టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు

ABN , First Publish Date - 2022-06-07T06:38:06+05:30 IST

టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు

టీడీపీ నేతల హౌస్‌ అరెస్టులు

- మాచర్ల పర్యటనకు పోలీసుల అనుమతి నిరాకరణ

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 6 : మాచర్లలో హత్యకు గురైన కంచర్ల జాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్రను పోలీసులు హౌస్‌అరెస్టు చేశారు. మాచర్ల వెళ్లకుండా సోమవారం ఉదయం రవీంద్ర ఇంటి వద్ద డీఎస్పీ మాసూం బాషా నేతృత్వంలో సీఐలు, ఎస్‌ఐలు పోలీసు బలగాలతో మోహరించారు. టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున రవీంద్ర ఇంటికి తరలిరావడంతో ఒక దశలో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. వైసీసీ నేతల హత్యారాజకీయాల వల్లే బీసీ నాయకుడు కంచర్ల జాలయ్య మృతి చెందాడని రవీంద్ర ఆరోపించారు. జాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు నేతలను వెళ్లనివ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. 

- టీడీపీ నేతలపై కక్షసాధింపు చర్యలు 

మీడియాతో కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. జగన్‌రెడ్డి మూడేళ్ల పాలనలో 37 మందిని వైసీసీ నేతలు పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ నాయకులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. బీసీలను హతమారుస్తుంటే బీసీ మంత్రులు పెదవి విప్పడంలేదన్నారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత బీసీల మనుగడ ప్రశ్నార్థకమైందన్నారు. హత్యలకు భయపడి బీసీలు వెనుతిరిగి వెళ్లే ప్రశక్తి లేదన్నారు. బీసీల హక్కుల పరిరక్షణకు తమ ప్రాణాలైనా అర్పిస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్‌ మాజీ చైర్మన్‌ మోటమర్రి బాబాప్రసాద్‌, టీడీపీ నేతలు మరకాని పరబ్రహ్మం, ఎండీ ఇలియాస్‌ బాషా, పిప్పళ్ల కాంతారావు, లంకిశెట్టి నీరజ, పాలపర్తి పద్మ, కట్టా దుర్గ, వసంతకుమారి, లంకే హరికృష్ణ, చిన్నం శివ, పివిఫణికుమార్‌, కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్‌, దేవరపల్లి అనిత తదితరులు పాల్గొన్నారు. 


బీసీలపై హత్యా రాజకీయాలు మానుకోవాలి

- కొనకళ్ల నారాయణ

మచిలీపట్నం టౌన్‌, జూన్‌ 6 : బీసీలపై జగన్‌రెడ్డి హత్యా రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎంపీ, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణ అన్నారు. మాచర్లలో కంచర్ల జాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు వెళుతున్న కొనకళ్లను సోమవారం పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ల నారాయణ మీడియాతో మాట్లాడారు. బీసీలు మొదటి నుంచి తెలుగుదేశంవైపే ఉన్నారని, బీసీలను హతమారుస్తూ పార్టీ అభివృద్ధికి ఆటంకం కలిగించాలనే వైసీపీ నాయకుల ఆలోచనలకు స్వస్తి చెప్పాలన్నారు. బడుగు బలహీన వర్గాల వారు వైసీపీ పాలనలో విసిగిపోయారన్నారు. చేతకాని ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిని పదవి నుంచి దింపేందుకు అన్ని వర్గాల వారు సిద్ధంగా ఉన్నారన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు గౌతు లచ్చన్న మనుమరాలు గౌతు శిరీషను ప్రభుత్వం సీఐడీ అధికారులను పంపి వేధిస్తున్నారన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్‌రెడ్డి చిత్తు చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. పామర్రు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వర్ల కుమార్‌ రాజా మాట్లాడుతూ, వైసీపీ పాలనలో బడుగు బలహీన వర్గాలు వేధింపులకు గురవుతున్నాయన్నారు. నియోజకవర్గంలో వైసీపీ నేతల ఆగడాలను అరికట్టాలన్నారు. 


వన్‌టౌన్‌లో బుద్దా వెంకన్న హౌస్‌ అరెస్టు

వన్‌టౌన్‌, జూన్‌ 6 : పల్నాడులోని జంగమహేశ్వరపాడులో ఈనెల 3వ తేదీన హత్యకు గురైన టీడీపీ నేత రావులాపురానికి చెందిన కంచర్లజాలయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ నేతలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో బుద్దా వెంకన్న కొందరు అనుచరులతో సోమవారం జాలయ్య కుటుంబసభ్యులను పరామర్శించేందుకు రావులాపురానికి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయనను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. వన్‌టౌన్‌లోని ఆయన ఇంటివద్ద సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులను కాపలా ఉంచారు.

Updated Date - 2022-06-07T06:38:06+05:30 IST