దుర్గమ్మ చెంత వివాద ‘గుండం’

ABN , First Publish Date - 2022-10-04T05:33:40+05:30 IST

హోమగుండం... దుర్గగుడి అధికారులు, భవానీ మాలధారుల మధ్య వేడి పుట్టిస్తోంది.

దుర్గమ్మ చెంత వివాద ‘గుండం’

 హోమగుండంపై కోర్టును ఆశ్రయించిన భవానీ మాలధారులు

  కష్టమని చెప్పిన దేవదాయ శాఖ అధికారులు

భవానీ దీక్షలకే హోమగుండం ఉంటుందంటున్న ఆలయ వర్గాలు

 2016 నుంచి కొనసాగిందంటున్న భవానీలు

 వచ్చే ఏడాది ఏర్పాటు చేస్తామని అఫిడవిట్‌ ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశం

 ఈ ఏడాదికి సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని సూచన

విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి) :

హోమగుండం... దుర్గగుడి అధికారులు, భవానీ మాలధారుల మధ్య వేడి పుట్టిస్తోంది. శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రికి వచ్చే భవానీ మాలధారులు దీక్ష విమరణకు హోమగుండం ఏర్పాటు చేయాలని భవానీలు డిమాండ్‌ చేస్తున్నారు. ఆ సంప్రదాయం దసరాలో లేదని దుర్గగుడి అధికారులు చెబుతున్నారు. 2016 నుంచి కనకదుర్గా నగర్‌లో తమకు హోమగుండం ఏర్పాటు చేశారని భవానీలు అంటున్నారు. ఆలయ అధికార వర్గాలు చెబుతున్న వాదన ఒకలా ఉంటే, భవానీ మాలధారుల వాదనలు మరోలా ఉంటున్నాయి. మొత్తంగా హోమగుండం చుట్టూ వివాదాలు ప్రదక్షిణ చేస్తున్నాయి. చివరికి ఈ అంశంపై భవానీలు హైకోర్టును ఆశ్రయించారు.

  ఆలయ వర్గాలు వాదన ఇదీ

భవానీ దీక్షల స్వీకరణకు బీజం 1980లో పడింది. ఆలయంలో అప్పటి అర్చకులు లింగంభొట్ల రామశర్మ, యలమందరావుతోపాటు కొంతమంది నాటి కంచిపీఠాధిపతి వద్దకు వెళ్లారు. అయ్యప్ప దీక్షల మాదిరిగానే దుర్గమ్మకు దీక్షలు చేసే అవకాశం ఉందా అని అడిగారు. భవానీ, దుర్గ అంతా అమ్మవారి స్వరూపాలే కాబట్టి భవానీ దీక్షలు అని నామకరణం చేసి ప్రారంభించమని సలహా ఇచ్చారు. ఈ దీక్షను మండలం (40) రోజులు చేయాలని చెప్పారు. దీక్షలను కార్తీకమాసంలో పౌర్ణమి రోజున స్వీకరించి మార్గశిర మాసంలో బహుళ దశమి నాడు విరమించాలని ఉపదేశించారు. అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు దుస్తులను ధరించాలని ఆయన సూచించారు. పాండవులు యుద్ధానికి వెళ్లడానికి అమ్మవారిని ఎరుపు దుస్తులు ధరించి పూజించారని భారతంలో ఉంది. ఇలా దీక్ష చేయడం వల్ల మనస్సు, శరీరం నియంత్రణలో ఉంటాయి. 1981లో అప్పటి ప్రధానార్చకుడు సత్యనారాయణమూర్తితో కలిసి తొమ్మిది మంది దీక్షలు స్వీకరించారు. తర్వాత కాలక్రమంలో ఈ దీక్షలు తీసుకునే వారి సంఖ్య లక్షల్లోకి వెళ్లింది. మొదట్లో దీక్షల విరమణ ఒక్కరోజులో పూర్తి చేసేవారు. మాలధారులు ఎక్కువ సంఖ్యలో రావడంతో తొక్కిలాసటి జరిగింది. కార్తీకమాసంలో భవానీ దీక్షలు తీసుకునే వారు గడచిన పదేళ్ల నుంచి శరన్నవరాత్రుల్లో దీక్షలు తీసుకుంటున్నారు. 

  భవానీలు ఏమంటున్నారంటే...

