తొలగని ప్రతిష్టంభన

ABN , First Publish Date - 2022-12-30T01:04:35+05:30 IST

జిల్లాలో టీచర్ల బదిలీల అంశంపై ఇంకా గందరగోళం తొలగలేదు. ఇప్పట్లో తొలగే సూచనలు కనిపించడం లేదు. పాయింట్ల చిక్కులు తొలగిపోలేదు. ప్రభుత్వ తీరులో మార్పు లేదు. ఏకపక్ష ధోరణిని వీడలేదు. కోర్టు తీర్పు వెలువడ లేదు. మొత్తంగా టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రతిష్టంభన వీడలేదు.

 తొలగని  ప్రతిష్టంభన

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో టీచర్ల బదిలీల అంశంపై ఇంకా గందరగోళం తొలగలేదు. ఇప్పట్లో తొలగే సూచనలు కనిపించడం లేదు. పాయింట్ల చిక్కులు తొలగిపోలేదు. ప్రభుత్వ తీరులో మార్పు లేదు. ఏకపక్ష ధోరణిని వీడలేదు. కోర్టు తీర్పు వెలువడ లేదు. మొత్తంగా టీచర్ల బదిలీ ప్రక్రియలో ప్రతిష్టంభన వీడలేదు. నూతన విద్యా విధానం అమలులో భాగంగా ఉన్నత పాఠశాలల్లో విలీనమైన పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు అధిక పాయింట్లు, విలీనం కాని పాఠశాలల్లో పనిచేసే టీచర్లకు తక్కువ పాయింట్లు కేటాయించారు. ఇటీవల ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేశారు. ఎయిడెడ్‌ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిన టీచర్లకు ప్రస్తుతం జరుగుతున్న బదిలీల్లో జీరో పాయింట్లు కేటాయించారు. గత 25 నుంచి 30 సంవత్సరాలుగా పనిచేసిన తమకు జీరో పాయింట్లు కేటాయించి బదిలీలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. పదవీ విరమణ చేసే దశలో ఉన్న తమకు పాయింట్లు కేటాయించకుంటే బదిలీల్లో వెనుకబడిపోతామనే ఆందోళనలో ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఇటీవల కాలం వరకు పని చేసిన టీచర్లు ఉన్నారు. గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకే ప్రాంతంలో పనిచేస్తున్న టీచర్లు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. వీరికి సక్రమంగా పాయింట్లు కేటాయించలేదు. దీంతో బదిలీల్లో తమకు జరుగుతున్న అన్యాయంపై ఎయిడెడ్‌ టీచర్లు, విలీనంకాని పాఠశాలల్లో పనిచేస్తూ పాయింట్లు సక్రమంగా పొందనివారు అన్ని జిల్లాల నుంచి వెయ్యిమందికిపైగా కోర్టును ఆశ్రయించినట్టు ఉపాధ్యాయ సంఘాల నాయకులు చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో టీచర్లు కోర్టును ఆశ్రయించిన దాఖలాలు మున్నెన్నడూ లేవని టీచర్లు అంటున్నారు. ఈనెల 10వ తేదీన బదిలీల ఉత్తర్వులు జారీ చేసి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నా ముందస్తుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం టీచర్ల బదిలీల ప్రక్రియ జరగనిస్థితి నెలకొంది.

నిలిచిన వెబ్‌ ఆప్షన్లు

జిల్లాలో 3,360 మందికిపైగా టీచర్లు బదిలీ కావాల్సి ఉందని విద్యాశాఖ అధికారులు ఇటీవల తేల్చారు. వీరంతా బదిలీల కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీచర్ల సీనియారిటీ జాబితాను బట్టి అభ్యంతరాలు స్వీకరించారు. ఈ అభ్యంతరాలను పరిశీలించి తుది సీనియారిటీ జాబితాను ప్రకటిస్తే అందుకు అనుగుణంగా బదిలీ కోరుకునే టీచర్లు వెబ్‌అప్షన్లు పెట్టుకోవాల్సి ఉంది. సీనియారిటీ తుది జాబితాను ప్రకటించే లోగానే కొందరు టీచర్లు బదిలీల అంశంపై కోర్టును ఆశ్రయించారు. సీనియారిటీ తుది జాబితాను ప్రకటిస్తేనే వెబ్‌అప్షన్లు పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం బదిలీ కోరుకునే టీచర్లు వెబ్‌అప్షన్లు పెట్టుకునే ప్రక్రియను నిలిపివేశారు. టీచర్ల బదిలీలకు సంబంధించి 60 శాతం పని పూర్తయిన నేపథ్యంలో బదిలీల ప్రక్రియను కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘా లనాయకులు కోరుతున్నారు. ఈ ప్రక్రియను వేసవి సెలవుల వరకు కొనసాగించి, టీచర్లను గందరగోళానికి గురిచేసినా ఆశ్చర్యం పోనక్కరలేదని టీచర్లు బాహటంగానే చెప్పుకుంటున్నారు.

4న కోర్టు తీర్పు?

టీచర్ల బదిలీలకు సంబంధించిన లోటుపాట్లపై పలువురు టీచర్లు హైకోర్టును ఆశ్రయించడంతో వీటన్నింటినీ పరిశీలించి జనవరి 4వ తేదీన తీర్పు ఇస్తామని హైకోర్టు ప్రకటన జారీ చేసిందని టీచర్లు చెబుతున్నారు. దీంతోపాటు ఈ ఏడాది కిలో మీటరు దూరంలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం, వచ్చే ఏడాది ఉన్నత పాఠశాలలకు మూడు కిలోమీటర్ల దూరంలోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలను విలీనం అంశం కోర్టు పరిశీలనలో ఉందని టీచర్లు చెబుతున్నారు. టీచర్ల బదిలీల్లో ఉన్న లోటుపాట్లు, పాఠశాలల విలీనం అంశాలకు సంబంధించి కోర్టు తీర్పు వెలువడిన తరువాతనే టీచర్ల అంశంపై తగు నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖమంత్రి బోత్ససత్యనారాయణ, విద్యాశాఖ సర్వీసెస్‌ విభాగం జేడీ చెబుతున్నారని ఉపాధ్యాయసంఘం నాయకులు అంటున్నారు.

Updated Date - 2022-12-30T01:04:35+05:30 IST

Read more