జయహో.. జగన్మాత

ABN , First Publish Date - 2022-09-28T06:15:01+05:30 IST

దేవీ నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి.

జయహో.. జగన్మాత

రెండో రోజు బాలాత్రిపురసుందరీగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

  పెరిగిన భక్తుల రద్దీ  

 ఉచిత దర్శనానికి గంటన్నర సమయం

దేవీ నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సౌరభాలు వెదజల్లుతున్నాయి. విద్యుద్దీపాలు దివ్యకాంతులను ప్రసరిస్తున్నాయి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. రెండోరోజు మంగళవారం బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మను భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ దుర్గమ్మ సన్నిధిలో భక్తిపారవశ్యంలో మునిగారు. తలనీలాలు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు.  

విజయవాడ, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి) : ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భవానీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఉచిత దర్శనం క్యూలో ఉన్న భక్తులకు దర్శనం పూర్తవ్వడానికి గంట నుంచి గంటన్నర సమయం పడుతోంది. అయితే రూ.300, రూ.100 క్యూల్లో పెద్దగా భక్తులు లేరు. గతానికి భిన్నంగా ఈ ఏడాది తొలిరోజు నుంచి భక్తులు అధిక సంఖ్యలో రావడం విశేషం. వీఐపీల కోసం ఏర్పాటు చేసిన రూ.500 క్యూ ఖాళీగా కనిపించింది. వీఐపీ జాబితాలో వస్తున్న వాళ్లంతా క్యూలో కాకుండా నేరుగా ఓం మలుపు నుంచి ముఖద్వారం వద్దకు వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి దర్శనానికి వెళ్తున్నారు. బాలాత్రిపురసుందరి దేవి అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను స్పీకర్‌ తమ్మినేని సీతారాం దంపతులు, రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు, దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దర్శించుకున్నారు. 

 చూసేది లేదు... తోసేదే....

వచ్చిన భక్తులు ఏం చెబుతున్నారో సిబ్బంది వినడం లేదు. భక్తులు దగ్గరకు వస్తుండగా క్యూలోకి వెళ్లండి అని తోసేస్తున్నారు. ఓం మలుపు వద్ద మంగళవారం ఇదే జరిగింది. ఇంద్రకీలాద్రిపై ఓం మలుపు ఒక ప్రవేశద్వారం వంటిది. ఇక్కడ పోలీసులు తనిఖీలు చేసి పాసులు ఉన్న వారిని మాత్రమే ముఖద్వారం వద్దకు పంపుతారు. ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పక్కనే ఉన్న వీఐపీ క్యూ లైన్‌లోకి పంపుతున్నారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి మహామండపంలోని ఆరో అంతస్థులో ఖడ్గమాల, కుంకుమార్చనలు నిర్వహిస్తారు. ఇక్కడే సూర్యోపాసన సేవ చేస్తారు. ఈ టికెట్లు తీసుకున్న భక్తులు ఘాట్‌ రోడ్డు మీదుగా వచ్చి ఓం మలుపు వద్ద ఉన్న సిబ్బందికి చూపించి ముందుకు రావాలి. మంగళవారం కుంకుమార్చన టికెట్లు తీసుకున్న భక్తులను అక్కడున్న సిబ్బంది ముఖద్వారం వద్దకు పంపకుండా రూ.500క్యూలో పంపారు. కొంతదూరం వచ్చిన తర్వాత ఆ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పక్క నుంచి తీసుకొచ్చి కుంకుమార్చనకు పంపారు. మరో ఐదుగురు మహిళలు టికెట్లు ఉన్నప్పటికీ కుంకుమార్చనలో కూర్చోలేకపోయారు. వారు వచ్చే సమయానికి కుంకుమార్చనలు పూర్తవ్వడంతో సెక్యూరిటీ సిబ్బంది గేట్లకు తాళాలు వేశారు. 




Updated Date - 2022-09-28T06:15:01+05:30 IST