ఇసుక తోడేళ్లు

ABN , First Publish Date - 2022-10-14T06:05:52+05:30 IST

ఇసుక తోడేళ్లు

ఇసుక తోడేళ్లు
భవానీపురం వద్ద ఇసుక డంప్‌ కోసం బారులు తీరిన లారీలు

పూడిక పేరుతో కృష్ణానదిలో కోట్లలో దోపిడీ

ప్రాంతాలవారీగా పంచేసుకున్న వైసీపీ ప్రజాప్రతినిధులు

అనామక కంపెనీకి అన్ని రకాల అనుమతులు

భవానీపురం, గొల్లపూడి, ఇబ్రహీంపట్నంలో భారీగా డంప్‌

అంతా మైలవరం వైసీపీ నేత కనుసన్నల్లోనే..

నగరానికి చెందిన మాజీ మంత్రి, ఎమ్మెల్యేకూ వాటా


ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణానదిలో ఇసుక పూడికతీత పనుల్లో వైసీపీ నాయకులు కాసులు పిండుకుంటున్నారు. ఏడాది కూడా నిండని ఓ అనామక సంస్థకు వందల కోట్ల లబ్ధి చేకూర్చేలా జలవనరుల శాఖ అధికారులు చకాచకా ఫైళ్లను కదిలించారు. రూ. వందల కోట్ల ఈ దోపిడీలో మైలవరానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి ప్రధాన పాత్ర పోషించారు. మిగిలిన ప్రజాప్రతినిధులకూ ఇసుకను పప్పు బెల్లాల మాదిరి పంచేశారు.


(విజయవాడ-ఆంధ్రజ్యోతి) : ప్రకాశం బ్యారేజీ ఎగువన జలవనరుల శాఖ డ్రెడ్జింగ్‌ చేస్తున్న ప్రాంతంలోనే పూడికతీతకు ఓ అనామక ప్రైవేట్‌ సంస్థకు అనుమతులు ఇచ్చారు. సదరు సంస్థ.. టన్ను ఇసుక వెలికితీతకు రూ.70 ఖర్చు చేసి రూ.475కు అమ్ముకోమని అధికారికంగా ఆమోదముద్ర వేశారు.

ఇదేం విడ్డూరం

కృష్ణా-గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ 2021, నవంబరు 16న గుంటూరు కేంద్రంగా రిజిస్టర్‌ అయింది. నాటి నుంచి ఈ సంస్థ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదు. కేవలం కృష్ణానదిలో పూడికతీత ఇసుకను దోపిడీ చేసేందుకే ఈ సంస్థను ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇబ్రహీంపట్నం నుంచి నది ఎగువ భాగంలో పూడికతీతకు అనుమతించాలంటూ ఆ సంస్థ ఇటీవల జలవనరుల శాఖ కేసీ డివిజన్‌కు దరఖాస్తు చేసింది. ఇబ్రహీంపట్నం-వైకుంఠపురం, గుంటుపల్లి-లింగాయపాలెం, ఇబ్రహీంపట్నం-లింగాయపాలెం మధ్య ఒక్కోటి చొప్పున మూడు రేవుల్లో ఇసుక వెలికతీతకు అభ్యర్థించింది. ఓపక్క ఈ ప్రాంతాల్లో జలవనరుల శాఖ డ్రెడ్జింగ్‌ చేస్తుండగా, కృష్ణా-గోదావరి వాటర్‌ వేస్‌ సంస్థ డ్రెడ్జింగ్‌కు అనుమతి కోరడం విశేషం. తాము ఆ ప్రాంతంలో జల రవాణాలో కార్గో వ్యాపారం చేస్తున్నామని, పంటులకు నదీ గర్భంలోని ఇసుక తిన్నెలు అడ్డొస్తున్నాయని, ఇసుక తోడివేతకు అనుమతించాలని సదరు సంస్థ కోరింది. వాస్తవానికి గత రెండు మూడేళ్లుగా కృష్ణానదిలో అలాంటి వ్యాపారమేమీ జరగలేదు. అలాంటిది గత ఏడాది నవంబరులో ఏర్పడిన సంస్థ కార్గో వ్యాపారం చేస్తున్నామని పేర్కొనడం అనుమానించాల్సిన విషయమే. కానీ, సదరు సంస్థ అభ్యర్థించడంతో జలవనరుల శాఖ, గనుల శాఖ ఆగమేఘాలపై ఆమోదం తెలిపింది. మొత్తంగా 12.41 లక్షల టన్నుల ఇసుక వెలికితీతకు ఒప్పుకుంది. ఈ ఇసుకను ఏపీఎండీసీ ద్వారా టన్ను రూ.475కు విక్రయించేందుకు జేపీ వెంచర్స్‌తో సదరు సంస్థ ఒప్పందం కుదుర్చుకుంది. అంటే కేవలం రూ.9 కోట్లు ఖర్చు చేసి సుమారు రూ.60 కోట్ల విలువైన ఇసుకను అమ్ముకునేందుకు సదరు సంస్థ అనుమతి సంపాదించింది. వాస్తవానికి ఈ ఇసుక జేపీ సంస్థకు కాకుండా నేరుగా హైదరాబాద్‌ తరలించి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమైంది. బహిరంగ మార్కెట్‌లో టన్ను ఇసుక రూ.1,000 పైమాటే. అంటే సుమారు రూ.125 కోట్ల నుంచి రూ.150 కోట్ల విలువైన ఇసుక దోపిడీకి రంగం సిద్ధమైంది. ఇదంతా అధికారిక లెక్కల ప్రకారం జరిగేదే. అనధికారికంగా అనుమతికి మించి ఇసుకను తవ్వి అమ్ముకునేందుకే సదరు సంస్థ సిద్ధమవుతోంది.

దోపిడీ సూత్రధారులు వారే..

ఈ మొత్తం ఇసుక దోపిడీ సూత్రధారి మైలవరానికి చెందిన వైసీపీ ప్రజాప్రతినిధి. ఆయన బామ్మర్ది స్వయంగా డ్రెడ్జింగ్‌ పనులను పర్యవేక్షిస్తూ ఇసుకను హైదరాబాద్‌కు తరలించేందుకు ఎలాంటి అవాంతరాలు లేకుండా చూసుకుంటున్నారు. ఎవరూ అడ్డు రాకుండా చూసుకునేందుకు నగరానికి చెందిన ఓ మాజీ మంత్రికి, మరో ఎమ్మెల్యేకూ వాటాలు ఇచ్చారు. ఓవైపు ఇసుక కొనేందుకు సామాన్యులు నానా అగచాట్లు పడుతుంటే, మరోవైపు వైసీపీ ప్రజాప్రతినిధులు అడ్డదారిలో ఇసుక దందా నిర్వహిస్తూ రూ.కోట్లు వెనకేసుకుంటున్నారు. 


Read more