నిర్లక్ష్యానికి ని‘దర్శనం’

ABN , First Publish Date - 2022-09-30T05:30:00+05:30 IST

నిర్లక్ష్యానికి ని‘దర్శనం’

నిర్లక్ష్యానికి ని‘దర్శనం’
ఆలయానికి కుడివైపు నుంచి అనధికార దర్శనాలు

ఇంద్రకీలాద్రిపై గాడి తప్పిన వీఐపీ దర్శనాలు

మళ్లీ పాత పరిస్థితులే పునరావృతం

చిన్న రాజగోపురం మీదుగా యథేచ్ఛగా రాకపోకలు 

పోలీసులతో భక్తుల వాగ్వాదం

రంగంలోకి దిగిన మంత్రి కొట్టు సత్యనారాయణ 

డ్యూటీలో లేని సిబ్బందిని సస్పెండ్‌ చేయాలని ఆదేశాలు 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ/వన్‌టౌన్‌) : ఇంద్రకీలాద్రిపై దర్శనాల విషయంలో మళ్లీ పాత పరిస్థితులే పునరావృతమయ్యాయి. డిజిగ్నేటెడ్‌ వీఐపీల దర్శనాలు గాడి తప్పాయి. శుక్రవారం కావడంతో భక్తులు ఇంద్రకీలాద్రికి అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో డిజిగ్నేటెడ్‌ వీఐపీ దర్శనాలకు, సాధారణ వీఐపీ దర్శనాలకు తేడా లేకుండాపోయింది. దేవదాయ శాఖ సిబ్బంది, జ్యుడిషియల్‌ సిబ్బంది, పోలీసులు, మీడియా ప్రతినిధులకు సంబంధించిన బంధువులు పెద్ద ఎత్తున దర్శనానికి వచ్చారు. ఈ దర్శనాలు వీఐపీ మార్గం మీదుగా కాకుండా డిజిగ్నేటెడ్‌ వీఐపీల మార్గంలో సాగడంతో పరిస్థితి అదుపు తప్పింది. దీంతో వీఐపీ మార్గంలోని భక్తులు, రూ.300 దర్శనం మార్గంలోని భక్తులు ఎదురు తిరిగారు. మీడియా పాయింట్‌ ఎంట్రీ గేట్‌ వద్ద పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపు భక్తులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. 

అంతరాలయం వెనుక నుంచి అడ్డగోలు గా..

నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలను కూడా నేరుగా చిన్న రాజగోపురం నుంచి ఆలయంలోకి పంపించేస్తున్నారు. దీంతో ఆలయ పశ్చిమభాగం నుంచి వెళ్లే డిజిగ్నేటెడ్‌ వీవీఐపీల మార్గంపై తీవ్ర ఒత్తిడి పడింది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ దర్శనాలు ఇలాగే జరిగాయి.

ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య

టోల్‌గేట్‌ నుంచి వాహనాలకు ఇష్టారాజ్యంగా అనుమతులు ఇవ్వటంతో ఘాట్‌రోడ్డుపై రద్దీ పెరిగింది. పోలీసులు, దేవస్థాన ఉద్యోగులు, మీడియా, డ్యూటీ ఉద్యోగుల వాహనాలు బారులు తీరాయి. ఓం టర్నింగ్‌ నుంచి సమాచార కేంద్రం వరకు ద్విచక్ర వాహనాలు నిలిచిపోయాయి. రాజగోపుర మార్గం నుంచి ప్రొటోకాల్‌ కాకుండా వివిధ శాఖల డిపార్ట్‌మెంట్‌, వ్యక్తిగత వాహనాలను అనుమతించటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

మంత్రి సీరియస్‌.. అయినా మామూలే..

గొడవ జరుగుతున్న సమయంలో దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అక్కడికి వచ్చారు. ఎంట్రీ పాయింట్‌ వద్ద పెద్ద ఎత్తున నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలు ఉండటాన్ని చూసి మండిపడ్డారు. అక్కడ దేవస్థాన సిబ్బంది విధుల్లో లేకపోవడంతో సీరియస్‌ అయ్యారు. డ్యూటీలో లేని వారిని సస్పెండ్‌ చేయాలని ఆదేశించారు. పోలీసుల తీరుపైనా మండిపడ్డారు. ఏసీపీ ఎక్కడున్నారని ప్రశ్నించగా, డ్యూటీ పోలీసులు సమాధానం చెప్పలేదు. మంత్రి పరిస్థితిని చక్కదిద్దుతున్న దశలో కూడా కొంతమంది పోలీసులు తమ వారిని లోపలికి తీసుకెళ్లడంతో ఆయన మరోసారి మండిపడ్డారు. ఎవరు మీరని ప్రశ్నించారు. తాను సీఐ అని సమాధానమిచ్చారు. ఆగ్రహించిన మంత్రి కొట్టు సత్యనారాయణ వెంటనే సీపీ కాంతిరాణాకు ఫోన్‌ చేశారు. పోలీసులు సరిగ్గా డ్యూటీ చేయటం లేదని, ఏసీపీ లేరని, నాన్‌ డిజిగ్నేటెడ్‌ వీఐపీలను కూడా నేరుగా పంపించేస్తున్నారని చెప్పారు. తక్షణం పరిస్థితులను సరిదిద్దాలని కోరారు. పోలీసుల తీరుపై భక్తులు కోప్పడుతున్నారని చెప్పారు. ఆ తర్వాత కొద్దిసేపు మంత్రి అక్కడే కూర్చుని పరిస్థితిని పర్యవేక్షించారు. అప్పటి వరకు పరిస్థితి బాగానే ఉన్నా మంత్రి వెళ్లాక షరామామూలుగానే మారింది. 


Read more