ప్రొటోకాల్‌ పాటించకపోతే షోకాజ్‌

ABN , First Publish Date - 2022-09-26T05:46:35+05:30 IST

ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధికారులను హెచ్చరించారు.

ప్రొటోకాల్‌ పాటించకపోతే షోకాజ్‌

అధికారులకు జడ్పీ చైరపర్సన్‌  ఉప్పాల హారిక హెచ్చరిక

 వివిధ సమస్యలపై గళం   విప్పిన జడ్పీటీసీ సభ్యులు

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 25 : ప్రొటోకాల్‌ నిబంధనలు పాటించకపోతే షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అధికారులను హెచ్చరించారు. ఆదివారం జిల్లా పరిషత్‌ సమావేశపు హాలులో వివిధ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. జడ్పీటీసీ సభ్యులందరూ సమావేశపు హాలులో ఉండటంతో దాదాపు సాధారణ సమావేశంలాగా కార్యక్రమాలు కొనసాగాయి. ఆగస్టు 15న జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాఠశాలల్లో జెండా ఎగుర వేసేందుకు జడ్పీటీసీలకు అవకాశం కల్పించలేదని పలువురు జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవ శిలాఫలకాల్లో తమ పేర్లు కూడా ఉండటం లేదని పలువురు జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలను సందర్శించేందుకు ఎంఈవోల అనుమతి తీసుకోవాలనడం అన్యాయమని వీరులపాడు జడ్పీటీసీ అమళ్లపూడి కీర్తి సౌజన్య, కృత్తివెన్ను జడ్పీటీసీ మైలా రత్నకుమారి, గూడూరు జడ్పీటీసీ సురేష్‌ ధ్వజమెత్తారు. సచివాలయాలు సందర్శించేందుకు కూడా ఎండీవోల అనుమతి తీసుకోవాలంటున్నారని ఇంకొందరు జడ్పీటీసీలు అనడంతో జడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక తీవ్రంగా స్పందించారు. తాను కూడా గుడ్లవల్లేరు జడ్పీటీసీనేనని, తనకు కూడా ప్రొటోకాల్‌ పాటించని సందర్భం ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ పాటించకపోతే అధికారులకు షోకాజ్‌ నోటీసు ఇస్తామని ఆమె హెచ్చరించారు. స్వాతంత్య్ర దినోత్సవం నాడు జాతీయ పతాకలు ఎగుర వేసేందుకు జడ్పీటీసీలను ఎందుకు పిలవలేదని డీఈవో తాహెరా సుల్తానాను హారిక ప్రశ్నించారు. పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లతో జెండాలు ఎగురవేయించమని ప్రభుత్వం సూచించిందని, ఆ సూచనలనే కింది స్థాయికి పంపామని డీఈవో చెప్పారు.  ఎక్కడైనా ఏదైనా సందర్భంలో జడ్పీటీసీలకు ప్రాధాన్యత ఇవ్వకపోతే ఎంఈవోలకు, ప్రధానోపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తామని డీఈవో పేర్కొనడంతో వాడీవేడిగా సాగుతున్న చర్చ ముగిసింది. మూడేళ్లపాటు ప్రజాప్రతినిధి లేకుండా కార్యక్రమాలు జరిగాయని, ఏడాదిగా ప్రజాప్రతినిధులతో కార్యక్రమాలు జరుగుతున్నందున పాత అలవాట్లను అధికారులు మానుకోవాలని చైర్‌పర్సన్‌ హెచ్చరించారు.

 తాగునీటి సమస్యలపై గళం విప్పిన జడ్పీటీసీలు 

తాగునీటి సమస్యపై పలువురు జడ్పీటీసీలు గళం విప్పారు. టీడీపీ హయాంలో ఉన్నట్టు తాగునీటి  వనరులు ఇప్పుడు కల్పించడం లేదనే విమర్శలు వస్తున్నాయని ముసునూరు జడ్పీటీసీ ఊటుకూరి ప్రసాద్‌, మైలవరం జడ్పీటీసీ తిరుపతిరావు చెప్పారు. తాగునీటి వనరులు సరిగా లేవని, దీనివల్ల గ్రామాల్లో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఏ.కొండూరు జడ్పీటీసీ భూక్యా గన్యా ఆవేదన వ్యక్తం చేశారు. తమ మండలంలో కలుషితమైన నీరు తాగడం వల్ల కొందరు మృతిచెందారన్నారు. ఈ సమస్యను తక్షణం పరిష్కరించాలని జడ్పీ చైర్‌పర్సన్‌ అధికారులకు సూచించారు. ముసునూరు మండలంలో మండల పరిషత్‌ పాఠశాల స్థలం అన్యాక్రాంతమైందని చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు నిలదీశారు. ఇప్పటికే రెండుసార్లు చెప్పామన్నారు. అంగన్‌వాడీ పాఠశాల భవనం ఇంకా అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించలేదన్నారు. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు.   


Updated Date - 2022-09-26T05:46:35+05:30 IST