ధాన్యం సేకరణను పర్యవేక్షించండి

ABN , First Publish Date - 2022-11-30T01:09:10+05:30 IST

ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా మండలస్థాయిలో తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జేసీ అపరాజితాసింగ్‌తో కలసి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం సేకరణ, భూముల రీ సర్వే అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ధాన్యం సేకరణను పర్యవేక్షించండి
కలెక్టర్‌ రంజిత్‌బాషా వీడియో కాన్ఫరెన్స్‌

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం: ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు లేకుండా మండలస్థాయిలో తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ రంజిత్‌బాషా సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌ నుంచి జేసీ అపరాజితాసింగ్‌తో కలసి తహసీల్దార్లు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం సేకరణ, భూముల రీ సర్వే అంశాలపై ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ధాన్యం కొనుగోలులో నిబంధనలను రైతులకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. గోనె సంచులు, ధాన్యం రవాణాకు సంబంధించి వాహనాలు సిద్ధంగా ఉంచాలన్నారు. గుడివాడ, మచిలీపట్నం, ఉయ్యూరు డివిజన్‌లకు సంబంధించి ధాన్యం రవాణా కోసం వాహనాలను సమకూర్చేందుకు కాంట్రాక్టర్లను నియమించడం జరిగిందని తెలిపారు. కాంట్రాక్టర్లు సకాలంలో వాహనాలు సమకూర్చకుంటే రైతుల వద్ద ఉన్న వాహనాల ద్వారా ధాన్యం మిల్లులకు రవాణాకు చేసేందుకు అనుమతులు ఇవ్వాలన్నారు. వాహనాల రిజిస్ట్రేషన్‌కు పౌరసరఫరాలశాఖ కార్యాలయంలో ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు.

డిసెంబరులో మరింత అప్రమత్తం

జిల్లాలో వరికోతలు డిసెంబరు నుంచి వేగవంతమవుతాయని కలెక్టర్‌ అన్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 32.68లక్షల గోనెసంచులు అందుబాటులో ఉన్నాయన్నారు. 316 ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా 139 మిల్లులకు 17,860 టన్నుల ధాన్యం ఇప్పటివరకు ఇచ్చినట్టు తెలిపారు. తహసీల్దార్లు తరచూ రైస్‌మిల్లులను పరిశీలన చేయాలన్నారు. ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పామర్రు మండలంలో ధాన్యం రవాణాలో ఇబ్బందులు తలెత్తాయని, అలాంటి పరిస్థితులుజిల్లాలో పునరావృతం కాకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

రీ సర్వే పూర్తయితే పాస్‌బుక్‌లివ్వండి..

జిల్లాలో భూముల రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో రైతులకు పాస్‌బుక్‌లు ఇవ్వాలని కలెక్టర్‌ తహాసీల్దార్లకు సూచించారు. పట్టాదారు పాస్‌పుస్తకాల్లో ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాలన్నారు. ఆర్వోఆర్‌లో తుది నివేదికను పూర్తిస్థాయిలో పరిశీలన చేసి సంతకాలు చేయాలన్నారు. ప్రస్తుతం 83గ్రామాల్లో రీ సర్వే జరుగుతోందని, డిసెంబరు నెలాఖరునాటికి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. సమావేశంలో కేడీసీసీబీ చైర్మన్‌ తన్నీరు నాగేశ్వరరావు, డీఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజరు శ్రీధర్‌, డీఎ్‌సవో పార్వతి, డీపీవో నాగేశ్వరనాయక్‌. సర్వే ఏడీ గోపాలరాజు తదితరులు పాల్గొన్నారు.

నాడు నేడు పెండింగ్‌ పనులపై దృష్టి..

మచిలీపట్నం టౌన్‌: జిల్లాలో నాడు-నేడు పెండింగ్‌ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు కృష్ణాజిల్లా కలెక్టర్‌ రంజిత్‌ బాషా ఆదేశించారు. మంగళవారం డీఈవో తాహెరా సుల్తానా, సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్‌ ఎ.శేఖర్‌, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంఈవోలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో క్షేత్ర స్థాయిలో నాడు-నేడు రెండవ దశ పనులపై సమీక్షించారు. పాఠశాల ప్రాంగణం మెరక పనులపై తహసీల్దార్లు, ఎంపీడీవోలతో చర్చించాలన్నారు. ఎంఈవోలు బుధవారం తమ సమస్యలుచెప్పాలని కలెక్టర్‌ ఆదేశించారు.

Updated Date - 2022-11-30T01:09:12+05:30 IST