నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదు: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2022-04-24T20:27:50+05:30 IST

మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని...

నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదు: వర్ల రామయ్య

Vijayawada: మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదన్నారు. మహిళా కమిషన్‌కు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారని... అంతేకానీ ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, ఆమే విచారణ జరిపి, ఆమే శిక్ష వేయటం న్యాయసమ్మతం కాదన్నారు.


ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారని వర్ల రామయ్య ఆరోపించారు. బాధితులను పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని విమర్శించారు. ఆమె పరామర్శకు రాలేదని, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారని అన్నారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను చేయెత్తి కొట్టబోయిన కమిషన్ ఛైర్ పర్సన్‌దే తప్పని, ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారన్నారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఆమె ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోందని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, సీఐని సస్పెండ్ చేయడంకాదని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు. 

Read more