అడ్డదిడ్డంగా..

ABN , First Publish Date - 2022-07-18T06:18:26+05:30 IST

అడ్డదిడ్డంగా..

అడ్డదిడ్డంగా..

డ్రెయిన్‌లెస్‌ సీసీ రోడ్లతో ఇబ్బందులు

రోడ్డుకు మూడు నుంచి ఐదడుగుల లోతున నీటి పైపులు

డ్యామేజీ అయితే గుర్తించడం కష్టమే..

వర్షపు నీరు, మురుగు రోడ్లపైనే నిల్వ

క్రమంగా తాగునీటి పైపుల్లోకి..

కలుషిత నీటితో ప్రబలుతున్న డయేరియా 

రెండు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి 

తెంపల్లి ఘటనకూ ఇదే కారణం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : ‘డ్రెయిన్‌ లెస్‌ సీసీ రోడ్లు’ ప్రస్తుతం డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం ఇవే. పంచాయతీరాజ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ల మధ్య సమన్వయం లోపంతో సైడ్‌ డ్రెయిన్లు లేకుండా సీసీ రోడ్లను వేయడం వల్ల ఇళ్లలోని మురుగంతా రోడ్లపైకి చేరుతోంది. వర్షపు నీరు పల్లపు ప్రాంతాల్లో నిలబడిపోవడం వల్ల ఆ మురుగంతా అందులో కలిసిపోతోంది. చివరికి రోడ్ల కింద ఉన్న తాగునీటి పైపులైన్లలోకి చేరుతోంది. ఈ పైపులైన్లు భూమికి మూడు నుంచి ఐదడుగుల లోతున ఉంటున్నాయి. వాటిపైనే సీసీ రోడ్లు వేస్తున్నారు. దీనివల్ల పైపులైన్లకు డ్యామేజీ ఎప్పుడు, ఎక్కడ ఏర్పడుతుందో తెలియని పరిస్థితి. ఫలానా చోటే డ్యామేజీ అయిందని తెలుసుకునే వ్యవస్థ అందుబాటులో లేదు. సిమెంట్‌ రోడ్డు నిండా మురుగు పారుతుంటే భూగర్భంలో ఎక్కడ డ్యామేజీ అయ్యిందో తెలియని పరిస్థితి. దీనివల్ల కలుషిత నీరు పైపులైన్లలోకి చేరుతోంది. 

రెండు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి

తెంపల్లితో పాటు విజయవాడ రూరల్‌ మండలం రాయనపాడు, పైడూరుపాడు, కంకిపాడు మండలం ఉప్పులూరులోని ఇందిరమ్మ కాలనీ, మైలవరం మండలంలోని పొందుగల, గన్నవరం మండలంలోని వెంకట నరసింహాపురం.. ఇలా చెప్పుకొంటూ పోతే వందల ఉదాహరణలు ఉన్నాయి. డ్రెయిన్‌ లేకుండా సీసీ రోడ్లు నిర్మించటం, మంచినీటి పైపులైన్ల ఉనికి లేకుండా చేయడం పరిపాటైంది. తెంపల్లిలో సిమెంట్‌ రోడ్లు ఉన్నా డ్రెయినేజీ వ్యవస్థ లేదు. ఎప్పుడో పాతకాలంలో పైపులైన్లు వేసిన రోడ్లపైనే సిమెంట్‌ రోడ్లు వేశారు. ఏ ఇంటి ముందు వారు గోతులు తవ్వించుకుని మురుగునీటిని మళ్లించుకుంటున్నారు. డ్రె యిన్లు ఉంటే పారుదల ఉండేది. పైగా ఇది లోతట్టు ప్రాంతం కావటం వల్ల వర్షపునీరు సిమెంట్‌ రోడ్డుపై చెరువులా నిలిచిపోతోంది. మురుగు, వర్షపునీరు కలిసిపోయి రోడ్లపై రోజుల తరబడి నిల్వ ఉంటోంది. ఈ క్రమంలో సిమెంట్‌ రోడ్డు అడుగుభాగంలో ఉన్న పైపులు డ్యామేజీ కావటంతో నిల్వ ఉన్న నీరు అందులో కలుస్తోంది. ఇంటింటికీ సరఫరా అవుతోంది. డయేరియా ప్రబలుతోంది. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ నిధుల ద్వారా కానీ, డిస్ర్టిక్ట్‌ సపోర్టు యూనిట్‌ (డీఎస్‌యూ) నిధుల నుంచి కానీ సైడ్‌ డ్రెయిన్లకు తగిన బడ్జెట్‌ కేటాయించే అవకాశముంటుంది. దీనిద్వారా అయినా రెండు జిల్లాల్లోని ఈ సమస్యను పరిష్కరిస్తే డయేరియాకు ఫుల్‌స్టాప్‌ పెట్టొచ్చు. 


Updated Date - 2022-07-18T06:18:26+05:30 IST