రోడ్ల రొద!

ABN , First Publish Date - 2022-08-17T05:57:27+05:30 IST

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు.

రోడ్ల రొద!

మూడేళ్లుగా సీసీ రోడ్ల నిర్మాణం శూన్యం

 అధ్వానంగా మారిన రహదారులను పట్టించుకోని వైనం

 కేంద్ర పథకం కింద ఇచ్చిన నిధులతో ప్రభుత్వ భవనాల నిర్మాణం

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్టుంది గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ తీరు. సర్కారు నిర్లక్ష్యం వల్ల సీసీ రోడ్ల నిర్మాణానికి రెండు జిల్లాల్లో దిక్కు లేకుండా పోయింది. మూడేళ్లుగా సిమెంట్‌ రోడ్లకు మోక్షం కలగటం లేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఎస్‌) కింద ఒక్క సిమెంట్‌ రోడ్డును కూడా నిర్మించలేదు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ కూడా ప్రభుత్వ భవనాలకే కేటాయించింది.  

ఆంధ్రజ్యోతి, విజయవాడ : ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాల్లో మొత్తంగా వెయ్యికిపైగా గ్రామ పంచాయతీలున్నాయి. హామ్లెట్‌ పంచాయతీలతో కలిపి ఇంకా ఎక్కువే ఉన్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న కొన్ని పంచాయతీలు తమ సొంత నిధులతో సిమెంట్‌ రోడ్ల నిర్మాణం తలపెట్టడం తప్పితే.. ప్రభుత్వ పరంగా బడ్జెట్‌ కేటాయింపుతో జరిగిన సిమెంట్‌ రోడ్లు రెండు జిల్లాల్లోనూ లేవు. 

భవనాల నిర్మాణానికే ప్రాధాన్యత

గత రెండేళ్లుగా సీసీ రోడ్ల కోసం గ్రామాలు ఎదురుచూస్తున్నాయి. ప్రభుత్వ భవన నిర్మాణాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. రెండు జిల్లాల్లోనూ వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌లు, వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్ల భవనాలకు నిధులు మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ జిల్లాలో 268 గ్రామ సచివాలయాలు, 260 రైతు భరోసా కేంద్రాలు, 239 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్స్‌, 99 వైఎస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీలు, 20 బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్స్‌ భవనాలకు ఆమోదం లభించింది. కృష్ణా జిల్లాలో కూడా ఇదే సంఖ్యలో ప్రభుత్వం శాంక్షన్‌ ఇచ్చింది. రెండు జిల్లాల్లో కలిపి 3400 భవనాలకు రూ.500 కోట్ల వ్యయంతో బడ్జెట్‌ శాంక్షన్‌ ఇచ్చింది. ఈ బడ్జెట్‌ కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ శాంక్షన్‌ ఇచ్చిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధుల ద్వారానే చేపట్టడం గమనార్హం. 

కేంద్రం నిధులతో భవనాల నిర్మాణం

కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద జిల్లాకు కేటాయించిన బడ్జెట్‌ దాటి పోవటంతో సీసీరోడ్లకు గతి లేకుండా పోతోంది. ఉపాధి హామీ పథకం కింద కేంద్రం జిల్లాకు రూ.100 కేటాయిస్తే అందులో రూ.60 కూలీల వేతనాలు చెల్లిస్తుంది. మిగిలిన రూ.40 మెటీరియల్‌ కాంపోనెంట్‌కు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం చెల్లించే మెటీరియల్‌ కాంపోనెంట్‌లో కూడా 75 శాతం మాత్రమే చెల్లిస్తుంది. మిగిలిన 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. ఇలా మెటీరియల్‌ కాంపోనెంట్‌ కింద కేంద్రం ఇచ్చిన బడ్జెట్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తన ప్రాధాన్యతా భవనాలకు కేటాయించుకుంది.  

  గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు

 ఇటీవల తరచూ వర్షాలు పడటంతో.. గ్రామాల్లో రోడ్లు... గోతులతో బురదగా ఉంటున్నాయి. గత ప్రభుత్వంలో తలపెట్టిన వాటిలో ఇంకా బ్యాలెన్స్‌ 20 శాతం పనులు చేయాల్సి ఉండగా.. వాటన్నింటినీ ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసింది.  

Updated Date - 2022-08-17T05:57:27+05:30 IST