దుర్గమ్మకు జేజేలు

ABN , First Publish Date - 2022-10-04T05:27:30+05:30 IST

మరో రెండు రోజుల్లో శరన్నవరాత్రులు ముగుస్తుండటంతో ఇంద్రలాద్రికి భక్తులు భారీగా వస్తున్నారు.

దుర్గమ్మకు జేజేలు

దుర్గాదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు

 దర్శనానికి భారీగా వచ్చిన భక్తులు

దశమి రోజున తెప్పోత్సవం రద్దు 

విజయవాడ/చిట్టినగర్‌, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) : మరో రెండు రోజుల్లో శరన్నవరాత్రులు ముగుస్తుండటంతో ఇంద్రలాద్రికి భక్తులు భారీగా వస్తున్నారు. కోర్కెలు నెరవేరిన భక్తులు అమ్మవారికి కానుకలు సమర్పిస్తున్నారు. కనకదుర్గమ్మ సోమవారం దుర్గాదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దసరా ఘడియలు దగ్గర పడుతుండటంతో ఉత్తరాంధ్ర నుంచి వచ్చే భక్తుల సంఖ్య బాగా పెరిగింది. వినాయకుడి ఆలయం నుంచి మొదలైన క్యూలన్నీ భక్తులతో నిండిపోయాయి. సోమవారం ఇంద్రకీలాద్రిపై భవానీ మాలధారులు అధికంగా కనిపించారు. వినాయకుడి ఆలయం నుంచి కాలినడకన ఇంద్రకీలాద్రి ఎక్కిన భక్తులు దర్శనానికి బ్రేక్‌ వచ్చేసరికి నీరసించిపోతున్నారు. 

తెప్పోత్సవం లేనట్టే..

దసరా రోజున కృష్ణా నదిలో హంస వాహనంపై జరిగే తెప్పోత్సవం ఈ ఏడాది ఉండకపోవచ్చని తెలుస్తోంది. ప్రకాశం బ్యారేజీకి పులిచింతల ప్రాజెక్టు నుంచి సుమారుగా లక్ష క్యూసెక్కుల నీరు వస్తోంది. ఈ పరిస్థితుల్లో తెప్పోత్సవం నిర్వహించడం కష్టమని అధికారులు తేల్చారు. ఈ రెండు రోజుల్లో ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంద్రకీలాద్రి నుంచి దుర్గామల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులను హంసవాహనంపై ఊరేగిస్తారు. దుర్గాఘాట్‌ వద్ద జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి భక్తులను అనుమతిస్తారు. నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున కేవలం ఉత్సవమూర్తులను హంస వాహనంపైకి తీసుకెళ్లి కాసేపు అక్కడే తిప్పి తీసుకొస్తారని తెలిసింది. పరిమిత సంఖ్యలో అధికారులు, వేదపండితులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. 
Read more