ధాన్యం కొంటే ధన్యమే..!

ABN , First Publish Date - 2022-11-25T00:57:44+05:30 IST

ధాన్యం కొనుగోలులో గందరగోళం ఇప్పట్లో తొలగేలా లేదు. ఆర్‌బీకేల ద్వారానే కొంటామని అధికారులు చెబుతున్నా, అందుకు అనుగుణంగా సౌకర్యాలు, యంత్రాలు సమకూర్చలేదు. వలంటీర్లకు శాంపిళ్ల సేకరణ బాధ్యత అప్పగించినా సక్రమంగా చేయట్లేదు. వీటికి తోడు 17 పాయింట్ల తేమశాతం, 25 కిలోమీటర్లకు మించి రవాణా ఖర్చులు తలకుమించిన భారమైన నేపథ్యంలో అన్నదాతలు తలలు పట్టుకు కూర్చున్నారు.

ధాన్యం కొంటే ధన్యమే..!

ఇప్పటివరకు బ్యాంకు గ్యారెంటీ చెల్లించింది 40 మంది మిల్లర్లే

ప్రస్తుతం డ్రయ్యర్లు ఉన్న మిల్లులకే ధాన్యం

ఆర్‌బీకేల్లో అందుబాటులో లేని మిల్లింగ్‌ యంత్రాలు

ఇప్పటి వరకు 6 వేల టన్నులే కొనుగోలు

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : తేమశాతం కొలిచే యంత్రాలు, ధాన్యం కొనుగోలులో పాటించే నియమాలకు సంబంధించిన ఫ్లెక్సీలను మాత్రమే ఆర్‌బీకేలకు ఇచ్చారు. ధాన్యంలో నూకశాతాన్ని, నాణ్యతను పరిశీలించే మిల్లింగ్‌ యంత్రాలను ఇవ్వలేదు. డిసెంబరు 10వ తేదీ వరకు ధాన్యంలో 17 పాయింట్ల మేర తేమశాతం రావడం కష్టమని అధికారులే చెబుతున్నారు. అయినా ధాన్యంలో తేమశాతం 17 పాయింట్లు ఉంటేనే కొంటామని మెలిక పెడుతున్నారు. ధాన్యంలో తేమశాతం అధికంగా ఉందనే కారణంతో డ్రయ్యర్లు ఉన్న మిల్లులకే అధికారులు ధాన్యం ట్యాగింగ్‌ చేస్తున్నారు. నింబంధనల ప్రకారం 17 తేమశాతం ఉన్న ధాన్యాన్ని రైతులు విక్రయించినా చిన్న మిల్లులకు ధాన్యం ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 6వేల టన్నుల ధాన్యాన్ని సేకరించారు.

వలంటీర్లు శాంపిళ్లను సేకరిస్తారట

జిల్లాలో ధాన్యం సేకరణ అంశం గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న వలంటీర్ల చేతుల్లోకి వెళ్లిపోయింది. వలంటీర్లు పొలం వద్దకు వెళ్లి ధాన్యంరాశిలో నుంచి 8 చోట్ల శాంపిళ్లను సేరించాల్సి ఉంది. ఈ శాంపిళ్లను ఆర్‌బీకేలకు తీసుకొస్తే అక్కడ తేమశాతం ఎంత ఉందో పరిశీలిస్తారు. ధాన్యంలో నూకశాతం, నాణ్యతను పరిశీలించే మిల్లింగ్‌ మిషన్‌ యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో, ధాన్యం నాణ్యత పరిశీలన కోసం రైతులు మిల్లర్ల వద్దకు వెళ్లాల్సిన స్థితి నెలకొంది. నెలానెలా ఒకటో తేదీన సామాజిక పింఛన్లు ఇచ్చే పని తప్ప మరే ఇతర పనినీ వలంటీర్లు సక్రమంగా చేయట్లేదు. పొలానికి వెళ్లి ధాన్యం శాంపిళ్లను వారు ఎంతమేర తెస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్‌ సీజన్‌లో 1061, 1077, స్వర్ణ, 1318, 1261 తదితర రకాల వరివంగడాలను రైతులు సాగు చేశారు. ఏ రకం వంగడమో సాగు చేసిన రైతులకు తప్ప మిగిలిన వారికి తెలిసే అవకాశం లేదు.

గ్యారెంటీ చూపింది 40 మిల్లులే..

