పుచ్చి..పురుగులు పట్టి..!

ABN , First Publish Date - 2022-09-17T06:46:56+05:30 IST

పుచ్చి..పురుగులు పట్టి..!

పుచ్చి..పురుగులు పట్టి..!
కిలో ప్యాకెట్‌కు 630 గ్రాములే..

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో నాసిరకం కందిపప్పు ప్యాకెట్ల పంపిణీ .. మాకొద్దని వెనక్కి ఇచ్చేసిన కార్డుదారులు

వాటిని డీలర్లకు ఇచ్చేసిన ఎండీయూలు.. డీలర్ల వద్ద భారీగా నాసిరకం ప్యాకెట్లు.. లబోదిబోమంటున్న డీలర్లు

తెల్లని ఫంగస్‌, రవ్వ, పొలుకులు, పుచ్చులు, పురుగులతో కూడిన నాసిరకం కందిపప్పు ప్యాకెట్లను  ఎండీయూ ఆపరేటర్ల ద్వారా కార్డుదారులకు అంటగట్టాలని సివిల్‌ సప్లయిస్‌ అధికారులు చూశారు. కానీ..కార్డుదారులు  వారికి దిమ్మ తిరిగే షాక్‌ ఇచ్చారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో అనేక చోట్ల నాసిరకం కందిపప్పును కార్డుదారులకు పంపిణీ చేశారు. ఆ ప్యాకెట్లు మాకొద్దంటూ కార్డుదారులు ఎండీయూ ఆపరేటర్లకు వెనక్కి ఇచ్చేశారు. ఆ ప్యాకెట్లను ఎండీయూ ఆపరేటర్లు డీలర్లకు తిరిగి ఇచ్చేశారు. దీంతో రెండు జిల్లాల్లోనూ డీలర్ల దగ్గర నాసిరకం కందిపప్పు ప్యాకెట్లు పెద్ద సంఖ్యలో మూలుగుతున్నాయి. కమీషన్‌ రాకపోగా, డబ్బులు కట్టి..శని తగిలించుకున్నట్టు ఉందని డీల్లర్లు లబోదిబోమంటున్నారు. నష్ట నివారణ కోసం డీలర్ల సంఘం నేతృత్వంలో ఏ ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నాసిరకం కందిపప్పు వచ్చిందనే వివరాలు సేకరిస్తున్నారు. 

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో కార్డు దారులకు సెప్టెంబరులో ఇవ్వా ల్సిన కందిపప్పు కోటాకు డీఎం, సివిల్‌ సప్లయిస్‌ అధికారులు భారీగా కోత పెట్టారు. సగటున చౌక డిపోకు రెండు క్వింటాళ్లు ఇవ్వాలి. క్వింటా మాత్రమే ఇచ్చా రు. డీలర్లతో రెండు క్విం టాళ్లకు డీడీలు కట్టించుకున్నారు. కంది పప్పు కోటాలో కోత పెడితే పెట్టారనుకుంటే ఇచ్చిన సరుకు నాసిరకంగా ఉంది. కందిపప్పు ప్యాకెట్లలో ఉండటంతో వాటిని తెరిచేవరకు చాలామంది కార్డు దారులు గుర్తించలేదు. ఎండీ యూ ఆపరేటర్లు బియ్యం తూకం వేశాక కందిపప్పు ప్యాకెట్లను అదే సంచిలో వేస్తుంటారు. దీంతో ప్యాకెట్లను చూసుకోని కార్డుదారులు ఇంటికి వెళ్లాక గుర్తించి ఎండీయూ ఆపరేటర్లకు తిరిగిచ్చేశారు. దీంతో ఎండీయూ ఆపరేటర్లు తమకు తిరిగి వచ్చిన ప్యాకెట్లను డీలర్లకు తిరిగిచ్చేస్తున్నారు. ప్రస్తుతం కోటా పూర్తవడంతో.. ఆలస్యంగా ప్యాకెట్లను చూసిన వారు ఎండీయూ ఆపరేటర్లకు ఇవ్వడం కుదరకపోవడంతో డీలర్లకు వెనక్కి ఇచ్చేస్తున్నారు. కమీషన్‌ రాకపోగా.. డీడీలు చెల్లించినందుకు నష్టపోవాల్సి వస్తోందని డీలర్లు లబోదిబో మంటున్నారు. నాసిరకం కందిపప్పు కావడంతో బయట అమ్ముకునే పరిస్థితి లేదని, అన్ని విధాలా నష్టపోతున్నామని డీలర్లు వాపోతున్నారు. కృష్ణాజిల్లాలో మచిలీపట్నం, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో నాసిరకం కందిపప్పు పంపిణీ అయింది. విజయవాడ ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలోనూ నాసిరకం పంపిణీ జరిగింది.

కాంట్రాక్టర్‌ కక్కుర్తి వ్యవహారమే!

నాసిరకం కందిపప్పు రావడానికి కాంట్రాక్టర్‌ కక్కుర్తి వ్యవహారమే కారణ మని తెలుస్తోంది. కాంట్రాక్టర్‌ కందిపప్పును నీటిలో నానబెట్టి ప్యాకింగ్‌ చేయ డంతో పప్పు బరువుగా ఉండి నిగనిగలాడుతూ కనిపిస్తుంది. సివిల్‌ సప్లయిస్‌కు వచ్చినపుడు బాగానే ఉన్నా..కొద్ది రోజులు గోడౌన్‌లో ఉండి.. డీలర్లకు వచ్చేటప్పటికీ మార్పు వచ్చి తేమవల్ల ఫంగస్‌ పడుతోంది. నాసిరకం పప్పు కావడంతో నూకగా, పిండి పిండిగా మారటం, తేమ కారణంగా పురు గులు పట్టడం జరుగుతోంది.

తూకంలోనూ తేడాలు

కార్డుదారులకు ఇచ్చిన నాసిరకం కందిపప్పు ప్యాకెట్ల తూకంలోనూ తేడా ఉంది. కాటా పెట్టి చూస్తే కిలోకు కనిష్టంగా 150 గ్రాముల నుంచి గరిష్టంగా 450 గ్రాముల వరకు తక్కువగా ఉంటోంది. నానబెట్టి బరువుగా ప్యాకింగ్‌ చేయడం, తర్వాత పప్పు ఎండిపోయి బరువు తగ్గిపోవటంతో అసలు పరిమాణం తేలుతోంది.

తనిఖీ చేయని డీఎంలు  

కందిపప్పు కోసం డీలర్ల మెడపై కత్తి పెట్టి డీడీలు కట్టించిన ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల సివిల్‌ సప్లయిస్‌ జిల్లా మేనేజర్లు స్టాక్‌ వచ్చాక ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు వచ్చి తనిఖీలు చేయకపోవటం గమనార్హం. స్టాక్‌ వచ్చినపుడు జిల్లా సివిల్‌ సప్లయిస్‌ మేనేజర్లు స్వయంగా పరిశీలిస్తే.. కాంట్రాక్టర్‌కు తిరిగి ఇచ్చేయ డానికి అవకాశం ఉంటుంది. స్టాక్‌ పాయింట్లను పరిశీలించకపోవడంతో కాంట్రాక్టర్లతో జిల్లా మేనేజర్లు లాలూచీ పడ్డారేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


Read more