో ఉన్న సీనియర్‌ సభ్యులు, అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషి. అందరి కృషి ఫలితంగా నేడు రూ.1012 కోట్ల టర్నోవర్‌ సాధించగలిగాం. ప్రభుత్వ రంగంలో లేనిది ఇక్కడ ఉన్నది సహకార స్ఫూర్తి. దాని ఫలితమే 70 శాతం సంఘాలు కూడా లాభాలబాటలో పయనిస్తూ సంఘంలోని సభ్యులకు బోనస్‌ ఇవ్వగలుగుతున్నాయి. 

- చలసాని ఆంజనేయులు, 

ఛైర్మన్‌, కృష్ణా మిల్క్‌ యూనియన్‌


Read more