అయ్యప్పస్వామి దీక్షల మాదిరిగానే 1979లో భవానీ దీక్షలు ప్రారంభమయ్యాయి. కార్తీక పౌర్ణమి రోజున మాలలు ధరించి మండల దీక్ష తీసుకునేవారు. 40 రోజుల దీక్ష పూర్తయిన తర్వాత భవానీలు ఇరుముడులను ఇంద్రీలాద్రిపై సమర్పించేవారు. ఈ ప్రక్రియను నిర్వహించడానికి ప్రత్యేకంగా గురుభవానీలు ఉండేవారు. ఇంద్రకీలాద్రిపై ప్రస్తుతం విఘ్నేశ్వరుడి ఆలయం ఉన్న ప్రదేశంలో మాలల విరమణ, హోమగుండం ఉండేవి. 2007లో భవానీ దీక్షల సమయంలో ఇరుముడులు హోమగుండం వద్ద సమర్పించే క్రమంలో తొక్కిసలాట జరిగి ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 2008లో భవానీ దీక్ష విరమణకు దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దేవస్థాన అర్చకుల ద్వారానే దీక్ష విరమింపజేయడం మొదలుపెట్టింది. ఘాట్‌రోడ్డు మీదుగా ఇంద్రకీలాద్రిపైకి వెళ్లిన భవానీలు హోమగుండం వద్ద ఇరుముడులను సమర్పించిన తర్వాత మెట్ల మార్గం ద్వారా కిందికి వచ్చేవారు. 2014లో భవానీలు మరో ఆందోళన చేశారు. దీక్షలోని అర్చకులతో విరమణ చేయించవద్దని, గురుభవానీల ద్వారానే దీక్ష విరమణ చేయించాలని ఆందోళన చేశారు. దీనిపై 2015లో దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇంద్రకీలాద్రిపై తగిన ప్రదేశం లేనందున కనకదుర్గానగర్‌లో దీక్ష విరమణకు ఏర్పాట్లు చేశారు. అక్కడే హోమగుండం ఏర్పాటు చేయించారు. కార్తీక మాసంలోనే కాకుండా శరన్నవరాత్రుల్లోనూ భవానీ మాలలు ధరించి భక్తులు వస్తుండటంతో దసరాలోనూ హోమగుండం ఏర్పాటు చేయాలని భవానీలు ఆలయ అధికారులను కోరారు. 2016లో అప్పటి ఈవో సూర్యకుమారి దసరాలో హోమగుండాన్ని ఏర్పాటు చేయించారు. ఇది 2019 వరకు కొనసాగింది. 2020లో కొవిడ్‌ కారణంగా హోమగుండం ఏర్పాటు చేయలేదు. దాని ప్రకారమే ఇప్పుడు హోమగుండాన్ని ఏర్పాటు చేయాలని భవానీలు డిమాండ్‌ చేశారు. దసరాలో 40, 20, 11 రోజుల దీక్షను తీసుకునేవారు పెరిగారు. శరన్నవరాత్రులు అమ్మవారికి ప్రీతికరం కావడంతో దసరాకు ముందు నుంచి దీక్షలు స్వీకరించే భక్తులు పెరిగారు. శరన్నవరాత్రుల్లో దీక్ష తీసుకునే వారు 6-7లక్షల మంది ఉంటారని గురుభవానీలు చెబుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతోపాటు ఒడిసా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి భవానీ మాలధారులు దసరాలోనే దీక్ష విరమణను అమ్మవారి సన్నిధిలో చేస్తారంటున్నారు. కార్తీకమాసంలో కంటే శరన్నవరాత్రులో 11 రోజుల దీక్ష తీసుకునే వారిలో మహిళలు ఎక్కువగా ఉంటున్నారు. శరన్నవతురాత్రుల్లో దీక్షలు తీసుకునే వారు పెరగడానికి, కార్తీకమాసం దీక్షలు తీసుకునే వారు తగ్గడానికి వెనుక ఒక కారణం ఉంది. కార్తీకమాసంలో ఎక్కువగా అయ్యప్ప దీక్షలు చేస్తారు కాబట్టి ఆ మాసంలో భవానీ దీక్షలు తీసుకునే వారు శరన్నవరాత్రులకు మారారని చెబుతున్నారు. 

  మేం నిర్మించుకోలేం

హోమగుండం ఏర్పాటు చేయాలన్న పిటిషన్‌పై సోమవారం వాదనలు జరిగాయి. భవానీలు కోరినట్టుగా హోమగుండం ఏర్పాటు చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. ఈ రెండు రోజుల్లో ఇది సాధ్యం కాదని దేవదాయ శాఖ తరపున న్యాయవాది వాదించారు. వచ్చే ఏడాది దసరాకు ఏర్పాటు చేయాలని, దీనికి సంబంధించి అఫిడవిట్‌ ఇవ్వాలని ఆదేశించారు. ప్రస్తుతం దసరాకు హోమగుండాన్ని సొంతంగా ఏర్పాటు చేసుకోవాలని గురుభవానీలకు స్పష్టం చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము ఏర్పాటు చేసుకోలేమని, ఎక్కడో ఒకచోట దీక్ష విరమణ ప్రక్రియను నిర్వహించుకుంటామని గురుభవానీలు చెబుతున్నారు.  


Updated Date - 2022-10-04T05:33:40+05:30 IST