కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు.. రైతులకు ఇక్కట్లు..!

ABN , First Publish Date - 2022-08-21T06:23:07+05:30 IST

నాశిరకం ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు అనేక ఇక్కట్లు పడుతున్నారు.

కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు.. రైతులకు ఇక్కట్లు..!

15 రోజులైనా పట్టించుకోని విద్యుత్‌ అధికారులు 

అల్లాడుతున్న పశువులు, గగ్గోలు పెడుతున్న రైతులు

అధికారుల తీరుపై వైసీపీ నేతల అసంతృప్తి

గన్నవరం, ఆగస్టు 20 : నాశిరకం ట్రాన్స్‌ఫార్మర్లతో రైతులు అనేక ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోయి 15రోజులైనా పట్టించుకున్న నాథుడు లేడని సాక్ష్యాత్తు వైసీపీ నేతలే గగ్గోలు పెడుతున్నారు. నున్న విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలో గన్నవరం మండలంలో సావరగూడెం, ముస్తాబాద, సూరంపల్లి, రామచంద్రాపురం, మాదలవారిగూడెం, చనుపల్లివారిగూడెం గ్రామాలున్నాయి. మండలంలోని సూరంపల్లిలో ట్రాన్స్‌ఫార్మర్లు 15రోజుల క్రితం కాలిపోయాయి. దీంతో రైతులు పలుమార్లు విద్యుత్‌ అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్లు కడప నుంచి రావాలని, సంబంధిత ఏజెన్సీకి చెప్పానని, తన పరిధిలో నాలుగు ట్రాన్స్‌ఫార్మర్‌లు కాలిపోగా ఏర్పాటు చేయాల్సి ఉందని రైతులకు చెప్పారు. దీంతో రైతులు పంట పొలాల్లో సాగుతో పాటు గేదెలను పెంచుకుంటున్నారు. కొంతమంది అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో ట్రాన్స్‌ఫార్మర్లు పని చేయక, మోటార్లు ఆగిపోయి నీళ్లు లేక 15రోజులుగా అల్లాడిపోతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవని, దీంతో ట్యాంకర్లతో నీరు కొనుగోలు చేసి గేదెలకు పెట్టుకోవాల్సిన దుస్థి తి ఏర్పడిందన్నారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ బాలాజీ నాయక్‌కు పలువురు రైతులు ఫోన్‌ చేసి సమస్యను చెబుతుంటే నా నెంబర్‌ ఎవరిచ్చారంటూ ఎదురు ప్రశ్నలు వేస్తున్నారని వాపోతున్నారు. విద్యుత్‌ శాఖలో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావటం లేదని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు ఏజెన్సీతో మాట్లాడి వెంటనే ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

అధికారులు పట్టించుకోవటం లేదు

పామర్తి మాధవరావు, వ్యవసాయ సలహా మండలి మండల డైరెక్టర్‌ 

ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయి 15రోజులవుతున్నా విద్యుత్‌ అధికారులు పట్టించుకోవటం లేదు. నీళ్ల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోయిన ప్రాంతాల్లో గేదెలు, పలు కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వాళ్లకు తాగేందుకు నీరు లేదు. అధికారులు ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ కాలం గడిపేస్తున్నారు. డీఈఈకి ఫోన్‌ చేసి సమస్య చెబుతుంటే మీకు నా నెంబర్‌ ఎవరిచ్చారంటూ ఎదురు దాడి చేస్తున్నారు. వరి పంట పొట్ట మీద ఉంటే రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం బాధాకరం.

Updated Date - 2022-08-21T06:23:07+05:30 IST