ప్రయాణం.. నరకప్రాయం

ABN , First Publish Date - 2022-10-11T06:13:38+05:30 IST

కొమ్మిరెడ్డిపల్లి ప్రధాన రహదారి పూర్తి గోతులమయంగా మారి రాకపోకలకు ప్రజలు ఇబ్బందులు

ప్రయాణం.. నరకప్రాయం
కొమ్మిరెడ్డిపల్లి ప్రధాన రహదారి దుస్థితి..

కొమ్మిరెడ్డిపల్లి(తిరువూరు), అక్టోబరు 10: కొమ్మిరెడ్డిపల్లి ప్రధాన  రహదారి పూర్తి గోతులమయంగా మారి రాకపోకలకు ప్రజలు  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు  రోడ్డుపై ఉన్న గోతుల్లో నీరు చేరటంతో అవి తెలియక వాహనచోదకులు ప్రమాదాల బారిన పడుతున్నారు. 


పాలకుల నిర్లక్ష్యంతో నిధులు వెనక్కి..

శ్రీరాంపురం-పేరువంచ ప్రధాన రహదారిలోని ముష్టికుంట్ల అడ్డరోడ్డు నుంచి వయా కొమ్మిరెడ్డిపల్లి మీదుగా ఎర్రమాడు వరకు సుమారు 6.05 కిలోమీటర్ల జిల్లా పరిషత్‌ రహదారిని ఆర్‌అండ్‌బీలోకి మార్పు చేశారు. అనంతరం ఈ రహదారి అభివృద్ధికి గతంలో రూ.1.62 కోట్లు నిధులు మంజూరు కాగా 2019 జనవరిలో విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌(నాని) శంకుస్థాపన చేశారు. గోతులతో ఉన్న తారు రోడ్డును పూర్తిగా తొలగించి రోడ్డుపై వెట్‌మిర్చర్‌ పర్చారు. తదుపరి ప్రభుత్వం మారటంతో నిర్మాణ పను లను అర్ధంతరంగా నిలిపివేశారు. దాంతో రోడ్డుపై  పెద్దపెద్ద గోతులు పడి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. 


 గ్రామంలోకి రాని ఆటోలు..

గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి  పూర్తి గోతుల మయంగా మారడంతో ఆటోలు  రావటంలేదు. దీంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లోనూ ఆటోలు నడిపేందుకు డ్రైవర్‌లు నిరాకరిస్తున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ప్రతిసారి ఈ ఏడాది మీ గ్రామం రహదారి అభివృద్ధి పనులు పూర్తిచేస్తామని ప్రజాప్రతినిధులు ప్రకటనలు తప్ప,  సమస్య పరిష్కారం కావటంలేదంటున్నారు. 


 ప్రతిపాదనలు పంపాం.. : గాయత్రిదేవి, ఆర్‌అండ్‌బీ ఏఈ

కొమ్మిరెడ్డిపల్లి రోడ్డు అభివృదిఽ్ధకి గతంలో మంజూరు అయిన నిధులు వెనక్కి పోయాయి. ప్రస్తుతం ప్రత్యేకంగా అభివృద్ధి చేయాల్సిన రహదారుల జాబితాలో కొమ్మిరెడ్డిపల్లి గ్రామం రోడ్డు పనులకు సంబంధించి ప్రతిపాదనలు పంపించాం. 

 

Read more