సామాన్యుడి జీవితం దుర్భరం

ABN , First Publish Date - 2022-01-03T06:22:13+05:30 IST

సామాన్యుడి జీవితం దుర్భరం

సామాన్యుడి జీవితం దుర్భరం
సమావేశంలో మాట్లాడుతున్న బచ్చుల అర్జునుడు

 టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు

ఉంగుటూరు, జనవరి 2 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో రాష్ట్రంలో సామాన్యుడి జీవితం దుర్భరంగా మారిందని టీడీపీ గన్నవరం నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. గన్నవరం నియోజకవర్గం ఉంగుటూరు మండల పరిధిలోని తేలప్రోలులో పార్టీ మండల అధ్యక్షుడు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షతన ఆదివారం రాత్రి  పార్టీ మండల సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన బచ్చుల ముందుగా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మా ట్లాడుతూ, ఆకాశాన్నంటుతున్న నిత్యావసర సరుకులు, డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో నేడు సామాన్య మానవుడు జీవించలేని పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామంటూ జగన్‌ ప్రభుత్వం ఓటీఎస్‌ రూపంలో ప్రజలనుంచి బలవంతపు వసూళ్లకు తెగబడుతోందని విమర్శించారు. దేశానికి వెన్నెముక అయిన రైతులకు ధాన్యంలో సరైన గిట్టుబాటుధర కల్పించకపోగా, ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు కూడా రైతులు నానా అవస్ధలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆరోపించారు. ప్రతినెలా మండల, గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించి సమస్యలు తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎవ్వరూ అధైర్యపడవద్దని, వెన్నంటే తాను వుంటానని భరోసా ఇచ్చారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా మాట్లాడుతూ జగన్‌ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు పూర్తికావస్తున్నా, అభివృద్ధి మాత్రం శూన్యమన్నారు. రాజధానిని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారని, చెత్తమీదపన్ను వేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. మండల పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరుమళ్ల వెంకటకృష్ణారెడ్డి, ఆళ్ల హనోక్‌, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Read more