విలీనమై..

ABN , First Publish Date - 2022-05-24T06:12:12+05:30 IST

విలీనమై..

విలీనమై..

జిల్లాలో పాఠశాలల విలీనానికి అధికారుల కసరత్తు

3, 4, 5 తరగతులు ఇక ఉన్నత పాఠశాలలకు..

జిల్లాలో 647 స్కూళ్ల గుర్తింపు

శరవేగంగా మ్యాపింగ్‌

సరిపడా తరగతి గదులపై లేని ప్లానింగ్‌

జూలై 4 నుంచి పాఠశాలల పునఃప్రారంభం

నూతన విద్యావిధానానికి వ్యతిరేకంగా  ప్రభుత్వ నిర్ణయాలు


పల్లెలైనా, పట్టణాలైనా బడి, గుడి ఉండటం సాధారణం. ఇక ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలైతే ఎప్పటినుంచో గ్రామాలకు పట్టుగొమ్మలుగా అలరారుతున్నాయి. పిల్లల సందడి, ఉపాఽధ్యాయుల మర్యాదపూర్వక పలకరింపులు కొత్తకళను తెస్తున్నాయి. కానీ, నేటి ప్రభుత్వాల తీరుతో గ్రామీణ బడులు కనుమరుగు అవుతున్నాయి. ‘ఇది మా ఊరి బడి.. ఇంతమంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు..’ అని చెప్పుకొనే పరిస్థితి లేకుండాపోతోంది. ప్రాథమిక పాఠశాలలను కిలోమీటర్‌ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో చేర్చాలన్న ప్రక్రియ జిల్లాలో వేగం పుంజుకోవడమే ఇందుకు కారణం.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : నూతన విద్యావిధానం పేరుతో జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసే ప్రక్రియ దాదాపు ఖరారైంది. ఈ విధానం ద్వారా అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులను విద్యకు దూరం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జిల్లాలో 163 ప్రాథమిక పాఠశాలలను 250 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. ఈ ఏడాది జూలై 4 నుంచి 647 ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటర్‌ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. విద్యావ్యవస్థలోని మేధావులు, అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు, ఉపాధ్యాయ సంఘాల నాయకుల నుంచి అభిప్రాయాలు తీసుకోకుండానే ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 

విలీన విధానమే తప్పా..

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానానికి, రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విధానానికి మధ్య అంతరం  అధికంగానే ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతన విద్యావిధానం ప్రకారం అంగన్‌వాడీ మూడేళ్లు, 1, 2 తరగతులను కలిపి పూర్వ ప్రాథమిక, ప్రాథమిక పాఠశాలలుగా నిర్ణయించారు. 3, 4, 5 తరగతులకు ఒక పాఠశాల, 6, 7, 8 తరగతులకు ఒక పాఠశాల, 9, 10, 11, 12 తరగతులకు ఒక పాఠశాలగా 5+3+3+4 విధానంలో మార్చి విద్యాబోధన చేయాలని నిర్ణయించారు. ఈ విధానానికి తూట్లు పొడుస్తూ  రాష్ట్ర ప్రభుత్వం అంగన్‌వాడీ మూడేళ్లు, 1, 2 తరగతులను ప్రాథమిక పాఠశాలలుగా, 3 నుంచి 10వ తరగతి వరకూ ఒక పాఠశాలగా పేర్కొంటున్నారు. ఇంటర్మీడియెట్‌కు సంబంధించి మండలానికి రెండు చొప్పున జూనియర్‌ కళాశాలలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఎప్పటికి అమలు చేస్తారో తెలియదు. 

తరగతి గదుల మాటేంటి?

ప్రాథమిక పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను కిలోమీటర్‌ దూరంలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు జిల్లాలో 647 పాఠశాలలను గుర్తించారు. కాగితాలపై హడావుడిగా మ్యాపింగ్‌ చేశారు. ఐదురోజుల క్రితం డీఈవో, ఎంఈవోలతో సమావేశం ఏర్పాటుచే సి విలీనమయ్యే ఉన్నత పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు ఉన్నాయో, లేవో క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశాలు కూడా ఇచ్చేశారు. గతంలో 250 మీటర్ల పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయగా, గదులు సరిపడా లేని కారణంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వారి పాత పాఠశాలల్లోనే త రగతులు నడుపుతున్నారు. జూన్‌ 26వ తేదీ నుంచి టీచర్లు పాఠ శాలలకు వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. జూలై 4 నుంచి పిల్లలు పాఠశాలలకు వస్తారని పేర్కొన్నారు. ప్రస్తుతం 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేస్తే ఈ తరగతులు చదివే విద్యార్థులను ఎక్కడ కూర్చోబెట్టి పాఠాలు బోధిస్తారనేది ప్రశ్నార్థకమే. అలా అని జూలై 4లోపు ఉన్నత పాఠశాలల్లో అదనపు తరగతి గదులు నిర్మించడం కూడా అసాధ్యమే.

సెక్షన్లవారీగా పిల్లల సంఖ్య

ఆయా తరగతుల్లో ఎంతమంది విద్యార్థులకు ఒక సెక్షన్‌ ఏర్పాటుచేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు ఇలా ఉన్నాయి. 3 నుంచి 5 తరగతుల వరకు 45 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్‌, 45 నుంచి 75 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 75 నుంచి 104 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 105 నుంచి 134 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 135 నుంచి 164 వరకు విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 165 నుంచి 194 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 6 నుంచి 8వ తరగతి వరకు 52 మంది విద్యార్థుల్లోపు ఉంటే ఒక సెక్షన్‌, 53 నుంచి 87 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 88 నుంచి 122 మంది విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 123 నుంచి 157 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 158 నుంచి 192 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 183 నుంచి 227 మంది విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 9 నుంచి 10 తరగతులకు సంబంధించి 60 మందిలోపు విద్యార్థులుంటే ఒక సెక్షన్‌, 61 నుంచి 99 మంది విద్యార్థులుంటే రెండు సెక్షన్లు, 100 నుంచి 139 మంది వరకు విద్యార్థులుంటే మూడు సెక్షన్లు, 140 నుంచి 179 మంది విద్యార్థులుంటే నాలుగు సెక్షన్లు, 180 నుంచి 219 మంది విద్యార్థులుంటే ఐదు సెక్షన్లు, 180 నుంచి 259 వరకు విద్యార్థులుంటే ఆరు సెక్షన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 3 నుంచి 5 తరగతుల వరకు 375 మంది నుంచి 404 వరకు పిల్లలున్నా, 6 నుంచి 8 తరగతులకు 438 నుంచి 472 మంది పిల్లలున్నా, 9, 10 తరగతులకు 500 నుంచి 539 మంది పిల్లలున్నా 13 సెక్షన్లు ఏర్పాటు చేసుకోవచ్చని ఉత్తర్వులు జారీ చేశారు. 



Updated Date - 2022-05-24T06:12:12+05:30 IST