సాల్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు సాయంగా..

ABN , First Publish Date - 2022-10-02T06:02:31+05:30 IST

సాల్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు సాయంగా..

సాల్ట్‌ ఫ్యాక్టరీ కార్మికులకు సాయంగా..
పల్లెతుమ్మలపాలెంలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ఉద్యమానికి అండగా టీడీపీ నాయకులు

పల్లెతుమ్మలపాలెంలో భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీపై పట్టు 

భూములు ఎవరికి ఇస్తున్నారో చెప్పాలని పేర్ని నానీకి డిమాండ్‌

ఆ మూడు గ్రామాల్లో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పర్యటన

కార్మికులకు అండగా ఉంటామని భరోసా


బందరు మండలం పల్లెతుమ్మలపాలెంలోని భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీ లీజు రద్దు అంశం వివాదాస్పదమవుతోంది. ఫ్యాక్టరీ లీజును రద్దుచేసి దాదాపు 7వేల ఎకరాల భూమిని మాజీ మంత్రి పేర్ని నాని తన స్నేహితుడి విండ్‌ పవర్‌ ప్రాజెక్టుకు కట్టబెట్టడానికి తెరవెనుక చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులు బాధితులకు అండగా నిలిచి ఉద్యమానికి సన్నద్ధమవుతున్నారు.


ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : మూడువేల కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న సాల్ట్‌ ఫ్యాక్టరీని లీజు ముగిసిందనే కారణం చూపి, మూసి వేయించేందుకు మాజీమంత్రి పేర్ని నాని చేస్తున్న ప్రయత్నాలకు నిరసనగా తీరప్రాంతవాసులు గళం విప్పుతున్నారు. సాల్ట్‌ ఫ్యాక్టరీని కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా సిద్ధమంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ నాయకులు పల్లెతుమ్మలపాలెంలో శనివారం పర్యటించారు. పల్లెతుమ్మలపాలెం, కోన, పోలాటితిప్ప తదితర గ్రామాల ప్రజలు ఆయనకు తమ సమస్యను వివరించారు.  

2,500 కుటుంబాలకు ఉపాధి కరువు

పల్లెతుమ్మలపాలెం, కోన, పోలాటితిప్ప గ్రామాల ప్రజలు భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి పొందుతున్నారని స్థానికులు కొల్లు రవీంద్రకు తెలిపారు. పోలాటితిప్ప సర్పంచ్‌ మోకారాజు, కోన గ్రామానికి చెందిన కోమటి వెంకటేశ్వరరావు, పల్లెతుమ్మలపాలేనికి చెందిన ఒడుగు నాగరాజు మాట్లాడుతూ సముద్రతీరం వెంబడి ఉన్న పల్లెతుమ్మలపాలెం, కోన, పోలాటితిప్ప గ్రామాల ప్రజలకు ఉపాధి కల్పించడానికి, ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురికాకుండా ఉండేందుకు అప్పటి మంత్రి నడకుదిటి నరసింహారావు చొరవతో 7వేల ఎకరాల్లో సాల్ట్‌ ఫ్యాక్టరీని నిర్మించారన్నారు. ఏటా డిసెంబరు నుంచి జూన్‌ వరకు 2,500 మందికి సాల్ట్‌ ఫ్యాక్టరీలో పని దొరుకుతుందని, ఒక్కో కుటుంబానికి రోజుకు రూ.2 వేలు అందుతాయన్నారు. మూడు గ్రామాలకు చెందినవారు 150కు పైగా ట్రాక్టర్లు కొని ఫ్యాక్టరీలో పనులకు కిరాయికి తిప్పుతున్నారని చెప్పారు. ఇప్పుడు ఫ్యాక్టరీని మూసేస్తే తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. 

రేపటి నుంచి పోరుబాట : కొల్లు రవీంద్ర

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ 3వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న భారత్‌ సాల్ట్‌ ఫ్యాక్టరీని లీజు సమయం అయిపోయిందనే కారణంతో మూసేసే ప్రయత్నం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. పేర్ని నాని తన స్నేహితుడితో ఇక్కడ విండ్‌ పవర్‌ ప్రాజెక్టును ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారని, అందుకు ఫ్యాక్టరీలోని భూముల్లో బోర్లు వేసి భూ పరీక్షలు నిర్వహించారని ఆరోపించారు. విండ్‌ పవర్‌ ప్రాజెక్టు ఏర్పాటుచేస్తే స్థానికులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అన్నీ సక్రమంగా నడుస్తున్న, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న భారత్‌ సాల్ట్‌ కంపెనీని కుట్రపూరితంగా మూసేసే ప్రయత్నం చేయడం వెనుక కారణాలపై మాజీమంత్రి పేర్ని నాని సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ మూడు గ్రామాల ప్రజలకు టీడీపీ అండగా ఉంటుందని, ఎంతటి పోరాటానికైనా సిద్ధమన్నారు.  సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చి ఉద్యమాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. మూడు గ్రామాల ప్రజలతో సొసైటీని ఏర్పాటుచేసి, వారి ద్వారా ఫ్యాక్టరీని నడిపేందుకు అవకాశం కల్పించాలని, దీంతో ఉపాధికి ఎలాంటి ఢోకా ఉండదని పేర్కొన్నారు. 


Read more