ఇసుక దోపిడీ

ABN , First Publish Date - 2022-09-29T06:34:47+05:30 IST

ఇసుక దోపిడీ

ఇసుక దోపిడీ

నందిగామ పరిధిలో ఇసుక అక్రమ తవ్వకాలు

అధికారుల అనుమతితోనే రవాణా

డంపింగ్‌ యార్డుల వద్ద విక్రయాలు

అంతా ఓ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే..

హైదరాబాద్‌కు యథేచ్ఛగా తరలింపు


కంచికచర్ల : నందిగామ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అధికారుల నిఘా పెద్దగా లేకపోవటంతో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమార్కులు మునేటిని కొల్లగొడుతున్నారు. ట్రాక్టర్లతో ఇసుకను ఒడ్డుకు తరలించి, రాత్రుళ్లు లారీల ద్వారా తెలంగాణాకు తరలిస్తున్నారు. 

అధికారుల నిర్లక్ష్యంతో..

ఓవైపు కృష్ణానది, మరోవైపు మునేరు, వైరాయేరు, కట్లేరు, పాలేరు ఉండటంతో నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఇసుక పుష్కలంగా ఉంది. వరద కారణంగా కృష్ణానదిపై రీచ్‌లు మూతబడ్డాయి. సుమారు రెండు నెలల నుంచి నదిలో ఇసుక తవ్వకాలకు వీలు పడట్లేదు. దీనికితోడు ఇసుక రీచ్‌లు, డంపింగ్‌ యార్డుల నిర్వహణ బాధ్యతల విషయంలో కొంత గందరగోళం నెలకొనటంతో ఇటీవల కొద్దిరోజులు యార్డుల వద్ద కూడా ఇసుక అమ్మకాలు నిలిచిపోయాయి. స్థానిక అవసరాలకు కూడా ఇసుక దొరకని పరిస్థితి ఏర్పడింది. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లు తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాల కోసం, జగనన్న కాలనీల పేరుతో నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధుల సిఫార్సుల కోసం మండల స్థాయి అధికారులు అనధికారికంగా ఎక్కడికక్కడ ఇసుక తవ్వకాలకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు. కాలనీల లబ్ధిదారులకు, ప్రభుత్వ కట్టడాలకు వెళ్లేది గోరంత, అక్రమంగా పోయేది కొండంత అన్నట్టుగా ఈ వ్యవహారం తయారైంది. ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. 

డంపింగ్‌ యార్డుల వద్ద విక్రయాలు

డంపింగ్‌ యార్డుల వద్ద ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. నందిగామ నియోజకవర్గానికి సంబంధించి కీసరలో, జగ్గయ్యపేటకు సంబంధించి అనుమంచిపల్లిలో డంపింగ్‌ యార్డులు ఉన్నాయి. కీసర యార్డు వద్ద టన్ను రూ.680, అనుమంచిపల్లి యార్డు వద్ద టన్ను రూ.755కు విక్రయిస్తున్నారు. ఈ యార్డుల నిర్వహణ బాధ్యతలు వైసీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. యార్డుల వద్ద సదరు ఎమ్మెల్యే అనుచరులు ఇసుక అమ్ముతుండటం ఈ విషయానికి బలం చేకూరుస్తోంది. 

జాతీయ రహదారి మీదుగానే హైదరాబాదుకు? 

హైదరాబాదుకు అక్రమంగా ఇసుకను తరలించే లారీలు ఇంతకుముందు డొంక రూట్ల ద్వారా వెళ్లేవి. ప్రస్తుతం జాతీయ రహదారి మీదుగానే హైదరాబాద్‌ వెళ్తున్నాయని తెలుస్తోంది. ఇంతకుముందు సూర్యాపేట సమీపంలో తెలంగాణా పోలీసులు మన రాష్ట్రం నుంచి వెళ్తున్న ఇసుక లారీలను అధిక సంఖ్యలో పట్టుకున్నారు. తెలంగాణాలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు అక్కడి ప్రజాప్రతినిధులకు, పోలీసులకు కప్పం కడుతుండటంతో ప్రస్తుతం యథేచ్ఛగా వదిలేస్తున్నారు. 

మునేరుపై కన్ను

వైసీపీ నాయకుల కనుసన్నల్లో ఎక్కడికక్కడ మునేటిని కొల్లగొడుతున్నారు. ముఖ్యంగా కంచికచర్ల మండలం కీసరతో పాటు రెండు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల నుంచి ఇసుకను లారీల ద్వారా హైదరాబాద్‌ తరలిస్తున్నారు. మునేటి నుంచి ట్రాక్టర్లతో ఇసుకను తెచ్చి రహస్య ప్రదేశంలో డంప్‌ చేస్తున్నారు. అక్కడి నుంచి లారీలతో హైదరాబాద్‌ పంపిస్తున్నారు. వత్సవాయి, జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు మండలాల్లోని పలు గ్రామాల నుంచి తెలంగాణాలోని సమీప గ్రామాలకు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. 

Read more