ఆర్‌డబ్ల్యూఎస్‌లో కామలీలలు

ABN , First Publish Date - 2022-08-01T06:25:21+05:30 IST

ఆర్‌డబ్ల్యూఎస్‌లో కామలీలలు

ఆర్‌డబ్ల్యూఎస్‌లో కామలీలలు

వేధింపుల కృష్ణులతో మహిళా ఉద్యోగినులు బెంబేలు

ఏఈలు, డీఈఈలపై లైంగిక వేధింపులు 

జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లను వదలని రాక్షసులు

ఏఈపై కన్నేసిన ఓ పెద్ద అధికారి

చాంబరుకు పిలిచి మరీ విచిత్ర ప్రవర్తన

మంత్రి జోక్యం చేసుకున్నా మారని తీరు


గ్రామీణ నీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్‌) విభాగంలో కీచకపర్వం పతాక స్థాయికి చేరింది. కామపిచ్చితో కొట్టుకులాడుతున్న కొందరు అధికారులు తమ కింద పనిచేసే మహిళా ఏఈ, డీఈలపై లైంగిక వేధింపులకు తెగబడుతున్నారు. జూనియర్‌, సీనియర్‌ అసిస్టెంట్లు, ఆఖరుకు అటెండర్లను కూడా వదలట్లేదు. ఫిర్యాదులు చేసినా తీరు మారకపోవటంతో ఆర్‌డబ్ల్యూఎస్‌లో పనిచేయటానికి ఉద్యోగినులు భయపడుతున్నారు. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్‌)లో కృష్ణలీలలు తారస్థాయికి చేరుతున్నాయి. రెండు జిల్లాల్లోనూ మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. కృష్ణాజిల్లాలో ఓ అధికారి కామలీలలు అన్నీ, ఇన్నీ కాకుండా ఉన్నాయి.  తనకంటే వయసులో ఎంతో చిన్నదైన ఓ ఏఈ ఉద్యోగినిపై కన్నేశాడు. అధికారి తీరు సరిగ్గా లేదని గ్రహించిన ఆ ఏఈ దూరంగా ఉండే ప్రయత్నం చేశారు. దీంతో ఆమెను నేరుగా తన చాంబరులోకి పిలిపించుకుని అసభ్యకరంగా మాట్లాడటం, లైంగిక వాంఛలను వ్యక్తం చేయటం చేశాడు.  రానురానూ అతని వికృత చేష్టలను భరించలేని సదరు అధికారిణి మంత్రి జోగి రమేశ్‌కు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కామ అధికారి ఆఫీసుకు రావడం మానేశాడు. ఆ తరువాత మళ్లీ వారానికే వేధింపులు మొదలుపెట్టాడు.  ఏకంగా మహిళా ఏఈని తన చాంబరుకు పిలిచి సెలవు పెట్టాలని, కలిసి ఎంజాయ్‌ చేద్దామని ఒత్తిడి తెచ్చాడు. అసభ్యంగా ప్రవర్తించాడు. సరిగ్గా అదే సమయానికి మంత్రి నుంచి ఏఈకి ఫోన్‌ వచ్చింది. మంత్రి జోగి రమేశ్‌ జడ్పీ సీఈవో కార్యాలయంలోకి వెళ్లి మహిళా ఏఈ, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారిని పిలిపించి మాట్లాడారు. అధికారి వికృత చేష్టలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది జరిగిన తర్వాత అధికారి పగతో రగిలిపోయాడు. ఆమెను వదిలేది లేద ని తెలిసిన వారి వద్ద వ్యాఖ్యానించాడు. దీంతో బెదిరిపోయిన మహిళా అధికారి బలవంతంగా సెలవులోకి వెళ్లిపోయారు. వాస్తవానికి ఈ అధికారిణి పొరుగు జిల్లా నుంచి ఇటీవల బదిలీపై కృష్ణాజిల్లాకు వచ్చారు. పొరుగు జిల్లాలో పనిచేసిన సందర్భంలో అక్కడి అధికారి కూడా లైంగిక వేధింపులకు పాల్పడటంతో సదరు అధికారిణి కృష్ణాజిల్లాకు ఆప్షన్‌ ఇచ్చారు. ఇక్కడికి వచ్చినా లైంగిన వేధింపులు తగ్గలేదు. మచిలీపట్నం సర్కిల్‌ ఆఫీసులో పనిచేసే ముగ్గురు కూడా అధికారి వేధింపులు తాళలేక పొరుగు జిల్లాలకు వెళ్లిపోయారు. 

అందరూ కృష్ణులే..

- ఈఈ కంటే దిగువ స్థాయిలో పనిచేసే మరో అధికారి కూడా ఓ మండల పరిధిలో పనిచేసిన మహిళా ఉద్యోగిని వేధించాడు. కామవాంఛను తీర్చమంటూ  వేధింపులకు పాల్పడ్డాడు. అసోసియేషన్‌ నేతలు రంగంలోకి దిగి ఆ అధికారిపై వేటు వేశారు.

- ఇక ఎన్టీఆర్‌ జిల్లాలో మరో ‘కృష్ణుడు’ ఉన్నాడు. విజయవాడలో చాలాకాలం తిష్టవేసుకుని కూర్చున్న ఈ అధికారి మహిళా ఉద్యోగులను వేధింపులకు గురిచేయటంలో నిష్ణాతుడు. కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగినిని లొంగదీసుకోవటానికి  ప్రయత్నిం చాడు. దీనిపై ఈఎన్‌సీకి ఫిర్యాదులు వెళ్లాయి. 

Read more