-
-
Home » Andhra Pradesh » Krishna » Shailajanath fire on cm jagan-MRGS-AndhraPradesh
-
Shailajanath: సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక విన్నపం..
ABN , First Publish Date - 2022-09-12T18:46:13+05:30 IST
ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక విన్నపం చేశారు.

విజయవాడ (Vijayawada): ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ (Shailajanath).. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి ఒక విన్నపం చేశారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వం తల తిక్క వ్యవహారాలను మానుకోవాలని సూచించారు. రాజధాని విషయంలో ప్రభుత్వం చేత కాని విధానాలను విడనాడాలన్నారు. ఈ భూమ్మీద రాజధాని లేని ఏకైక రాష్ట్రం ఎపీ మాత్రమే అన్నారు. తగ్గేదేలే అని మంత్రులు బీరాలు పోతున్నారని, ఇదంతా ఎవరి కోసం ఎందుకు చేస్తున్నారో చెప్పాలన్నారు. రాష్ట్ర రాజధాని అనేది అందరికీ అందుబాటులో ఉండాలనేదే కాంగ్రెస్ విధానమన్నారు. చంద్రబాబు రాజధానిగా అమరావతిని ప్రకటిస్తే జగన్ మద్దతు ఇచ్చారు. ఈలోపు చంద్రబాబుతో ఏం గొడవ వచ్చిందో జగన్ చెప్పాలన్నారు. రాయలసీమ వాసులుగా మాకు అప్పుడు ఇబ్బంది అనిపించినా.. రాష్ట్ర ప్రజల మేలు కోరి అమరావతికి అండగా నిలిచామన్నారు.
జగన్ సిఎంగా ఎప్పుడైనా ప్రజల్లో, రోడ్ల మీద తిరిగితే వాస్తవం తెలిసేదని శైలజానాథ్ అన్నారు. శ్రీభాగ్ ఒప్పందంపై ముఖ్యమంత్రికి కనీస అవగాహన లేదని విమర్శించారు. అమరావతి ఏకైక రాజధానిగా ప్రకటిస్తే జగన్కు మంచిదన్నారు. జగన్ తమ ఆలోచనా విధానాలను, మొండి పట్టుదల వీడాలన్నారు. జగన్ వైఫల్యాలను విమర్శిస్తే దాడులు చేస్తారా?.. పోలీసులను అడ్డం పెట్టుకుని అరెస్టులు చేయిస్తారా? అని ప్రశ్నించారు. ఆరోజు అమరావతికి జై కొట్టిన జగన్.. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. న్యాయ రాజధాని, శాసన రాజధాని, పాలన రాజధాని అనేది ప్రజల మధ్య విద్వేషాల కోసమేనని, జగన్కు రాష్ట్ర అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని శైలజానాథ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.