జిల్లాలో 176 రైస్‌మిల్లులున్నాయి. వాటిలో పనిచేసేవి 140. ఆర్‌బీకేల ద్వారా మిల్లరుకు ధాన్యం అప్పగించాలంటే సంబంధిత మిల్లు యజమాని బ్యాంకు గ్యారెంటీ (బీజీ) కచ్చితంగా చూపాలి. బీజీ ఉంటేనే మిల్లులకు ధాన్యం ఇచ్చే వెసులుబాటు ఉంది. ఇప్పటివరకు 40 మంది మిల్లర్లే బీజీ చూపారు. మిగిలిన 100 మిల్లుల యజమానులు బ్యాంకు గ్యారెంటీ చూపలేదు. రైతులు విక్రయించే ధాన్యాన్ని ఆన్‌లైన్‌ చేసి, కాటా వేసిన ట్రక్‌ సీట్‌ను జనరేట్‌ చేయాలి. దీంతోపాటే రైతు విక్రయించిన ధాన్యం వివరాలు, నగదు ఎంతమేర వస్తుంది అనేది లెక్కచూపుతుంది.

25 కిలోమీటర్ల వరకు రవాణాకు అనుమతి

అధిక శాతం మంది మిల్లర్లు బీజీలు చూపకపోవడంతో ధాన్యం రవాణాలో ప్రస్తుతం ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఏదైనా మండలంలోని పొలం నుంచి మిల్లు వరకు ధాన్యం రవాణా ఖర్చులు 25 కిలోమీటర్ల వరకు ఇస్తారు. కనీసం ఎనిమిది కిలోమీర్లలోపు దూరం ఉంటే టన్నుకు రూ.324 రవాణా చార్జీలుగా నిర్ణయించారు. 25 కిలోమీటర్ల కంటే అధిక దూరం ధాన్యం రవాణా చేయాల్సి వస్తే జేసీ అనుమతులు తీసుకోవాలి. ప్రస్తుతం అధికశాతం మంది మిల్లర్లు బీజీ చూపకపోవడంతో రైతుల నుంచి తీసుకున్న ధాన్యం దగ్గరలోని మిల్లులకు ఇవ్వలేని స్థితి నెలకొంది. ఉదాహరణకు మచిలీపట్నంలో 18 వరకు రైస్‌మిల్లులున్నాయి. వీటిలో డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్నవి ఎనిమిది. ఉయ్యూరు, కంకిపాడు నుంచి తేమశాతం అధికంగా ఉన్న ధాన్యం రవాణా చేయాలంటే 48 కిలోమీటర్లకు పైగా దూరం ఉంది. మచిలీపట్నంలో డ్రయ్యర్‌ సౌకర్యం ఉన్న మిల్లులకు ధాన్యం ఇవ్వాలంటే 25 కిలోమీటర్ల దూరం నిబంధన అడ్డు వస్తోంది.

ధాన్యంలో నాణ్యత లేకుంటే నష్టమే..

ట్రక్‌ షీట్‌ జనరేట్‌ అయ్యాకే ఏ మిల్లుకు ధాన్యం రవాణా చేయాలనేది నిర్ణయమవుతుంది. డీఎస్‌వో కార్యాలయంలో రైస్‌మిల్లులకు ట్యాగింగ్‌ చేసిన గ్రామాలను బట్టి ట్రక్‌ షీట్‌ బయటకు వస్తుంది. రైతులు పండించిన ధాన్యం మొత్తం నాణ్యతగా ఉండదని, రంగుమారిన ధాన్యం, బియ్యంలో పొట్టతెలుపు, తప్పతాలు, మట్టిగెడ్డలు, పరిపక్వతలేని గింజలు, కేళీలు, నూకశాతం అధికంగా నమోదు కావడం తదితర ఇబ్బందులు ఉంటాయని మిల్లర్లు చెబుతున్నారు. ఒకసారి ట్రక్‌ షీట్‌ జనరేటై రైతుపేరుతో, పూర్తిస్థాయి మద్దతు ధరతో ఎఫ్‌టీపీ వచ్చాక నాణ్యతలేని ధాన్యాన్ని మిల్లరు దిగుమతి చేసుకోవాల్సిందేనని, ఇలాగైతే తాము నష్టపోవాల్సిందేనని మిల్లర్లు అంటున్నారు. ధాన్యంలో నాణ్యతపై ఆర్‌బీకేల్లో పనిచేసే సిబ్బందికి అవగాహన ఎంతమేర ఉంటుందని మిల్లర్లు ప్రశ్నిస్తున్నారు. అన్ని గ్రామాల్లో నాణ్యమైన ధాన్యం ఉత్పత్తి జరగదంటున్నారు.

Updated Date - 2022-11-25T00:57:44+05:30 IST

Read more